డిసెంబర్ నాటికి 10 శాతానికి చేరనున్న ఆహార ద్రవ్యోల్బణం!
మోడీ పాలనలో రైతుకు సాగు కష్టాలు..సామాన్యుడికి ధరల మంటలు
వర్షాభావంతో రబీ సాగుపై తీవ్ర ప్రభావం
దిగుబడులు తగ్గితే మరింత పెరగనున్న నిత్యావసరాల ధరలు
పప్పులు, బియ్యం, గోధుమలు, పంచదార ధరలకు రెక్కలు
పాలు, మాంసం, గుడ్ల ధరలూ పైపైకి
వ్యవసాయ సంక్షోభం..ప్రజల కొనుగోలు శక్తిపై మరో దెబ్బ
దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోడీ హామీలు నీటి మీద రాతల్లా మారాయి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తామన్న ప్రకటనలు వట్టి మాటలేనని తేలిపోయాయి. వర్షాభావం కారణంగా దేశవ్యాప్తంగా రబీ సాగు సంక్షోభంలో పడుతుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ఎదుర్కొంటున్న సవాళ్లు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. పొలంలో నీరు లేక రైతు విత్తనం వేయలేని పరిస్థితి.. మార్కెట్లో ధరలు అందుబాటులో లేక సామాన్యుడు నిత్యావసరాలు కొనలేని దుస్థితి నెలకొంది. పప్పులు, బియ్యం, గోధుమలు, పంచదార నుంచి పాలు, మాంసం, గుడ్ల వరకు ధరలు పెరుగుతున్నాయి. వర్షాభావం పంటల దిగుబడులను దెబ్బతీస్తే ఆహార ద్రవ్యోల్బణం మరింత ఎగబాకే ప్రమాదం ఉంది. ప్రభుత్వ విధానాలు, వ్యవసాయ రంగానికి అందుతున్న సహకారంపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ.. దేశంలో రైతు, సామాన్యుడిపై ధరల భారం పెరుగుతోంది.
న్యూఢిల్లీ : దేశంలో వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయి. నైరుతి రుతుపవనాల వైఫల్యంతో దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడి రబీ పంటల సాగుకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు పంటల దిగుబడులు తగ్గుతాయనే ఆందోళనతో నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. రైతుకు సాగు పెట్టుబడి భారం.. వినియోగదారుడికి ధరల భారం.. ఇలా రెండు వైపులా ప్రజలు నష్టపోతున్నారు. రైతుల సంక్షేమం, ధరల నియంత్రణపై పదేపదే హామీలిస్తున్న మోడీ ప్రభుత్వానికి ఈ పరిస్థితులు సవాలుగా మారాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం 10 శాతానికి చేరవచ్చన్న ఆర్థిక నిపుణుల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సాగుకు నీరు లేదు.. పెట్టుబడికీ డబ్బుల్లేవు
మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన 78 ఏండ్ల రైతు అమర్‌సింగ్ గుషింగే గోధుమలు, శనగలు సాగు చేసి మంచి ధరలు పొందాలని ఆశించారు. అయితే వర్షాభావం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. పొలంలో తగినంత తేమ లేకపోవడంతో విత్తనాలు వేసే పరిస్థితి లేదు. ఆయన నివసించే రాజేవాడి గ్రామం పరిసర ప్రాంతా ల్లో ఈ ఏడాది సాధారణం కంటే 48 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సాగుకు నీరు లేకపోవడంతోపాటు పెట్టుబడులకు డబ్బు కూడా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఒక్క మహారాష్ట్ర రైతు సమస్య మాత్రమే కాదు. దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని లక్షలాది మంది రైతులు ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. రబీ సాగు ప్రారంభం కావాల్సిన సమయంలో నేలలో తేమ లేకపోవడం పంటల భవిష్యత్తును ప్రశ్నా ర్థకం చేస్తోంది. ఆలస్యంగా సాగు చేసినా మొక్కల పెరుగుదల దెబ్బతిని దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. రైతుల ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపనుం ది. వ్యవసాయంపై ఆధారపడిన కోట్లాది కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వా నికి ఈ సంక్షోభం పెద్ద పరీక్షగా మారింది.
ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం
వ్యవసాయ ఉత్పత్తులు తగ్గితే మార్కెట్లో సరఫరా తగ్గి ధరలు మరింత పెరుగుతాయి. ఇప్పటికే పప్పులు, బియ్యం, గోధుమలు, పంచదార ధరలు పెరుగుతున్నాయి. వంటింట్లో నిత్యం ఉపయోగించే ఉల్లిపాయల ధరల పెరుగుదల కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పాలు, కోడిమాంసం, గుడ్ల ధరలూ పెరుగుతున్నాయి. సామాన్యుడి ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. ధరల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం చెప్తున్న హామీలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు మధ్య వ్యత్యాసం స్పష్టమవుతోంది. సెప్టెంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 7.74 శాతానికి చేరగా, మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతంగా నమోదైంది. ఇది రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన 6 శాతం గరిష్ఠ పరిమితికి దగ్గరగా ఉంది. అక్టోబర్-డిసెంబర్ మధ్య ఆహా ర ద్రవ్యోల్బణం దాదాపు 10 శాతానికి చేరవ చ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ముఖ్య ఆర్థికవేత్త దేవేంద్ర పంత్ అంచనా వేశారు. తక్కువ వర్షపాతం, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల, రూపాయి విలువ తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలని వివరించారు. ధరల ఒత్తిడి కొనసాగితే రిజర్వ్ బ్యాంకు మరో సారి వడ్డీ రేట్లను 50-75 బేసిస్ పాయింట్ల వరకు పెంచాల్సి రావచ్చని ఆయన అభిప్రా యపడ్డా రు. అలా జరిగితే రుణాలు తీసుకున్న సామాన్యులపై అదనపు భారం పడనుంది.
