Magazines

వికలాంగుల కోసంప్రతి శాఖలో నోడల్ అధికారి.. ప్రత్యేక బడ్జెట్

10 నిమిషాల క్రితం

A nodal officer for persons with
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

వికలాంగుల కోసం ప్రతి ప్రభుత్వ శాఖలో అందుబాటు సౌకర్యాల కల్పన, నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రతిపాదించారు. ఆయా శాఖలు తమ వార్షిక బడ్జెట్‌లో ఈ సౌకర్యాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి, నిర్దిష్ట గడువుతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. భవనాల తనిఖీల్లో దివ్యాంగుల సంఘాలు, సాంకేతిక నిపుణులకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం–2016 నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయాలనీ, కొత్త భవనాల నిర్మాణ అనుమతుల సమయంలోనే నిర్దేశిత అందుబాటు ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు దృష్టి, వినికిడి లోపాలు కలిగినవారికి కూడా సులభంగా అందుబాటులో ఉండేలా సాంకేతిక మార్పులు చేపట్టాలని సూచించారు. ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ సిబ్బందికి అందరికీ అందుబాటులో ఉండే నిర్మాణ విధానాలు, దివ్యాంగుల అవసరాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ స్థాయి శాఖాపరమైన సదస్సులో బుధవారం పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ తో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుగమ్య భారత్‌ను జాతీయ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. మెట్రో నగరాలు, విమానాశ్రయాలు, ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వికలాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ భవనాలతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు, ప్రజా రవాణా వ్యవస్థల్లో ర్యాంపులు, లిఫ్టులు, స్పర్శ ఆధారిత మార్గాలు, ప్రత్యేక మరుగుదొడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలు, ప్రజా ప్రదేశాల్లో అందుబాటు సౌకర్యాల స్థితిని పర్యవేక్షించేందుకు సమగ్ర జాతీయ డిజిటల్ వేదికను ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. ప్రతి శాఖ తన పరిధిలోని భవనాల వివరాలు, సౌకర్యాల స్థితి, పనుల పురోగతిని ఫొటోలతో సహా నమోదు చేయాలని సూచించారు. వికలాంగులు తమ సమస్యలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించే వ్యవస్థను తీసుకురావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో వివిధ రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకుంటూ ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. వికలాంగులకు కల్పించే సౌకర్యాలు వయోవృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు, తాత్కాలికంగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ప్రయోజనం చేకూరుస్తాయని మంత్రి వివరించారు.

​

​

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్