ఏపీలో వేర్వేరు జిల్లాల్లో ఏడుగురి మృతి
అమరావతి: అర్నబ్ తుపాను ఉభయగోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల తీవ్రతకు పలు చోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిన ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. విశాఖ పాత గోశాల సమీపంలో విద్యుత్తు స్తంభం కూలి మహిళ మృతి చెందగా, విశాఖ బాలాజీనగర్లో విద్యుత్ స్తంభం కూలి కె.మాధవి దుర్మరణం చెందారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు.బీమవరంలోని చర్చి వద్ద చెట్టు విరిగిపడి చొక్కా కిషోర్(45) మృతి చెందగా, బొండాడవారివీధిలో విద్యుత్తు స్తంభం విరిగిపడి రాంబాబు (34) మృతి చెందారు. ఈదురుగాలుల ధాటికి భీమవరంలో దుకాణాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రకాష్పురంలో వృద్ధురాలు మృతి చెందారు. అదే జిల్లాలో ఈదురుగాలులు, వర్షానికి గుడిసె కూలి కొల్లు వెంకాయమ్మ దుర్మరణం చెందారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఈదురుగాలులకు విద్యుత్తు తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి. ఉదయాన్నే ప్రమాదవశాత్తూ ఇంటి ముందు ఉన్న విద్యుత్తు తీగలు తగిలి మహిళ మృతి చెందారు.
బలహీనపడిన తుపాను
అర్నబ్ క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు.. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. భారీ వర్షాలతో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నందున.. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. డోప్లర్ వెదర్ రాడార్ ద్వారా తుపాను గమనాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.







కామెంట్లు (0)