సమగ్ర భూ సర్వే చేసి మిగులు భూములను పేదలకు పంచాలి : మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు
భూ పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలి: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట అధ్యక్షులు జి.నాగయ్య
ఎస్వీకేలో రౌండ్ టేబుల్ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
: రాష్ట్రవ్యాప్తంగా 22 ఏ లో ఉన్న నిషేధ భూముల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని మాజీ శాసనమండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎస్వీకేలో 22 ఏ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్డ్ భూమి 24,63,940 ఎకరాలు, అటవీ భూమి 42,53,532 ఎకరాలు, ఇతర ప్రభుత్వ శిఖం భూములు 29,35,554 ఎకరాలు, ప్రయివేట్ భూములు 3,95,852 ఎకరాలు కలిపి మొత్తం 1,02,52,690 ఎకరాలు, 22-ఏ జాబితాలో ఉన్నాయని జరుగుతున్న ప్రచారంపై సర్కార్ వాస్తవాలు వెల్లడించాలన్నారు. అలాగే పేదలకు పంచిన అసైన్డ్ భూమి 24.64 లక్షల ఎకరాలను 22-ఏలో పెట్టారనీ, అందులో పట్టాదారుల వద్ద ఎంత ఉంది? అన్య క్రాంతమైంది ఎంత? అనేది ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ లెక్కలు తేల్చకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. గ్రామ పంచాయతీల్లో నిషేదిత భూముల వివరాలను ప్రజల సందర్షనకు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ఒక సర్వే నంబర్లోని కొంత భూమిని ప్రభుత్వం స్వాదీనం పర్చుకుంటే, మొత్తం సర్వే నంబర్ " అక్వైర్డ్" నమోదు చేస్తే మిగిలిన భూమిపై కూడా లావాదేవీలు నిలిచిపోయే పరిస్థితి ధరణిలో ఏర్పడిందనీ, తెలంగాణ భూ భారతి చట్టం అమలు ప్రక్రియలో అలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి సెంటుకు గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు
. అలాగే అభివృద్ధి పేరుతో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఏలాంటి పరిహారం ఇవ్వకుండా బలవంతంగా ప్రభుత్వం గుంజుకుని కార్పోరేట్లకు, కాంట్రాక్టర్లకు, పరిశ్రమల అదిపతులకు, రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట అధ్యక్షులు జి.నాగయ్య మాట్లాడుతూ 22 ఏ నిషేధిత భూములను బహిరంగ పర్చకుంటే ప్రభుత్వ భూముల ఆక్రమణకు నిరుపేదలతో కలిసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ర్ట అధ్యక్షులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ పేదలు సాగు చేసుకుంటున్న భూముల రక్షణ కోసం కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలతో ఐక్య ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ
అసైన్డ్ భూముల రక్షణ కోసం దళితులు, ఆదివాసి గిరిజనులు, ఇతర పేదలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి మాట్లాడుతూ సాగుభూమి, ఇంటి స్థలం ఉన్నప్పుడే మహిళలు ఆత్మ గౌరవంతో బతకగలరని పేర్కొన్నారు. ఎన్పీఆర్డీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ఎం.అడివయ్య మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో భూములను లాక్కొని పేదలను నిరాశ్రయులుగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జంగారెడ్డి మాట్లాడుతూ భూముల పట్టాల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి పేరుతో రైతులు, పేదల దగ్గర ఉన్న భూములు లాక్కొని పెద్దల ఆక్రమణలో ఉన్న భూముల జోలికి పాలకులు పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, బొప్పని పద్మ, రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి శోభన్ నాయక్, ఎన్పీఆర్డీ రాష్ట్ర కోశాధికారి వెంకటేష్, సామాజిక ఉద్యమ నాయకులు తిరుపతి, పాటల గోపి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ కార్యచరణ
- ఈనెల 10 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు
- 10 నుంచి 25 వరకు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు
- 25 నుంచి నవంబర్ 10 వరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు
- నవంబర్ 10 తర్వాత భూ ఆక్రమణ పోరాటాలు







కామెంట్లు (0)