వచ్చిపోయే బాటసారులకు
కొబ్బరి నీళ్లై దాహం తీర్చిన జలక్షేత్రమది!
ఎంత లోతున్నా గలగల పారే నీళ్లు
చిన్నపిల్లలు దోసిళ్లతో తాగేటోళ్లు!
మూడు బార్ల రాతికట్టుతో
మెరిసిపోయిన అపురూప పురాతన కట్టడమది!
యాభై ఏండ్లుగా
నా కళ్లముందే ఉన్నా...
బావి నీళ్లెండిపోవడం నేను కనలే... వినలే!
మూడు మోట్ల గిరకలతో కళకళలాడుతూ,
మండే ఎండల్లోచాపల సయ్యాటల్లా
బడిపిల్లల ఆటలతో బావి మురిసేది!
అరచేతుల మీద ఈతలు నేర్పేది,
కొర్లుగొట్టి దర్లు ముట్టించుకునే
సాహసాలకు సాక్షమది!
తానాలకు బారులు గట్టి
ఊరంతా నిండిపోయేది
ఇరవై కోళ్ల లోతు, ఇన్నూరడుగుల వెడల్పు...
ఒక్కసారి మునిగి తేలితే చాలు
ఒళ్లంతా
గంధం చెక్కల వాసన!
ఎన్ని చేతులు పారలైనయో...
ఎన్ని కాళ్లు గడ్డపారలైనయో...
ఎన్ని తలలు మట్టిని మోసాయో...
ఎందరి శ్రమజీవుల కథలు, పాటలు
ఆ బావి గర్భంలో దాగున్నాయో!
పార్లేజీ బిస్కెట్లలా నల్లసర్పరాళ్ల బండలు
ఊరి దాహం తీర్చడానికి
కూలోళ్ల చెమటలతో తడిసిపోయేది
వడ్డెరన్నల నైపుణ్యాలు రాళ్ల మెరుపుల్లో
రాళ్లు ఇప్పటికీ కాంతులీనుతున్నయి!
సేతులకు బొబ్బలెక్కినా,ఒళ్లు హూనమైనా
జలసిరి ఇయ్యాలనే తపన
ఊరి గుండెల్లో నదిలా పారింది
శ్రమజీవుల స్వేదబిందువుల సాక్ష్యం
నేడు మట్టిలో కలిసిపోతుంటే
గుండె కలుక్కుమంటుంది!
కాలం మారింది...
పాలకుల తీరు ఆశ్చర్యమేసింది!
రోడ్డు పక్కన ప్రమాదాల సాకుతో
నీళ్లిచ్చిన గొంతును కిరాతకంగా పూడ్చేసిండ్రు!
ఒక బావిని కాదు చరిత్రను పూడ్చిండ్రు.
శ్రమజీవుల యాదిని మట్టిలో కలిపిండ్రు
సజీవ ఆనవాళ్లను తుడిచిపెట్టి
చేతులు దులిపుకుండ్రు!
పూడ్చింది బావిని గాదు
శ్రామికులు చిందించిన రక్తాన్ని, సెమటను!
వాళ్ల బతుకుల్ని,వాళ్ల కలల్ని,
వాళ్ల కష్టానికి మిగిలిన సాక్ష్యాన్ని!
ఊరందరికీ నీళ్లు పంచిన ఆ తల్లిని
వీధులూడ్చిన సెత్తతో కప్పేసిండ్రు!
మురికికుప్పలతో తల్లి కడుపుమీద మట్టి వోసిండ్రు.
నీళ్లిచ్చిన చేతుల్ని మట్టితో కప్పేసిండ్రు,
దాహం తీర్చిన క్షేత్రాన్ని చెత్తతో మూసేసిండ్రు!
అయినా...ఎంత పూడ్చినా,
చెరిపేయాలనుకున్నా
నేల గుండెలోంచి గంధపు వాసన
ఇప్పటికే వస్తూనే ఉన్నది!
ఎందుకంటే...
గంధం బావి ఒక్కరిది గాదు
ఊరందరిది!
గంధం బావికి తోడుగా నిలిచిన“మూసబావి” కూడా
నాయకుల దాష్టికానికి
కాలగర్భంలో కలిసిపోయింది.
బావులు పోయాయి...
బాటలు మారినయి...
మట్టి దిబ్బలు పెరిగినయి...
జ్ఞాపకం మాత్రం
వెంటాడుతూనే వుంది!
శ్రమజీవుల సాక్ష్యాలు
అభివృద్ధి పాదాల కింద అణిగి నలిగిపోయినా
వాళ్ల చెమట వాసన నేలలోనే ఇంకిపోయినా
రాళ్ల మధ్య వాళ్ల ఆర్తనాదాలులన్నయి,
నీళ్ల అడుగున వాళ్ల పాటలున్నయి,
బావి గర్భంలో
వాళ్ల బతుకులున్నయి!
కాలం
ఎన్ని మట్టిపొరలు వేసినా
చరిత్రను పూడ్చలేలు.
ఎందుకంటే...
గంధం బావి నీళ్ల బావి కాదు
శ్రమజీవుల చెమటతో చెక్కిన
ఒక సజీవ చరిత్ర!
మట్టి కింద
మూగబోయిన బావి
మాటలు మాత్రం
ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి..
“నన్ను పూడ్చగలరు...
కానీ
నా నీళ్లతో నడిచిన
ఊరి జ్ఞాపకాల్ని
ఎలా పూడ్చగలరు?”
వనపట్ల సుబ్బయ్య, 94927 65358






కామెంట్లు (0)