Magazines

ఆర్‌ఐఎన్‌ఎల్‌‌ భూముల వేలం ప్రక్రియలో మార్పులు

57 నిమిషాల క్రితం

RINL
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

న్యాయ‌స్థానం ఆదేశాల‌తో వేలం నుంచి 35 ప్లాట్లు ఉప‌సంహ‌ర‌ణ‌
ఈ నెల 13న రూ.366 కోట్ల‌కు 150 ప్లాట్లు అమ్మ‌కం
నవంబ‌ర్ 3న మ‌రో 181 ప్లాట్ల అమ్మ‌కానికి వేలం


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో ​
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ నిర్వహణ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)కు చెందిన భూముల ఈ-వేలం ప్రక్రియలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్పులు చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌ఎంసీ) ఈ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు చెందిన విలువైన భూముల‌ అమ్మ‌కానికి కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పటికే వేలం ప్ర‌క్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈనెల 13న 150 ప్లాట్ల‌ను రూ.366.33 కోట్ల‌కు వేలంలో అమ్మేసింది. మ‌రో 181 ప్లాట్ల‌ను అమ్మేందుకు వేలానికి ముహుర్తం నిర్ణయించగా ఈనెల 30న జ‌ర‌గాల్సిన వేలం ప్ర‌క్రియ‌ను న‌వంబ‌ర్ 3కు వాయిదా వేసింది. రెండో ద‌శ‌లో 216 ప్లాట్ల వేలాన్ని ఈనెల 30న ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని 2026 ఆగ‌స్టు 31న ఎన్‌ఎల్‌ఎంసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే వేలం నిర్వహించాల్సిన 216 ప్లాట్లలో 35 ప్లాట్ల విక్రయాన్ని న్యాయస్థానం నిషేధించడంతో వాటిని వేలం ప్రక్రియ నుంచి తొలగించినట్టు ఎన్‌ఎల్‌ఎంసీ స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో 35 ప్లాట్లను వేలం నుంచి ఉపసంహరించగా, మిగిలిన 181 ప్లాట్ల వేలం షెడ్యూల్‌ను సవరించింది. వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌, ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండి) చెల్లింపు గడువును నవంబర్ 1న‌ రాత్రి 8 గంటల వరకు పొడిగించారు. అందుబాటులో 181 ప్లాట్లకు నవంబర్‌ 3న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ-వేలం నిర్వహించనున్నారు. ముందస్తు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నవారికి ఆస్తుల పరిశీలనకు అవకాశం కొనసాగుతుందని తెలిపింది. వేలం అనంతరం ఎంపికైన బిడ్డర్లకు లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ (ఎల్‌ఓఎ) జారీ చేస్తామ‌ని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల విభాగం కింద పనిచేస్తున్న ఎన్‌ఎల్‌ఎంసీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌ భూముల వేలం చేపట్టింది. ప్రస్తుత వేలంలో ఇదే చివరి దశ కావడంతో ఆసక్తి గల కొనుగోలుదారులు అందుబాటులో ఉన్న ప్లాట్ల వివరాలను పరిశీలించి, నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఈఎండీ చెల్లించాలని ఎన్‌ఎల్‌ఎంసీ సూచించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్