సరికొత్త ప్రాంతీయ కూటమి ఆవిర్భావం
ఇజ్రాయిల్‌లో భారీ పోలింగ్
న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యంలో రాజకీయాలు, యుద్ధ వ్యూహాలు మంగళవారం కీలక మలుపు తిరిగాయి. ఈ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా కొత్త కూటమి ఏర్పడింది. మరోవైపు ఇజ్రాయిల్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఇజ్రాయిల్‌కు సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహూ రాజకీయ భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చబోతున్నాయి. ఇరాన్, గాజా యుద్ధాల నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన తీవ్రంగా శ్రమించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. 1981 తర్వాత ఈ స్థాయిలో ఎన్నడూ పోలింగ్ జరగలేదని విశ్లేషకులు తెలిపారు. మధ్యాహ్నానికే 31.5 శాతం పోలింగ్ నమోదైంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1.30 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. గురువారం నాటికి పూర్తి ఫలితాలపై స్పష్టత వస్తుంది. నెతన్యాహూ కూటమికి ఓటమి తప్పదని మెజారిటీ సర్వేలు తేల్చిచెబుతున్నాయి. ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని కూటమి ముందంజలో ఉన్నదని తెలుస్తోంది. రంగంలోకి దిగిన 'మక్కా కూటమి' అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు మరోసారి ఇరాన్‌పై దాడులకు దిగవచ్చన్న వార్తల నేపథ్యంలో ఓ సరికొత్త ప్రాంతీయ కూటమి తెర పైకి వచ్చింది. సౌదీ అరేబియా రక్షణ మంత్రి ఖలీద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ అశిమ్ మునీర్, టర్కీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇబ్రహీం కలిన్ సోమవారం టెహ్రాన్‌లో ఇరాన్ భద్రతాధికారులతో అత్యవసర చర్చలు జరిపారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను నివారించి శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా చేయడమే ఈ 'మక్కా కూటమి' దేశాల లక్ష్యం. ఈ చర్చలకు ఖతార్, రష్యా కూడా దౌత్యపరమైన మద్దతు ఇచ్చాయి. ఇదిలావుండగా మధ్యప్రాచ్యంలో పరిస్థితి దిగజారకుండా చూసేందుకు చైనా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇరు పక్షాలతో చర్చలు జరిపేందుకు త్వరలోనే ఓ ప్రత్యేక దౌత్య ప్రతినిధిని పంపుతానని ప్రకటించింది.
సౌదీపై హౌతీల దాడులు
హౌతీలు మంగళవారం సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపారు. తూర్పు, దక్షిణ ప్రాంతాల పైకి ఒకేసారి మూడు బాలిస్టిక్ క్షిపణులు, నాలుగు డ్రోన్లను ప్రయోగించగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు వాటిని గాలిలోనే కూల్చివేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా తన పౌరులకు సౌదీ ప్రయాణాలపై భద్రతా సంబంధమైన హెచ్చరికలు జారీ చేసింది.






కామెంట్‌లు (0)