పదేండ్ల లో నాలుగు రెట్లు పెరిగిన పసిడి ధర
గరిష్ఠ స్థాయి నుంచి తగ్గినా కొనుగోలు భారమే
ముంబయి: కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గుతోందన్న వార్త కొంత ఊరటనిస్తున్నా, సామాన్యులకు ఇంకా అందనంత దూరంలోనే ఉంది. పదేండ్ల క్రితం తులం బంగారం కొనడానికి రూ.30 వేల లోపు ఖర్చు చేస్తే సరిపోయేది. ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.1.26 లక్షలకు పైగా ఉంది. గత రెండేండ్ల లోనే ధర అసాధా రణంగా పెరిగింది. ఈ ఏడాది రికార్డు స్థాయికి చేరిన ధర ఇప్పుడు గణనీయంగా పడిపోతు న్నప్పటికీ, గత దశాబ్దంలో నమోదైన పెరుగుదలతో పోలిస్తే ఈ తగ్గుదల స్వల్పమే!
2016లో పది గ్రాముల బంగారం ధర సుమారు రూ.29 వేలుండగా, 2026 జనవరిలో దేశీయ మార్కెట్లో రూ.1.80 లక్షలకు చేరువగా నమోదైంది. గత పదేండ్ల లో నాలుగు రెట్లకు పైగా పెరిగింది. 2016 ధరతో పోలిస్తే ప్రస్తుత ధర సుమారు 332 శాతం పెరిగింది. ఈ ఏడాది గరిష్ఠ స్థాయితో పోలిస్తే మాత్రం ధర సుమారు 30 శాతం తగ్గింది.
ఎందుకు పెరిగింది?
- కరోనా సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి పెరగడంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లారు.
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం బంగారానికి డిమాండ్‌ను పెంచాయి.
- వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకోవడానికి పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేశాయి.
- అమెరికా డాలర్ బలహీనపడటం, వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు కూడా బంగారం ధరను పెంచాయి.
- రూపాయి విలువ తగ్గడం వల్ల భారతదేశంలో బంగారం ధర మరింత పెరిగింది.
- మదుపుదారులు బంగారం ఈటీఎఫ్‌లు, బులియన్ వంటి వాటిలో పెట్టుబడులు పెంచడంతో డిమాండ్ పెరిగింది.
ఇప్పుడు ఎందుకు తగ్గుతోంది?
- అమెరికా డాలర్ బలపడటంతో ఇతర దేశాల పెట్టుబడిదారులకు డాలర్లలో కొనుగోలు చేసే బంగారం ఖరీదైనదిగా మారింది. దీంతో డిమాండ్ తగ్గింది.
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బలపడుతున్నాయి. బంగారం వడ్డీ రాబడి ఇవ్వని ఆస్తి కావడంతో వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు వంటి పెట్టుబడులు ఆకర్షణీయంగా మారతాయి. ఇది బంగారం పెట్టుబడులపై ఆసక్తిని తగ్గిస్తోంది.
-గత కొన్నేళ్లగా బంగారం కొన్న మదుపుదారులు లాభాలను స్వీకరించేందుకు విక్రయాలు చేస్తున్నారు. ఈ అమ్మకాలు ధర తగ్గుదలకు కొంత కారణం.
- ఇతర మార్కెట్లలో నష్టాలు ఎదురైనప్పుడు నగదు సమకూర్చుకోవడానికి బంగారాన్ని విక్రయించడం కూడా మరొక కారణం.
సామాన్యులకు భారం
బంగారం ధర పెరగడం మదుపుదారులకు లాభదాయకంగా కనిపించినా, కుటుంబ అవసరాల కోసం కొనుగోలు చేసేవారికి మాత్రం చాలా భారంగా మారింది. వివాహాలు, పండుగలు, కుటుంబ సంప్రదాయాల కోసం బంగారం కొనుగోలు చేసే మధ్యతరగతి కుటుంబాలు ధరల పెరుగుదలతో తమ కొనుగోళ్లను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో 10 గ్రాముల బంగారం కొనడానికి ఒక నెల లేదా రెండు నెలల ఆదాయం సరిపోయే కుటుంబాలకు ఇప్పుడు అనేక నెలల ఆదాయం అవసరమవుతోంది. దీంతో నగల కొనుగోళ్లలో బరువు తగ్గించడం, తక్కువ క్యారెట్ల నగలు కొనడం, పాత నగలను మార్పిడి చేసుకోవడం, కొనుగోళ్లను వాయిదా వేయడం వంటి మార్పులు కనిపిస్తున్నాయి. 2025లో మనదేశంలో బంగారం కొనుగోళ్లు 2024తో పోలిస్తే 24 శాతం తగ్గాయి. 2024లో 563.4 టన్నుల బంగారు ఆభరణాలు కొనుగోలు చేయగా, 2025లో 430.5 టన్నులకు పడిపోయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆభరణాల కొనుగోళ్లు 20 శాతం తగ్గాయి.
ధర ఇంకా తగ్గుతుందా?
అమెరికా వడ్డీ రేట్లు పెరిగితే, డాలర్ మరింత బలపడితే బంగారం ధర మరింత తగ్గవచ్చు. అయితే ఇప్పటికే గరిష్ఠ ధర నుంచి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కొనుగోళ్ల మద్దతుతో మధ్యలో ధర కోలుకునే అవకాశమూ ఉంది. ప్రస్తుత పతనాన్ని అసాధారణ పెరుగుదల తర్వాత జరుగుతున్న మార్కెట్ సర్దుబాటుగా చూడాలి.
పదేండ్లలో నాలుగు రెట్లు..
సంవత్సరం 10 గ్రాముల ధర 2016
2017 29,615
2018 31,438
2019 38,019
2020 50,358
2021 48,860
2022 52,599
2023 60,537
2024 75,890
2025 1,23,604
2026 నవంబర్ 21 నాటికి సుమారు రూ.1,26,000






కామెంట్లు (0)