12 ఏండ్ల మోడీ పాలనలో రెట్టింపైన రైతు, కార్మికుల ఆత్మహత్యలు
పదేండ్లలో 28,095 నుంచి 63,456కు పెరుగుదల
12 ఏండ్లలో21 రెట్లు పెరిగిన అదానీ సంపద
తయారీ రంగంలో తగ్గిన జీడీపీ వాటా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ 12 ఏండ్ల పాలనలో అవలంబించిన కార్పొరేట్ అనుకూల విధానాల ప్రభావం దేశంలోని శ్రమజీవుల పాలిట శాపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, రోజువారీ కూలీలతో పాటు చిన్న పారిశ్రామికవేత్తల జీవితాలను ఈ విధానాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఓ వైపు రైతులు, కార్మికుల ఆత్మహత్యలు పెరుగు తుండగా మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుదేలై మూతపడు తున్నాయి. తయారీ రంగంలో జీడీపీ వాటా తగ్గిపోతోంది. కానీ కార్పొరేట్ల సంపద మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ ఆర్థిక అసమానతల తీవ్రతకు ఈగణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో చిన్న రైతులు, రోజువారీ కూలీల ఆత్మహత్యలు కలిపి 28,095గా ఉండగా 2024 నాటికి 63,456కు చేరింది. పదేండ్లలో దాదాపు 2.26 రెట్లు పెరిగింది. వ్యవసాయ రంగంలో సంక్షోభం, ఉపాధి అభద్రత, ఆదాయా లపై ఒత్తిడి వంటి సమస్యలు చిన్న రైతులు, కూలీల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తు న్నాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
21 రెట్లు పెరిగిన అదానీ సంపద
ఒకవైపు చిన్న రైతులు, కార్మికులు, చిన్న పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే, మరోవైపు కార్పొరేట్ సంపద భారీగా పెరగడం దేశంలో ఆర్థిక అసమానతలపై చర్చకు దారితీస్తోంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద 2014లో రూ.44,020 కోట్లుగా ఉండగా, 2026 నాటికి రూ.9.23 లక్షల కోట్లకు చేరినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. 12 ఏండ్లలో ఆయన సంపద దాదాపు 21 రెట్లు పెరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.9.13 లక్షల కోట్లుగా ఉండగా, అదానీ సంపద దానిని కూడా అధిగమించడం గమనార్హం. సుమారు 25 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్ర వార్షిక బడ్జెట్ కంటే ఒక పారిశ్రామికవేత్త వ్యక్తిగత సంపద అధికంగా ఉండటం సంపద కేంద్రీకరణ తీవ్రతను తెలియజేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థికంగా మిగులు రాష్ట్రాల సంఖ్య తగ్గుదల
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. 2018-19లో ఆదాయం కంటే వ్యయం తక్కువగా ఉండి, మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాల సంఖ్య 19గా ఉండగా, 2025-26 నాటికి ఆ సంఖ్య 11కు తగ్గింది. అంటే ఆర్థికంగా మిగులు సాధిస్తున్న రాష్ట్రాల సంఖ్యలోనూ గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఒకవైపు రైతులు, కార్మికుల ఆత్మహత్యలు పెరగడం, చిన్న పరిశ్రమలు మూతపడటం, తయారీ రంగం వాటా తగ్గడం, మరోవైపు కార్పొరేట్ సంపద విపరీతంగా పెరగడం వంటి పరిణామాలు దేశ ఆర్థిక విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకూ సమానంగా అందుతున్నాయా? ఉపాధి, వ్యవసాయం, చిన్న పరిశ్రమల బలోపేతానికి ప్రాధాన్యత లభిస్తోందా? అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.
ఐదేండ్లలో 2.04 లక్షల పరిశ్రమలు మూత
2021 నుంచి 2025 మధ్య ఐదేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా 2.04 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మూతపడ్డాయి. ఈ పరిణామం చిన్న పారిశ్రామికవేత్తలతో పాటు వాటిపై ఆధారపడిన కార్మికుల ఉపాధిపైనా తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా 2022 నాటికి దేశ జీడీపీలో తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు. 2014లో జీడీపీలో 16.2 శాతంగా ఉన్న తయారీ రంగం వాటా 2025-26 నాటికి 13.3 శాతానికి పడిపోయింది.






కామెంట్‌లు (0)