కోర్టు ధిక్కరణ నోటీసు రద్దు చేయండి. : కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: కాక్రోజ్ జనతా పార్టీ(సీజేపీ) ఆందోళనల నేపథ్యంలో దిల్లీలో విధించిన ఆంక్షల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదనే ఆరోపణలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ స్పందించారు. ఆ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించలేదని తన వివరణలో పేర్కొన్నారు. ఈ మేరకు తనపై జారీ చేసిన కోర్టు ధిక్కరణ నోటీసుకు సమాధానం ఇచ్చారు. అక్టోబర్ 10న సీజేపీ నిరసనలకు పిలుపునివ్వగా, 9న కొన్ని ప్రజాసేవలపై కేంద్ర హోంశాఖ ఆంక్షలు విధించింది. అందుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆంక్షలను తొలగించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాల తర్వాత కూడా కొన్ని పరిమితులు కొనసాగడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసు జారీ అయింది. దీనికి సమాధానంగా గోవింద్ మోహన్ తన వివరణను కోర్టుకు సమర్పించారు. శాంతిభద్రతల కోసమే ఆంక్షలు విధించాల్సి వచ్చిందని గోవింద్ మోహన్ తెలిపారు.
ఇంటర్నెట్ నిలిపివేతపై వివరణ
ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన అంశంపై కూడా గోవింద్ మోహన్ వివరణ ఇచ్చారు. ఒక రోజు పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఢిల్లీ పోలీసులు కోరినట్టు తెలిపారు. పోలీసుల నుంచి వచ్చిన అభ్యర్థనను చట్ట ప్రకారం పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
కోర్టు నోటీసు రద్దు చేయాలని విజ్ఞప్తి
ఆ వ్యవహారంలో తనపై జారీ చేసిన కోర్టు ధిక్కరణ నోటీసును రద్దు చేయాలని గోవింద్ మోహన్ సుప్రీంకోర్టును కోరారు. అదే సమయంలో, అవసరమైన పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసేందుకు అనుమతించేలా అక్టోబర్ 11న ఇచ్చిన ఆదేశాలను సవరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, అలాంటి చర్యలు చట్టపరమైన నిబంధనలు, అవసరమైన రక్షణ చర్యలకు లోబడి ఉండాలని తన అభ్యర్థనలో పేర్కొన్నారు.






కామెంట్లు (0)