27 నుంచి అమలుకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : 27 నుంచి కౌంటర్లో టిక్కెట్లు కొనుగోలు చేసినవారితో సహా రైల్వే ప్రయాణీకు లందరికీ తప్పనిసరిగా బీమా సౌకర్యం కల్పించాలని భారతీయ రైల్వేను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే రైల్వే బోర్డు నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. రైలు ప్రయాణికు లందరికీ రక్షణ కల్పించే చర్యలో భాగంగా ఈ నెల 6న ఈ ఆదేశాలు ఇచ్చింది. 2023 జూన్లో ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత దాఖలైన ఒక పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లో ఒడిషా ప్రమాదానికి 'కవచ్' భద్రతా వ్యవస్థను అమలు చేయకపోవడమే కారణమని ఆరోపించారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపేందుకు ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. అయితే, ఈ పిటిషన్ను విచారిస్తున్న జస్టిస్లు అహ్సనుద్దీన్ అమానుల్లా, ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ట్రాక్ల చుట్టూ కంచె, కౌంటర్లో కొనుగోలు చేసిన టిక్కెట్లకు బీమా లేకపోవడం వంటి ప్రయాణీకుల భద్రతకు సంబంధించిన మరికొన్ని అంశాలను కూడా విచారణ పరిధిలోకి చేర్చింది. అలాగే, ప్రయాణీకుల భద్రత కోసం కేటాయించిన నిధులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే బడ్జెట్లోనైనా మరిన్ని నిధులు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. కవచ్ భద్రతా వ్యవస్థను విస్తరించడం, రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ట్రాక్ల చుట్టూ కంచె.. అంశాలపై తీసుకొంటున్న చర్యలపై పూర్తి వివరాలను ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వివరాలను రెండు నెలల్లోగా అంద చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే, కౌంటర్ల వద్ద టిక్కెట్లు కొనుగోలు చేసే ఆర్థికంగా వెనుకబడిన ప్రయాణికులకు బీమా కవరేజీని విస్తరించేందుకు అధికారులకు తగినంత సమయం ఇచ్చామని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేనందున, రెండు వారాలలోగా అంటే, 2026 అక్టోబర్ 27 నుండి, అన్ని రైల్వే స్టేషన్లలో కౌంటర్లో విక్రయించే అన్ని టిక్కెట్లకు కూడా ఆన్లైన్లో కొనుగోలు చేసిన టిక్కెట్ల మాదిరిగానే బీమా వర్తింపజేయాలని ఆదేశిస్తున్నట్టు తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 16కి వాయిదా వేసింది.






కామెంట్లు (0)