యలహంక ప్యాలెస్‌కు
వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
బెంగళూరు : ఏపీసీసీ అధ్యక్షురాలు, జగన్ సోదరి వైఎస్ షర్మిలను బెంగళూరు పోలీసులు అడ్డుకున్నారు. తల్లి విజయమ్మ, కుమారుడు, కోడలితో కలిసి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న షర్మిలతో పోలీసులు చర్చించారు. యలహంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు అనుమతి లేదని, కోర్టు ఆదేశాలు పాటించాలని సూచించారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆమెను యలహంక వెళ్లే రోడ్డులోకి అనుమతించకుండా.. బెంగళూరు నగరంలోకి వెళ్లేలా వాహనాలను దారి మళ్లించారు. దీంతో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. చివరికి ఆమె ఓ ప్రయివేటు హోటల్‌కు బయల్దేరారు. షర్మిల బెంగళూరు వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగానే.. విమానాశ్రయం, యలహంక ప్యాలెస్ వద్ద భారీగా మోహరించారు. పెండ్లి పనుల్లో భాగంగా షర్మిల మూడు రోజుల కిందట యలహంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్యాలెస్‌లో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు సిలికాన్ బిల్డర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి భీమిశెట్టి రమేష్‌బాబు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సంస్థలో 2017 ఫిబ్రవరి 16 వరకు వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉన్నారు. భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ఎల్ఎల్పీలో రమేష్‌బాబు, భారతి ప్రస్తుతం డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.‘భారతి తల్లి ఈసీ సుగుణమ్మ 2007 మార్చి 1న 20 ఏండ్ల కాలానికి (2027 ఫిబ్రవరి 28 వరకు) ప్యాలెస్‌ను మా సంస్థకు లీజుకిచ్చారు. ప్యాలెస్‌లో పండ్ల తోటలు, మొక్కలు, గెస్ట్‌హౌస్‌లు, ఇతర కట్టడాల అభివృద్ధికి భారీగా ఖర్చు చేశాం. సుగుణమ్మ 2026 ఆగస్టు 27న తన కుమార్తె భారతి, మనుమరాళ్ల పేరున ఈ ప్యాలెస్‌ను గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు. ఆస్తి హక్కులు వారికి బదిలీ అయ్యాయి. ప్యాలెస్‌లోని గెస్ట్ హౌస్‌లో తాత్కాలికంగా ఉండటానికి గతంలో అనుమతి పొందిన షర్మిల.. ఇప్పుడు అలంకరణ పనులు చేపట్టే కారణంతో బయట వ్యక్తులను ప్యాలెస్‌లోకి పంపుతున్నారు. షర్మిల, ఆమె మనుషుల జోక్యాన్ని అడ్డుకోకపోతే అక్కడి కట్టడాలు, పండ్ల చెట్లకు నష్టం జరిగే ప్రమాదం ఉంది’ అని రమేష్‌బాబు తరపున న్యాయవాది సుధీర్ మేడమ్మయ్య వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయాధికారి.. యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల, ఆమెకు సంబంధించిన వ్యక్తులను ప్రవేశించకుండా నిలువరిస్తూ ఉత్తర్వులిచ్చారు. విచారణను డిసెంబరు 19కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.






కామెంట్లు (0)