2019-21లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 ప్రకారం దేశంలో 15-49 మధ్య వయస్సు ఉన్న మహిళల్లో సుమారు 57% శాతం మంది రక్తహీనత (ఎనీమియా)తో బాధపడుతున్నారు అని తెలిపింది. వీరిలో 52.2% శాతం మంది గర్భిణీ స్త్రీలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఐరన్ లోపం ఎక్కువగా ఉండటం, రుతుక్రమంలో అధిక రక్తస్రావం, పోషకాహార లోపం వంటి పలు కారణాలు వలన మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. రాత్రీ పగలు ఇంటి పనులతో సతమతం అవుతున్న మహిళలు, చదువుకునే బాలికలు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలు తరచూ అలసటకు గురవుతూ కొన్ని సందర్భాల్లో కళ్ళు తిరిగి పడిపోతుంటారు. కొందరికైతే ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉంటుంది. ఇటువంటి సమస్యలకు ప్రధాన కారణం ఐరన్ లోపం, రక్తహీనత అని తెలుస్తోంది.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పోషకాహారం లోపం వల్ల ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో గర్భంలో ఉన్న శిశువుపై పెను ప్రభావం చూపుతోంది. తక్కువ బరువుతో పుట్టడంతోపాటు అనేక సమస్యలకు కారణం అవుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటం వలన శరీరంలో అన్ని భాగాలకు, కణాలకు సరైన రీతిలో ఆక్సిజన్ లభించకపోవడంతో వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి.శరీరభాగాలకు తగిన రీతిలో ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఎర్ర రక్త కణాల్లో ప్రోటీన్లు, హెమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ పుష్కలంగా ఉండవలసిన అవసరం ఉంది. అయితే ఎప్పుడైతే ఐరన్ సరైన స్థాయిలో లభ్యం కాదో, హెమోగ్లోబిన్ స్థాయి పడిపోవడం, రక్తహీనత ప్రారంభమై నీరసం, నిస్సత్తువ, కళ్ళు తిరగడం, తలపోటు, ఊపిరి పీల్చుకోవడం కష్టతరంగా మారడం వంటి పలు సమస్యలు మొదలవుతాయి. ఈ రకమైన సమస్యలతో మనదేశంలో చాలామంది విద్యార్థినిలు, మహిళలు, బాలికలు, గర్భిణీ స్త్రీలు బాధపడుతున్నారు. దీంతో వారు అనేక రకాల శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి వారి పనులు నిర్వహించుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. తరచూ నిస్సత్తువతో, బలహీనంగా ఉండటం వల్ల వారి సామర్థ్యాలు నైపుణ్యాలను మెరుగు పరచకలేకపోతున్నారు.
నిర్లక్ష్యం చేస్తున్నారు
ఇక విద్యార్థినిలు చదువుల విషయంలో వెనుకబడి పోతున్నారు. ఈ రక్తహీనత సమస్య ముఖ్యంగా ఋతుక్రమం సందర్భంగా, గర్భిణీ సమయంలో చాలా సమస్యలకు కారణం అవుతుంది. చాలా మంది తమ సమస్యలను కనీసం వారి కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేక పోతున్నారు. దీనికి ప్రధాన కారణం పేదరికం, నిరక్షరాస్యత, కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు. దీనికి తోడు సాధారణంగా మహిళలు వారి ఆరోగ్యానికి, ఆహారానికి సరైన ప్రాధాన్యం ఇవ్వరు. తమ పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందరి భోజనాలు ముగిసిన తర్వాత మిగిలిన ఆహారం తినడం వలన తగిన పోషకాహారం లభించకపోవడంతో తరచూ రక్తహీనత బారిన పడుతున్నారు.
కుటుంబం బాధ్యత తీసుకోవాలి
ప్రతీ కుటుంబ సభ్యులు తమ కుటుంబంలోని బాలికలు, మహిళల ఆరోగ్యానికి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మహిళలు ముఖ్యంగా ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పాలు, వైద్యుని సలహా మేరకు మందులు, మొలకెత్తిన గింజలు, విటమిన్ సి, తగినంత మాంసాహారం, పప్పుదినుసులు వంటివి తీసుకోవాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. గర్భిణీ స్త్రీలు పోషకాహారంతోపాటు శారీరక మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేయాలి. మహిళలు సాధారణంగా పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, ఇతర అవసరాలకు ఆదాయం ఖర్చు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తారు గానీ తమ ఆరోగ్యానికి, ఆహారానికి, వైద్య పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పోషకాహారం ద్వారానే రక్తహీనత అరికట్టవచ్చు అనే వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఋతుక్రమం సందర్భంగా వచ్చే సమస్యలు, గర్భిణీ స్త్రీలు తమ తమ ఆరోగ్యం సమస్యలు పరిష్కారం కోసం గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. సమీప అంగన్వాడీ కార్యకర్తలను, ఆశా వర్కర్లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారిని సంప్రదించి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి.
ప్రత్యేక శ్రద్ధ అవసరం
ప్రభుత్వాలు కేవలం ఐరన్ టాబ్లెట్లు, కొన్ని సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించినంత మాత్రాన మహిళల్లో రక్తహీనత శాశ్వతంగా తొలగిపోదు. ‘అనీమియా ముక్త భారత్’ కార్యక్రమం ద్వారా పూర్తిగా నివారింపబడదు. మహిళలకు చదువు అందించడంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలి. తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాలి. కుటుంబ సభ్యులు ముఖ్యంగా మగవారు వారి కుటుంబ మహిళల ఆరోగ్యం, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలల్లో, పని ప్రదేశాల్లో మహిళలకు ఆరోగ్య రక్షణ, భద్రత, హక్కులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యంగా జన్మించాలంటే మహిళలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పైనే ఆధారపడి ఉంటుంది అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా 15-49 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న మహిళల ఆరోగ్యానికి, ఆహారానికి కుటుంబ సభ్యులు, ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానే రక్తహీనత (ఎనీమియా) ను పారద్రోలడానికి వీలు కలుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మహిళా శిశు సంక్షేమ శాఖకు, ఆరోగ్య, విద్యా రంగానికి కనీసం రాబోయే రోజుల్లోనైనా బడ్జెట్లో నిధులు తగిన స్థాయిలో కేటాయించి ఖర్చు చేయాలి. వివిధ రకాల శారీరక మానసిక అనారోగ్యాల నుండి, వివక్షతల నుండి మహిళలను రక్షించటం ద్వారా, దేశ జనాభాలో సగం మంది ఉన్న మహిళల అభివృద్ధి ద్వారానే 2047 లో వికసిత భారత్ సాధ్యం అని గ్రహించాలి..






కామెంట్లు (0)