చెట్టుచెట్టు తిరిగి
అడవి నుంచి తెచ్చిన పూరేకులతో
అందాల బతుకమ్మను సింగారించే మనం
అందరమొకటిగా ఎందుకు ఆడలేకున్నాం?
తంగేడు పూలలో త్యాగాన్ని చూసి,
గునుగు పూలలో గుండె సౌందర్యాన్ని నింపి,
రంగురంగుల పూలతో రాశులుపోసి
రంగుల పండుగను చేసే మనం
మనుషుల మధ్య రంగులెందుకు చెరపలేకున్నాం?
అడవిలో పూసిన పూలన్నీ
అమ్మ ఒడిలో ఒదిగిపోతుంటే,
అదే మట్టిలో పుట్టిన మనుషుల మధ్య
అంటరానితనపు గోడలెందుకు?
పూలకు లేని కులం మనకెందుకు?
ప్రకృతికి లేని మతం మనకెందుకు?
కలిసి పూసే పూలను చూసైనా
కలిసి బతకడం నేర్చుకోలేమా?
బతుకమ్మ అంటే పూల పండుగే కాదు,
బతుకుల్ని కలిపే పాట కావాలి.
ఆడపడుచుల ఆటే కాదు,
అంతరాలను చెరిపే బాట కావాలి.
పూలన్నీ కలిసి బతుకమ్మైనప్పుడు,
మనుషులంతా కలిసి సమాజం కాలేమా?
ఓ బతుకమ్మా...
నువ్వు పూలను పేర్చినట్టే
మనుషుల మనసుల్ని పేర్చమ్మా.
నువ్వు రంగులను కలిపినట్టే
మా బతుకుల్లో సమానత్వాన్ని నింపమ్మా.
నీ చుట్టూ తిరిగే మా అడుగులు
అసమానతల మీద తిరగబడాలి.
నీ పాటల్లో పలికే మా గొంతులు
కులగోడల మీద కలబడాలి.
పూలను పూజించే ఈ నేల మీద
మనుషుల్ని మనుషులుగా ప్రేమించే రోజొకటి రావాలి...
- బసడ సంపత్ యాదవ్, 7032132593





కామెంట్లు (0)