స్కాలర్షిప్ల అమలులో లోపాలు
కేంద్రం, రాష్ట్రాలను నిలదీసిన పార్లమెంటు పీఏసీ
న్యూఢిల్లీ : ఎస్సీ విద్యార్థులకు అందించే ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతనాల అమలులో అక్రమాలు, ఇతర లోపాలు బయటపడటంపై పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2025 నివేదికలో గుర్తించిన లోపాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అనుమానాస్పద అంశాలపై ప్రభుత్వాల వివరణలను ప్రశ్నించింది. ఈ అంశాలపై వివరణ ఇచ్చేందుకు గురువారం హాజరుకావాల్సిన ఆరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు గైర్హాజరు కావడంతో వారిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో స్కాలర్షిప్ల అమలులో తలెత్తిన లోపాలపై చర్చించారు. ఉపకార వేతనాల అమలులోని సమస్యలకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలదే బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. అయితే, కాగ్ గుర్తించిన లోపాలపై బాధ్యతను తప్పించుకునే ధోరణిని కమిటీ ప్రశ్నించింది. ప్రతి అంశంపై తీసుకున్న చర్యలు, లోపాల సవరణకు చేపట్టిన చర్యల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను నెల రోజుల్లో సమర్పించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖను ఆదేశించింది. విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనాల పంపిణీలో పారదర్శకతను పెంచడం, అక్రమాలకు తావులేకుండా చూడటం, కాగ్ గుర్తించిన లోపాలను సరిదిద్దడం వంటి అంశాలపై ప్రభుత్వాలు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. ఆరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల గైర్హాజరుపై పీఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.






కామెంట్లు (0)