అమెరికా చర్యలతో
ఆత్మనిర్భర్కూ దెబ్బ
పీఎల్ఐ విధానాలపై అభ్యంతరాలు
న్యూఢిల్లీ : అమెరికా అధిక టారిఫ్‌లతో మేక్ ఇన్ ఇండియాకు తూట్లు పొడుస్తోంది. భారత్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చేపడుతున్న విధానాలను ట్రంప్ ఇప్పుడు వాణిజ్య ఒత్తిడికి సాధనంగా మార్చుకుంటోంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాల ద్వారా భారత్ తయారీ రంగాన్ని విస్తరించడాన్ని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటెటివ్ (యూఎస్టీఆర్) ప్రశ్నించింది. ఇవి అధిక ఉత్పత్తి సామర్థ్యానికి దారితీసే విధానాలుగా అభివర్ణిస్తోంది. మార్కెట్ డిమాండ్‌కు మించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, అదనపు ఉత్పత్తిని ఎగుమతుల ద్వారా ఇతర దేశాల మార్కెట్లలోకి పంపడం అమెరికా కంపెనీలకు నష్టం కలిగిస్తోందన్న వాదనతో భారత్‌పై 25 శాతం వరకు సుంకాలు విధించేందుకు ప్రతిపాదించింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ సుంకాన్ని 17 శాతానికి తగ్గించే అవకాశాన్ని కూడా ముందుకు తెచ్చింది. దేశీయ పరిశ్రమలను బలోపేతం చేసుకునేందుకు భారత్ చేపడుతున్న విధానాలను అమెరికా తన వాణిజ్య ప్రయోజనాలకు విరుద్ధంగా చిత్రీకరించడం ఈ వివాదంలో ప్రధానాంశం.
పారిశ్రామిక విధానాలే అభ్యంతరం..
భారత్ తయారీ రంగాన్ని విస్తరించేందుకు చేపట్టిన పారిశ్రామిక ప్రణాళికలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలు, ఎగుమతుల లక్ష్యాలను యూఎస్టీఆర్ తన 126 పేజీల నివేదికలో ప్రస్తావించింది. ప్రభుత్వ విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాల వల్ల మార్కెట్ అవసరాలకు మించి ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోందని ఆరోపించింది. దేశీయ మార్కెట్లో వినియోగం పెరగకపోతే అదనపు ఉత్పత్తి విదేశీ మార్కెట్లకు చేరి ధరలపై ఒత్తిడి పెంచుతుందని, అమెరికా తయారీ సంస్థల ఉత్పత్తి, పెట్టుబడులు, ఉద్యోగాలకు నష్టం కలిగిస్తుందని వాదిస్తోంది. ఈ పరిస్థితిని ‘స్ట్రక్చరల్ ఎక్సెస్ కెపాసిటీ’గా పేర్కొంటోంది. అయితే దేశీయ తయారీని పెంచడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలను అమెరికా పోటీగా భావిస్తోంది.
25 లేక 17 శాతమా..?
1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద యూఎస్టీఆర్ భారత వస్తువులపై 25 శాతం వరకు సుంకాలు విధించే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. భారత్‌తో పరస్పర వాణిజ్య ఒప్పందం కుదిరి, విచారణలో పేర్కొన్న అంశాలను పరిష్కరిస్తే 17 శాతం సుంకాన్ని పరిశీలించే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రతిపాదన ఇంకా తుది నిర్ణయం కాదు. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించడం, విచారణ అనంతరం తుది చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే వాణిజ్య ఒప్పంద చర్చల్లో సుంకాల ముప్పును అమెరికా ఒత్తిడి సాధనంగా ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ తయారీ రంగాన్ని జిడిపిలో 25 శాతం వాటాకు పెంచాలన్న లక్ష్యాన్ని యుఎస్టిఆర్ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. పీఎల్ఐ కింద కంపెనీలు అదనపు ఉత్పత్తి, అమ్మకాల ఆధారంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందుతున్నాయి. దేశీయ తయారీని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఎగుమతులను విస్తరించడం ఈ పథకం లక్ష్యాలు. అయితే ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించడం వల్ల మార్కెట్ అవసరాలకు మించి సామర్థ్యం ఏర్పడే అవకాశం ఉందని యూఎస్టీఆర్ వాదిస్తోంది.
ఆత్మనిర్భర్ భారత్‌పైనా అక్కసు..
దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలన్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంపైనా అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఉత్పత్తి లక్ష్యాలు, దేశీయ తయారీకి మద్దతు ఇచ్చే విధానాలు మార్కెట్ పరిస్థితులకు మించి సామర్థ్యాన్ని పెంచుతున్నాయని ఆరోపిస్తోంది. దేశీయ వినియోగం అదనపు ఉత్పత్తిని గ్రహించలేకపోతే ఎగుమతుల రూపంలో ఇతర దేశాలకు చేరుతుందని, తద్వారా అమెరికా కంపెనీలకు పోటీ పెరుగుతుందని వాదిస్తోంది. దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇచ్చే విధానాలను అమెరికా వాణిజ్య పరిమితులుగా విశ్లేషిస్తున్న తీరు ఈ వివాదాన్ని మరింత పెంచుతోంది.
ఫార్మా, ఐటీ, ఉక్కు రంగాలపై ప్రత్యేక దృష్టి..
భారత్‌లో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదల, సోలార్ మాడ్యూల్స్ తయారీ విస్తరణ, ఔషధాలు-వైద్య పరికరాల తయారీ, సమాచార-సాంకేతిక రంగాల్లో దేశీయ ఉత్పత్తి విధానాలను అమెరికా పరిశీలించింది. దేశీయ అవసరాలకు మించి ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడుతోందని, ప్రభుత్వ విధానాలు ఈ విస్తరణకు తోడ్పడుతున్నాయని యూఎస్టీఆర్ ఆరోపిస్తోంది. ఔషధాలు, ఐసిటి రంగాల్లో దిగుమతి విధానాలు, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
చైనా పెట్టుబడులపైనా దృష్టి..
భారత్ తయారీ రంగంలో చైనా వంటి నాన్-మార్కెట్ ఆర్థిక వ్యవస్థల నుంచి వస్తున్న దిగుమతులు, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలపై కూడా అమెరికా దృష్టి సారించింది. భారత్ దేశీయ తయారీని పెంచుతున్నప్పటికీ, కొన్ని రంగాల్లో చైనా నుంచి ముడిసరుకు, విడిభాగాలు, పెట్టుబడులపై ఆధారపడటం కొనసాగుతోందని యూఎస్టీఆర్ ప్రస్తావించింది. చైనా ప్రభావాన్ని తగ్గించాలన్న అమెరికా వ్యూహంలో ఈ అభ్యంతరాలు భాగంగా కనిపిస్తున్నాయి.
కార్మిక చట్టాలపైనా విమర్శలు..
భారత్ కార్మిక చట్టాలు, కార్మికుల సంఘటిత హక్కులు, చట్టాల అమలు తీరుపైనా అమెరికా నివేదిక విమర్శలు చేసింది. కార్మిక రక్షణలు, వేతనాల అంశాలు తయారీ వ్యయాలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది. 2022లో భారత తయారీ జీడీపీలో కార్మికుల వాటా 28.6 శాతంగా ఉందని, అమెరికాతో పోలిస్తే ఇది తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. తక్కువ కార్మిక వ్యయాలు భారత తయారీ సంస్థలకు అంతర్జాతీయ పోటీలో ప్రయోజనం కల్పిస్తున్నాయని అమెరికా వాదిస్తోంది. భారత్ దిగుమతి సుంకాలు, ఇతర వాణిజ్య పరిమితులు అమెరికా కంపెనీలకు భారత మార్కెట్లో ప్రవేశాన్ని కష్టతరం చేస్తున్నాయని యుఎస్టిఆర్ ఆరోపించింది. దేశీయ తయారీ సంస్థలకు అనుకూలంగా వాణిజ్య విధానాలు ఉన్నాయని, విదేశీ ఉత్పత్తుల పోటీ నుంచి కొంత రక్షణ లభిస్తోందని పేర్కొంది. భారత మార్కెట్లో అమెరికా కంపెనీలకు అవకాశాలు పెరగాలని ప్రధానంగా డిమాండ్ చేస్తోంది.
భారత్ తిరస్కరణ..
భారత్‌లో అధిక తయారీ సామర్థ్యం ఏర్పడిందన్న అమెరికా ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఏ రంగంలోనూ నిర్మాణాత్మకంగా అధిక ఉత్పత్తి సామర్థ్యం లేదని కేంద్రం తెలిపింది. అమెరికా యుఎస్టిఆర్ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని, భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. యుఎస్టిఆర్ టారిఫ్‌ల ప్రతిపాదనపై 2027 జనవరి 5 వరకు రాతపూర్వక అభిప్రాయాలు సమర్పించేందుకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత అభిప్రాయాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్న వేళ ఈ అధిక సుంకాల ప్రతిపాదనతో అమెరికా ఒత్తిడి పెంచుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.







కామెంట్లు (0)