Magazines

అవినీతిని అరికట్టడం అందరి బాధ్యత!

1 గంట క్రితం

Curbing corruption is everyone's responsibility!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

లంచం అడిగితే ‘1064’ టోల్‌ఫ్రీ 
నెంబర్‌కు ఫిర్యాదు చేయండి: ఏసీబీ

సాంకేతిక సంస్కరణలతో దళారుల 
వ్యవస్థకు చెక్: జేటీసీలు

పారదర్శక సేవలకు కట్టుబడి ఉంటామని ‘సమగ్రత ప్రతిజ్ఞ’

రవాణా శాఖ, ఏసీబీ సంయుక్తంగా 
‘విజిలెన్స్ అవగాహనా సదస్సు’

నవతెలంగాణ-సిటీబ్యూరో

ప్రజాపాలనలో అవినీతిని నిర్మూలించడం కేవలం అధికారుల బాధ్యతే కాదని, ప్రతి పౌరుడి ఉమ్మడి బాధ్యత అని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు ‘సత్యనిష్ఠతో సమృద్ధి’ అనే నినాదంతో జరుగుతున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా.. బుధవారం హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ రవాణా శాఖ, ఏసీబీ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహ‌నా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, చలపతి, రాజేష్ మాట్లాడారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ చట్టరీత్యా తీవ్రమైన నేరాలని తెలిపారు. అవినీతి జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, అది జరగకుండా ముందుగానే అడ్డుకునే ‘నివారణాత్మక విజిలెన్స్’ అత్యంత కీలకమన్నారు. ఉద్యోగులు జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే నిర్భయంగా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

సాంకేతికతతో దళారుల ప్రమేయానికి చెక్: రవాణా శాఖ

రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు(జేటీసీలు) ఎం. చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వెంకటరమణ మాట్లాడుతూ.. రవాణా శాఖలో దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకు డిజిటల్ సంస్కరణలకు పెద్దపీట వేశామన్నారు. డీలర్ పాయింట్ వద్దే వాహన రిజిస్ట్రేషన్, ‘వాహన్-సారథి’ ద్వారా డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, ఆన్‌లైన్ పేమెంట్లు, స్లాట్ బుకింగ్, ఫ్యాన్సీ నంబర్ల ఈ-వేలం వంటి సేవల వల్ల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా పోయిందన్నారు. దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తున్నామని, అనవసర జాప్యం చేస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యాలయాల్లో దళారులు కనిపించకుండా విజిలెన్స్ విభాగం ఆకస్మిక తనిఖీలు చేపడుతోందని వివరించారు.

ఉద్యోగుల ‘సమగ్రత ప్రతిజ్ఞ’

అనంతరం రవాణా, ఏసీబీ అధికారులు, సిబ్బంది కలిసి ‘సమగ్రత ప్రతిజ్ఞ’ చేశారు. జీవితంలో ఎల్లప్పుడూ నిజాయితీని పాటిస్తూ, లంచం ఇవ్వబోమని, తీసుకోబోమని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ అధికారులు ఆకుల శ్రీనివాస్, సురేష్, ఈశ్వర్, రవికుమార్, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్