నవంబర్ 26న రాజ్యాంగ పరిరక్షణ కోసం భారీ సభలు
సర్ రద్దు చేయాలి :
సీపీఐ నేతలు నారాయణ, కె. రామకృష్ణ
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించాలని సీపీఐ నేతలు కె.నారాయణ, కె. రామకృష్ణ పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం నవంబర్ 26న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీ సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా లక్షలాది మందితో మూడు రోజుల పాటు జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సీపీఐ జాతీయ కార్యాలయంలో రెండు రోజుల పాటు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కె. గిరీష్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం బుధవారం ఏపీ భవన్‌లో నారాయణ, రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం నవంబర్ 26న అన్ని రాష్ట్రాల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ నిపుణులు, ఇతర వామపక్ష పార్టీల నాయకులను కూడా ఈ సభలకు ఆహ్వానించాలని కోరారు.వచ్చే నెల 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులతో పాటు లక్షలాది మంది పాల్గొని జైళ్లను నింపాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. 25 కిలోల బియ్యం ధర రూ.2,100కు పైగా చేరడం ధరల భారానికి నిదర్శనమని పేర్కొన్నారు. బియ్యం, పప్పులు, వంటనూనెల ధరలతోపాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. కేంద్ర పాలకుల అనాలోచిత విధానాలే ధరల పెరుగుదలకు కారణమని విమర్శించారు.ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టనున్న సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1 నుంచి 3 వరకు జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమెరికా అడుగుజాడల్లో మోడీ నడుస్తున్నారు అని అన్నారు.






కామెంట్‌లు (0)