పట్టభద్రుల ఎన్నికల్లో జెన్‌జీ భయం
ఒక నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నా... దానిపైనే రేవంత్ గురి
రెండోదానిలో ఆ పార్టీకి నాలుగోస్థానమే...
బీజేపీ అభ్యర్థులపై కసరత్తు పూర్తి
అధ్యక్షుడికి సీల్డ్కవర్లో అందజేసిన కమిటీలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పట్టభద్రుల ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే బీజేపీకి గుబులు పుడుతోంది. ఒకవైపు జెన్‌జీ ఉద్యమం...మరోవైపు ఇండియా కూటమి పోరాటం ఉధృతంగా సాగుతుండటంతో ఆ పార్టీకి మరింత భయం పట్టుకుంది. జెన్ అల్ఫాలో బీజేపీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, మారుతున్న రాజకీయ పరిణామాలు, ఎట్టి పరిస్థితుల్లో పట్టభద్రుల ఎన్నికల్లో గెలవాలంటూ బీజేపీ అధిష్టానం రాష్ట్ర నేతలపై ఒత్తిడి వెరసీ ఆ పార్టీలో ఆందోళన మొదలైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో బీజేపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువ మంది కార్పొరేటర్లు గెలిచారు. వీరందరి సహకారంతో ఇక్కడ గెలువడం పెద్ద విషయం కాదని భావించిన ఆ పార్టీకి జెన్‌జీ ఉద్యమం పిడుగులా దూసుకొచ్చింది. దీనితోపాటు ఇది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కావడం, ఆయన పుట్టిన ప్రాంతం కూడా కావడంతో దీనిపై ఆయన గురి పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి అన్నివైపుల నుంచి దారులు మూసుకు పోయాయి. ఈసారి స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో తాజా రాజకీయ పరిణామాలతో ఆ పార్టీ గందరగోళంలో పడింది. బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచందర్‌రావు గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచినా... రెండోసారి బీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో రాంచందర్‌రావు పోటీకి దిగాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉన్నట్టు తెలిసింది. బీజేపీకి ప్రతికూల పరిస్థితులున్నా...కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ ఈ నియోజకవర్గం పరిధిలో ఉండటం ఆ పార్టీకి కొంత ఊరటనిస్తోంది. అయినా రాంచందర్‌రావు మాత్రం పోటీకి సిద్ధంగా లేరని తెలుస్తోంది. మాజీ మంత్రి తుళ్ల దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్ పేరు కూడా బలంగా వినిపిస్తున్నది. ఈసారి పీవీ నరసింహారావు మనుమడు, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ను పోటీకి దించాలని మరో చర్చ కూడా జరుగుతున్నది. పట్టభద్రులతో కూడా ఆయనకు పెద్దగా సంబంధాలు లేవని పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రజలతో మామేకమయ్యే పరిస్థితులు లేవనే ఆరోపణలున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆయనకు అప్పగించిన బాధ్యతలను సంక్రమంగా నిర్వర్తించకుండా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిస్థితులు కూడా తోడయ్యాయి.
అక్కడి నుంచి పోటీ చేసేందుకు బీజేపీ సీనియర్ నేతలు ప్రకాశ్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, మనోహర్‌రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఎంపిక కమిటీ ఈ ముగ్గురి పేర్లతో కూడిన నివేదికను రాంచందర్‌రావుకు అందజేసింది. రేపోమాపో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నది. కానీ ఈ నియోజకవర్గంపై బీజేపీకి పెద్దగా ఆశలు లేవని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నియోజక వర్గంలో ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండ టంతోపాటు ఆరుగురు బలమైన మంత్రులు దీనిపై ఫోకస్ పెట్టారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి గత పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా రాకేష్‌రెడ్డిని గెలిపిం చుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అధికారిక ఒప్పందం లేకపో యినా, కాంగ్రెస్‌ను ఓడించేందుకు పరస్పర అవగా హనతో సహకరించుకోవాలని ఆ రెండు పార్టీ భావి స్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. హైదరా బాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో పట్టభద్రుల నియోజకవర్గంలో బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించి, బీజేపీ గెలిపించడం, ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ బలహీనమైన అభ్యర్థిని ప్రకటించి, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం తద్వారా రెండు చోట్ల గెలిచి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని ఈ రెండు పార్టీలు భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.





కామెంట్లు (0)