ప్రొటీన్ ఆహారానికీ దూరమవుతున్న పేదలు
ధరల పెరుగుదల ప్రభావం కేవలం ధాన్యాలకే పరిమితం కాలేదు. మాంసం, పాలు, గుడ్లు వంటి ప్రొటీన్ అందించే ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతున్నాయి. మార్చి నుంచి ఆగస్టు మధ్య ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలలో జంతు ప్రొటీన్, మసాలా దినుసుల వాటా దాదాపు సగం ఉందని రిజర్వ్ బ్యాంకు నివేదిక వెల్లడించింది. కోళ్ల దాణా, పశుగ్రాసం, రవాణా, ప్యాకింగ్, ఇంధన ఖర్చులు పెరగడం దీనికి కారణం.కోళ్ల దాణా తయారీలో ఉపయోగించే మొక్కజొన్న, సోయాబీన్ ఖర్చులు పౌల్ట్రీ ఉత్పత్తి వ్యయంలో 60-70 శాతం ఉంటాయి. ఈ వ్యయాలు పెరగడంతో జనవరి నుంచి కోడిమాంసం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. సెప్టెంబర్‌లో పాలు, పాల ఉత్పత్తులు, గుడ్ల ద్రవ్యోల్బణం 5.1 శాతానికి చేరింది. మాంసం ధరల పెరుగు దల 12 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గినట్టు కనిపించినా.. అది గతేడాది అధిక ధరల ప్రభావమేనని నిపుణులు వివరిస్తున్నారు. ప్రొటీన్ ఆహారం ఖరీదవుతుం డటంతో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు వాటి వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ప్రజల పోషకాహారంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
పంచదార, వంటనూనెలతోనూ తప్పని వాత
దేశంలో వరుసగా రెండో ఏడాది కూడా పంచదార ఉత్పత్తి దేశీయ అవసరాల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే పంచదార ధరలు దాదాపు 30 శాతం పెరిగాయి. కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం 10 లక్షల టన్నుల పంచదారను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండటంతో దిగుమతుల వల్ల వినియోగదారులకు పెద్దగా ఉపశమనం లభించే అవకాశం లేదని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. వంటనూనెలు, పప్పుల దిగుమతుల విషయంలోనూ ఇదే పరిస్థితి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం, రవాణా ఖర్చులు అధికమవ డంతో దిగుమతుల భారం పెరుగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఇతర దేశాల్లోనూ పంటల ఉత్పత్తి తగ్గుతుండగా, రష్యా-ఉక్రెయి న్ యుద్ధం కారణంగా నల్లసముద్ర ప్రాంతం నుంచి ధాన్యాలు, సన్‌ఫ్లవర్ నూనె సరఫరా దెబ్బతింటోంది. దీంతో దేశీయ మార్కెట్లో వంటనూనెల ధరలు పెరుగుతున్నాయి.
నిల్వలున్నా తగ్గని బియ్యం, గోధుమల ధరలు
దేశంలో బియ్యం, గోధుమల నిల్వలు అవసరానికి మించి ఉన్నప్పటికీ వాటి ధరలు తగ్గడం లేదు. వినియోగదారులు ఇష్టపడే నాణ్యమైన బియ్యం రకాల సరఫరా పరిమితం గా ఉండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వినియోగించే కొన్ని రకాల బియ్యం ఉత్పత్తి వర్షాభావంతో తగ్గింది. మరోవైపు గోధుమల ధరలు దాదాపు రెండేండ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. ఎల్‌నినో ప్రభావంతో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగి గోధుమ దిగుబడులు తగ్గవచ్చన్న ఆందోళన దీనికి కారణమవుతోంది.
రైతు, వినియోగదారుడికి భరోసా ఎక్కడ?
రానున్న శీతాకాలపు పంటల సాగు, వాతావరణ పరిస్థితులే ఆహార ధరల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. నేలలో తేమ లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం పంటల సరఫరాను మరింత తగ్గించవచ్చు. అధిక ముడి చమురు ధరలు, ఆహార ద్రవ్యోల్బణం, ఖరీఫ్ పంటలపై అనిశ్చితి దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారాయని కేంద్ర ప్రభుత్వ అక్టోబర్ ఆర్థిక నివేదిక కూడా పేర్కొంది. అయితే రైతులకు సాగు భరోసా, పంటల దిగుబడుల పరిరక్షణ, సామాన్యులకు అందుబాటు ధరల్లో నిత్యావసరాల సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వ చర్యలు కీలకంగా మారాయి. రైతుల ఆదాయం పెంపు, ధరల నియంత్రణ వంటి హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు. ఒకవైపు పంటలు పండించేందుకు రైతుకు నీరు లేదు. మరోవైపు పండిన పంటలను కొనుగోలు చేసేందుకు సామాన్యుడి జేబులో సరిపడా డబ్బు లేదు. వర్షాభావం రైతును కుంగదీస్తుం టే, ధరల పెరుగుదల ప్రజల జీవనాన్ని భారంగా మారుస్తోంది. వ్యవసాయ సంక్షోభం, ఆహార ద్రవ్యోల్బణం కలిసి దేశంలోని గ్రామీణ, పట్టణ పేదలపై ముప్పేట దాడి చేస్తు న్నాయి. రైతు సంక్షేమం, ధరల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ విధానాల వైఫల్యాన్ని తాజా పరిస్థితులు ఎత్తి చూపుతున్నాయి.






కామెంట్లు (0)