రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్లకు
పీఆర్సీ వర్తింపజేయాలి
తెలంగాణ మున్సిపల్ యూనియన్
రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పీఆర్‌సీ అనేది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కార్మికులకు ప్రభుత్వాలు పెట్టే భిక్ష కాదని తెలంగాణ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్ తెలిపారు. ‘ రాష్ట్ర ప్రభుత్వఉద్యోగ, కార్మిక, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లకు పీఆర్‌సీ వర్తింపజేసి, ఇతర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌పై ఈ నెల 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సు’ పోస్టర్‌ను సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాలు, జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగులు తమ శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందే చట్టబద్ధమైన హక్కు వేతన సవరణని తెలిపారు. ప్రతి ఐదేండ్లకొకసారి సకాలంలో జరగాలనీ, కానీ పీఆర్‌సీ కాలపరిమితి ముగిసి మూడేండ్ల మూడు నెల్లు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం పిఆర్‌సీ ప్రకటించకుండా రెండు డీఏలతో చేతులు దులుపుకున్నదని విమర్శించారు . పైగా పెన్షనర్ల పెండింగ్ డబ్బులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీపిఎఫ్ బకాయిలు, కమ్యూటేషన్ బకాయిలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, స్కీం వర్కర్లు, ఎన్ఎంఆర్, డైలీవేజ్, ఫుల్‌టైమ్, పార్ట్‌టై కార్మికుల సమస్యల ఊసెత్తకపోవడం బాధ్యతారాహిత్యం అని విమర్శించారు. మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ 2026 జూన్ నెలలోపు పీఆర్‌సీ, హెల్త్ కార్డుల సమస్య పరిష్కరిస్తామని చెప్పిన మాటకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తు న్నదని తెలిపారు. పీఆర్‌సీ ఎప్పుడిచ్చినా ఎరియర్స్తో చెల్లిస్తాం కదా! అని అంటున్నదనీ, కానీ ఇతర నాన్ పర్మినెంట్ కార్మికుల ఎరియర్స్ పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ కాలంలో ఉద్యోగ సంఘాల నాయకులతో జరిపిన చర్చల సందర్భంగా అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారని తెలిపారు.అంగన్వాడీ టీచర్స్అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి మాట్లాడుతూ స్కీం వర్కర్లకు కాంగ్రెస్ ఎన్నికల హామీలో కూడా జీత భత్యాలు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. స్కీమ్ వర్కర్ల గౌరవ వేతనం ,పారితోషికాలు తక్కువగా ఉండటం వల్ల మొదటి పీఆర్‌సీలో 30 శాతంతో పెరిగిన వేతనాలు కూడా నామమాత్రమేనని తెలిపారు.కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె. వెంకటేష్, ఉపాధ్యక్షులు ఎం. పద్మశ్రీలు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్స్, నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు జెఏసీ నాయకత్వం డిమాండ్ చేస్తున్న విధంగా నెలకు రూ.30వేలు మినిమమ్ వేజ్ నిర్ణయించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.మధ్యాహ్న భోజన పథకం , ఐకేపీవీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ ప్రస్తుతం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, సీపీఎస్ ఉద్యోగులు, రాష్ట్ర కార్పొరేషన్ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీ ఉద్యోగులతో పాటు స్కీమ్ వర్కర్లు కూడా పీఆర్‌సీతో సంబంధం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలకు కూడా ప్రాధాన్యతనిచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వై. సోమన్న, ఎం. దశరథ్, ఆర్. రాజు తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ బిక్ష కాదు
51 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)