Magazines

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా మార్గదర్శకాలు జారీ

45 నిమిషాల క్రితం

decreases
avatar
balaji

ప్రచురించబడింది నవం 22, 2026 | 2 నిమిషాల చదవడం

ఒకరికంటే ఎక్కువ మంది నామినీలు పెట్టుకోవచ్చు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ) కింద లబ్ధిదారుల నమోదు కోసం రాష్ట్ర ప్రణాళికా శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే బీమా పథకంలో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో ఆయన/ఆమె నామినీలకు రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

నమోదు ప్రక్రియ

నమోదు సమయంలో బీమా పొందే వ్యక్తి, నామినీల వివరాలు, ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను ఎంపిక చేసుకున్నప్పుడు బీమా పరిహారాన్ని వారి మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలనే అంశాలను అధికారులు స్పష్టంగా వివరించాలి. లబ్ధిదారుల వివరాలు పూర్తిగా, కచ్చితంగా, ఎలాంటి పునరావృత నమోదు లేకుండా నమోదు చేయాలి. రేషన్ కార్డు నంబరునే దరఖాస్తు ఫారం నంబరుగా పరిగణిస్తారు.ఒకసారి నమోదు చేసుకున్న బీమా లబ్ధిదారుడికి బీమా రక్షణ ప్రారంభమైన తేదీ నుంచి సంబంధిత పాలసీ సంవత్సరం ముగిసే వరకు పూర్తి బీమా రక్షణ ఉంటుంది. ఈ కాలంలో లబ్ధిదారుడు గరిష్ఠ వయోపరిమితిని దాటినా, ఆ పాలసీ సంవత్సరం ముగిసే వరకు బీమా రక్షణ కొనసాగుతుంది.

శిబిరాల ద్వారా నమోదు

శిబిరాల ద్వారా నమోదు చేయడం వల్ల దరఖాస్తుదారులకు నేరుగా అధికారులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. వివరాలను పరిశీలించడం, సందేహాలను నివృత్తి చేయడం, అవసరమైన సమాచారాన్ని అక్కడికక్కడే సరిచేసుకోవడం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.నామినీల పేర్లు ఆన్‌లైన్ వ్యవస్థలో ఇప్పటికే నమోదై ఉన్న కుటుంబ సభ్యుల జాబితా నుంచి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. నామినీలలో ఎవరైనా మైనర్ (18 ఏండ్లలోపు వారు) అయితే, వారి తరఫున బీమా పరిహారాన్ని స్వీకరించేందుకు ఒక మేజర్ (18 ఏండ్లు నిండిన వ్యక్తి) పేరును అపాయింటీగా నమోదు చేయాలి. ఒకరి కంటే ఎక్కువ మంది మైనర్ నామినీలు ఉన్నా అనుమతిస్తారు.

అపాయింటీగా నమోదు చేసే వ్యక్తి కుటుంబ సభ్యుడే అయి ఉండాల్సిన అవసరం లేదు. విజయవంతంగా నమోదు పూర్తయిన ప్రతి లబ్దిదారుడికి లావాదేవీ గుర్తింపు సంఖ్య (ట్రాన్సాక్షన్ ఐడీ)తో కూడిన రసీదు సందేశం పంపిస్తారు. ప్రతి నమోదు శిబిరంలో ఫిర్యాదులు, సందేహాలు, వివరాల్లో తేడాలు, ఇతర ప్రత్యేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్ లేదా బాధ్యతాయుత అధికారిని నియమించాలి.


అర్హత ప్రమాణాలు...

- ప్రతి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఈ పథకంలో నమోదు చేసుకునే అర్హత ఉంటుంది. సాధారణంగా కుటుంబం ప్రకటించిన సంపాదించే వ్యక్తికి ప్రాధాన్యత ఉంటుంది. - నమోదు చేసుకునే సమయానికి వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. -1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించిన వారు ఈ పథకానికి అర్హులు. - వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. - ఆధార్ కార్డులో పుట్టిన సంవత్సరం మాత్రమే నమోదై ఉంటే, సంబంధిత సంవత్సరం జూలై 1వ తేదీని పుట్టిన తేదీగా పరిగణిస్తారు. -ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే, ముందుగా గుర్తింపు పొందిన ఆధార్ కేంద్రంలో సరిచేసుకున్న తర్వాతే ఈ పథకంలో నమోదు చేసుకోవాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్