డీలిమిటేషన్‌ పేరుతో ఎన్నికల మ్యాప్‌ మార్చే కుట్ర

7 గంటల క్రితం

Conspiracy to
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 2 నిమిషాల చదవడం

మోడీ, అమిత్‌ షా, ఎన్నికల కమిషనర్‌పై రాహుల్‌ విమర్శలు

మహిళా రిజర్వేషన్ల అమలుకు సీట్ల పెంపుతో

ముడిపెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్న

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

డీలిమిటేషన్‌ బిల్లు పేరుతో బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఎన్నికల అక్రమాల ఆరోపణలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో కొత్త మార్గంలో అధికారాన్ని కాపాడుకునేందుకు కేంద్రం డీలిమిటేషన్‌ను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. శనివారం నాడిక్క‌డ ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. ఎన్నికలను ఎక్కడైనా, ఎప్పుడైనా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చనే ఆలోచనకు కాలం చెల్లిందని, ప్రజలకు ఎన్నికల అక్రమాలపై అవగాహన పెరిగిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నట్లు తమ పార్టీ సర్వేలో వెల్లడైందని తెలిపారు.

​ లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కు పెంచాలని ప్రతిపాదించడం వెనుక ఉద్దేశమేంటని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిందని, దానిని అమలు చేయడానికి సీట్ల పెంపుతో ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశాన్ని అడ్డుపెట్టుకుని నియోజకవర్గాల పునర్విభజనకు భారీ అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. జమ్మూకాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన, బీహార్‌లో ఓటర్ల తొలగింపు, అసోంలో నియోజకవర్గాల మార్పులు, పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల అక్రమాలు జరిగాయని విమ‌ర్శించారు. వీటన్నింటినీ కలిపి చూస్తే ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అర్హత లేని ఓటర్లు ఓటు వేశారని ఎన్నికల సంఘమే చెప్పిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలనూ ప్రస్తావించారు.

​ డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు, దాని సభ్యుల ఎంపికలో కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి కీలక పాత్ర ఉండటం వల్ల అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కమిషన్‌ నిర్ణయాలను న్యాయస్థానాల్లో సవాలు చేసే అవకాశం లేకపోవడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు తాము వ్యతిరేకం కాదని, ప్రస్తుత లోక్‌సభ స్థానాల్లోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్‌ సహా ఇండియా బ్లాక్ కోరుతున్నాయని తెలిపారు. డీలిమిటేషన్‌ పేరుతో దేశ రాజకీయ ప్రాతినిధ్య స్వరూపాన్ని మార్చే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్