Magazines

అసహనం..ఆక్రోశం !

1 గంట క్రితం

Outrage!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

ఎన్నికల వేళ ట్రంప్‌ను

వెంటాడుతున్న ఓటమి భయం

నిజాయితీగా జరిగితేనే ఫలితాలను

అంగీకరిస్తానని వ్యాఖ్య

డెమొక్రాట్లు గెలిచినా తన చేతిలో 'వీటో' ఆయుధం ఉంటుందని బెదిరింపు

వాషింగ్టన్‌ : మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని అసహనాన్ని బయటపెడుతున్నాయి. ఎన్నికల ప్రచార ర్యాలీ కోసం టెక్సాస్‌ వెళుతున్న ట్రంప్‌ను మంగళవారం కొందరు విలేకరులు 'ఎన్నికల ఫలితాన్ని మీరు అంగీకరిస్తారా' అని ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ అవి నిస్పాక్షికంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా జరిగితేనే ఫలితాలను అంగీకరిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికలు సక్రమంగా, నిజాయితీగా జరిగితేనే ఫలితాలను గౌరవిస్తానని, ఒకవేళ రిపబ్లికన్లు కాంగ్రెస్‌లో మెజారిటీ కోల్పోయినా డెమొక్రాట్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రతిపక్ష డెమొక్రాట్లు విజయం సాధించినప్పటికీ దేశాధ్యక్షుడిగా తనకు బలమైన 'వీటో' అధికారం ఉంటుందని గుర్తు చేశారు. అవసరమైతే చట్టాలను అడ్డుకోవడానికి దానిని ప్రయోగిస్తానని అన్నారు. మిన్నెసోటా వంటి కీలక స్థానాల్లో ఓట్ల లెక్కింపు తర్వాత అవకతవకలు జరగకుండా ప్రభుత్వం నిఘా వేసి ఉంచుతుందని, రిపబ్లికన్‌ అభ్యర్థులు ఓడిపోతే అందుకు అక్రమాలే కారణం అవుతాయని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు.

అనుమానాలు రేకెత్తించడానికే...

ట్రంప్‌ వ్యాఖ్యల వెనుక వ్యూహాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు, ప్రధాన అంతర్జాతీయ వార్తా సంస్థలు అభిప్రాయపడ్డాయి. రిపబ్లికన్‌ పార్టీ ఓటమి చెందే అవకాశం ఉన్న స్థానాల్లో ఫలితాలు రాకముందే ఓటింగ్‌పై ప్రజల్లో అనుమానాలు సృష్టించడానికి ట్రంప్‌ 'కానీ', 'అయితే' అనే పదాలు ఉపయోగిస్తున్నారని విశ్లేషకులు తెలిపారు. ఒకవేళ డెమొక్రాట్లు ప్రతినిధిసభ లేదా సెనెట్‌లో మెజారిటీ సాధించినా తన వీటో హక్కు ద్వారా వారి అజెండాను అడ్డుకుం టానంటూ ట్రంప్‌ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సీఎన్‌ఎన్‌ పోల్‌ ఆప్‌ పోల్స్‌ సహా వివిధ సర్వేల ప్రకారం ట్రంప్‌ ప్రభుత్వ రేటింగ్‌ దారుణంగా పడిపోయింది. సుంకాలు, పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లపై తీవ్ర వ్యతిరేకత కన్పిస్తోంది. ఈ రాజకీయ ఒత్తిడి కారణం గానే ట్రంప్‌ 'మోసాల' అంశాన్ని ముందుకు తెస్తున్నారు.

అపనమ్మకాన్నే ఆయుధంగా మార్చి...

రిపబ్లికన్‌ పార్టీ నేతగా ట్రంప్‌కు ఇది ఐదవ జాతీయ ఎన్నిక. ఓటింగ్‌ వ్యవస్థ పైన, ఎన్నికల అధికారుల నిజాయితీ పైన అనుమానాలు లేవనెత్తడం ఆయనకు కొత్తేమీ కాదు. ఈ అపనమ్మకాన్నే ఆయన ఆయుధంగా వాడుకొని ఓట్ల లెక్కింపుకు ముందే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎన్నికలు నిస్పాక్షికంగా జరగకపోవచ్చునంటూ సందేహాలు లేవనెత్తుతారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి పాలైనప్పుడు పలువురు రిపబ్లికన్‌ ప్రతినిధులు, న్యాయస్థానాలు, చివరికి ప్రభుత్వ న్యాయ శాఖ సైతం ఎలాంటి అవకతవకలు జరగలేదని నిరూపించినా మోసం జరిగి పోయిందంటూ ఆయన పదే పదే ఆక్రోశం వెళ్లగక్కారు. ట్రంప్‌ తాజా వైఖరి ఆయన బెదిరింపు ధోరణికి అద్దం పడుతోంది.


ఏం చేసినా ఓటమి తప్పదు

మధ్యంతర ఎన్నికలను రిపబ్లికన్‌ పార్టీకి అనుకూలంగా మార్చేందుకు ట్రంప్‌ ఈ సంవత్సరంలో అనేక ప్రయ త్నాలు చేశారు. తీవ్ర పోటీ ఉన్న రాష్ట్రాలపై దృష్టి సారించి అక్కడ నిరంతర ప్రచారం నిర్వహించారు. భారీగా నిధులు సమీకరించి ప్రచార ప్రకటనల కోసం 277 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. సంప్రదా యకంగా డెమొక్రటిక్‌ ఓటర్లు ఎక్కువగా ఉపయోగించే పోస్టల్‌ బ్యాలెట్ల వినియోగానికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు. టెక్సాస్‌, ఇండియానా వంటి రిపబ్లికన్‌ పాలిత రాష్ట్రాల్లో అభ్యర్థుల విజయా వకాశాలను పెంచడానికి నియోజక వర్గాల సరిహద్దుల ను మార్చాలని పార్టీ నేతలకు సూచించారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు విజయం చేకూర్చేందుకు ట్రంప్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోవని విశ్లేషకులు, అంతర్జాతీయ మీడియా సంస్థలు కుండబద్దలు కొట్టి చెబుతున్నాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్