రాహుల్ గాంధీకి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆహ్వానం
ఈ నెలలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ఈ నెల 13, 14 తేదీల్లో జరగనున్న ‘భారత్ సమ్మిట్ –2026’ కు రావాలని లోక్ సభ ప్రతిపక్షనేత, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని జన్ పథ్ 10 లో రాహుల్ గాంధీని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణలో పీసీసీ అమలు చేస్తోన్న కార్యక్ర మాలపై రిపోర్ట్ సమర్పించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త డా. మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం నిర్మించిన మెమోరియల్ పార్క్ కు సంబంధించిన పుస్తకాన్ని రాహుల్ గాంధీకి అందజేశారు. దాదాపు అరగంటకుపైగా సాగిన ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో ఓబీసీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టడం, హైదరాబాద్ లో జరగనున్న భారత్ సమ్మిత్, పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ... ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ భారత్ సమ్మిట్ కు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నట్టు చెప్పారు. సార్వత్రిక ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ అంశాల పై సమ్మిట్లో చర్చలు జరుగుతాయన్నారు. గత ఏడాది సమ్మిట్లో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారని చెప్పారు. ఈ ఏడాది కూడా రాహుల్ తో పాటు ఢిల్లీ నుంచి పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొంటారని తెలిపారు. అంతర్జాతీయ ప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొనే ఈ సమ్మిట్ ఒక దిక్సూచిగా నిలువనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గిగ్ వర్కర్ల తో రాహుల్
భారత్ సమ్మిట్ తో పాటు గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ దిశలో సమావేశం ఏర్పాటు చేయాలని అగ్రనేత సూచించినట్టు చెప్పారు. రాహుల్ గాంధీ దిశా నిర్దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గిగ్ వర్కర్స్ చట్టాన్ని చేసిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ, ప్రభుత్వంలో ఓబీసీల ప్రాతినిధ్యం పై చర్చ జరిగిందన్నారు. సంస్థాగతంగా తెలంగాణలో కాంగ్రెస్ బూత్ స్థాయి నుంచి.. రాష్ట్రస్థాయి వరకు చేపట్టిన కార్యక్రమాలు రాహుల్ కు వివరించినట్లు చెప్పారు. నవంబర్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామన్నారు. అయితే నేతల మధ్యల గొడవలు, పంచాయితీ లపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఈ వ్యవహారం పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ చూసుకుంటారని తెలిపారు.
‘సర్’ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో సభ...
‘సర్’, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కు వ్యతిరేకంగా నవంబర్ 1 న రాహుల్ నేతృత్వంలో దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో నిర్వహించిన ర్యాలీ విజయవంతమైందని పీసీసీ గుర్తు చేశారు. ఇదే తరహాలో హైదరాబాద్ లో సర్ కు వ్యతిరేకంగా భారీ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మెగా బీసీ ర్యాలీకి రాహుల్ గాంధీని రావాలని కోరామన్నారు. అయితే ఈ ర్యాలీ కి సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్మెన్, అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకంపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.






కామెంట్లు (0)