Magazines

22ఏ సమస్యలకు వరుస పరిష్కారాలు

39 నిమిషాల క్రితం

22 Solutions for Various Problems
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

నాలా అనుమతి లేకున్నా 
నివాస వినియోగంలోని పట్టా 
భూములకు తీపికబురు
రుసుము చెల్లింపుతో అర్హత ఉన్న వాటికి రిజిస్ట్రేషన్‌

ఉత్తర్వులు విడుదల
శరవేగంగా సీఎం రేవంత్‌‌రెడ్డి హామీల అమలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
గత నెల 16న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22ఏ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఇచ్చిన హామీలకు అనుగుణంగా సహచర మంత్రులతో చర్చించి 22ఏతో ముడిపడి ఉన్న 10 నుంచి 12 సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుం టున్నామని మంత్రి పొంగులేటి వివరించారు. సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22ఏ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆ తర్వాత 118 జీవో, 76 జీవోలకు అనుగుణంగా స్పష్టమైన మెమోలను జారీ చేశామని వివరించారు. 22ఏ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీడీసీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చామని గుర్తు చేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఆ క్రమంలోనే తాజాగా నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ మెమో జారీ చేశామని వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింద‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వ్యవసాయ భూములుగా ఉన్న పట్టా భూములు, అనంతరం నివాస వినియోగంలోకి వచ్చినప్పటికీ నాలా ప్రక్రియ పూర్తికాక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూ సమస్యకు పరిష్కారం చూపుతూ శ‌నివారం మెమో జారీ చేసిన‌‌ట్టు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు మెమో నెంబ‌ర్ 48062/యూఎల్‌‌సీ/ఏ1/2026 ద్వారా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశామని వివరించారు. శ‌నివారం హైదరాబాద్‌‌లో రెవెన్యూ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నాలా ప్రక్రియ పూర్తికాకపోవడం వల్ల రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగానే ఉండి, 22ఏలో ఉన్న నివాస పట్టా భూముల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఆయా దరఖాస్తులను రెవెన్యూ రికార్డులు, భూమి హక్కులు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం నాలా రుసుము, ఇతర ప్రభుత్వ రుసుములను వసూలు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన‌ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.

​త్వరితగతిన దరఖాస్తులను పరిష్కరించాలి
ప్రజలు భూముల రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా, కాలపరిమితిలో ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి అధికారులను సూచించారు. అర్హత ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, ప్రభుత్వానికి అమలు పురోగతిపై నివేదిక సమర్పించాలని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ఏండ్ల తరబడి సొంత ప్లాట్లను విక్రయించుకోలేక, రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఉపశమనం లభిస్తుందని స్పష్టం చేశారు. 22ఏ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఇటీవ‌ల జారీ చేసిన ఉత్త‌ర్వులు క్షేత్ర‌స్ధాయిలో ప‌క‌డ్బందీగా అమ‌లయ్యే విధంగా నిరంత‌రం పర్యవేక్షణ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌జాకోణంలో ప్ర‌భుత్వం తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యాన్ని అమలు చేయాల్సిన క‌నీస బాధ్య‌త వారిపై ఉంద‌నీ, దీంతో స‌మ‌స్య‌లు త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని అన్నారు. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ప్ర‌జా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను అధికారులు చిత్త‌శుద్దితో బాధ్య‌తాయుతంగా అమ‌లు చేయాల‌ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్