సూపర్ ఎల్‌నినోపై ప్రభుత్వానికి ప్రజలు, కేంద్రం సహకరించాలి
విద్యుత్, నీటి కొరతను అర్థం చేసుకోవాలి
వచ్చే ఎనిమిది నెలలే కీలకం
సహేతుకమైన ప్రతి సూచననూ స్వీకరిస్తాం
దసరా తర్వాత డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్
నవంబర్ మొదటి వారంలో ఢిల్లీకి అఖిలపక్షం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సూపర్ ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో తీవ్రమైన నీటి, విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. అయినా అందరి భాగస్వామ్యం లేకుండా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కలేమని ఆయన వ్యాఖ్యానిం చారు. ఈ పరిస్థితిలో రైతులు, ప్రజలు, కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రధాని మోడీ పిలుపు మేరకు కరోనాను ఎదుర్కొనేందుకు రాజకీ యాలకతీతంగా ప్రతి కాంగ్రెస్వాదితోపాటు ప్రజలందరూ సహకరించారని గుర్తుచేశారు. అదే విధంగా ప్రస్తుత విపత్తు నుంచి రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది మొదట్లో సూపర్ ఎల్‌నినో ప్రభావం గురించి శాస్త్రవేత్తలు హెచ్చరించగానే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుందని వివరించారు. రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై గురువారం అందుబాటులో ఉన్న మంత్రులతో హైదరాబాద్ లోని సచివాలయంలో సమీక్షించిన సీఎం... కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వాటిని వెల్లడించారు. గత 75 సంవత్సరాల్లో తొలిసారిగా సూపర్ ఎల్‌నినో వచ్చిందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు.
గతంలోనూ చాలా సార్లు ఎల్‌నినో వచ్చిందని, దాన్నే కరువు అంటామని వివరించారు. ఇప్పుడు అంతకుమించి తీవ్రమైన కరువు సంభవిం చిందని గుర్తు చేశారు. ఈ విపత్తు ప్రభావం ప్రతీ జీవరాశిపై ఉంటుందని చెప్పారు. సాగు, తాగునీటి కొరతతోపాటు ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దీన్ని ముందే పసిగట్టి నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలను తగ్గించాలంటూ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు. దాంతో రాష్ట్రంలోని 13 లక్షల ఎకరాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వేశారని చెప్పారు. మిగిలిన 56 లక్షల ఎకరాల్లో వరి పంట పండించారని చెప్పారు. రాష్ట్రంలో గతేడాది ఇదే సమయానికి రోజుకు 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగ డిమాండ్ ఉంటే ఈ ఏడాది అది 20 వేల మెగావాట్లకు చేరిందని చెప్పారు. అయినప్పటికీ విద్యుత్ శాఖ మంత్రి, సిబ్బంది నిబద్ధతతో పని చేయటం ద్వారా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోగలిగామని అన్నారు. మిగిలిన మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.
కొందామన్నా....విద్యుత్, నీరు లేవు...
ప్రస్తుతం కృష్ణా బేసిన్ లో 72 శాతం, గోదావరి బేసిన్ లో 40 శాతం నీరు తక్కువగా ఉందని సీఎం చెప్పారు. ప్రస్తుత వర్షాకాలంలో 38 శాతం తక్కువగా వర్షం కురిసి అత్యంత అరుదైన అనుభవంలోకి మనల్ని నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది ఇదే సమయాయనికి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 462 టీఎంసీల నీరు నిల్వ ఉండగా... ప్రస్తుతం 209 టీఎంసీల నీరే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తాగునీటికే క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పంట నష్టపోయే రైతులతో పాటు, రాబోయే ఎండాకాలంలో పంటను వాయిదా వేసుకునే వారిని ఆదుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అందరి నుంచి వచ్చే ప్రతి సహేతుకైన సూచనను, సలహానూ స్వీకరిస్తామని చెప్పారు.
విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగిన రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తక్కువ ధరకు తెలంగాణకు అందివ్వాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎంత ధర అయినా చెల్లించి కరెంటును కొనుగోలు చేద్దామంటే విద్యుత్ దొరకని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇదే సమయంలో నీటిని కొనే పరిస్థితే ఉండబోదనే విషయాన్ని అర్థం చేసుకోవాలంటూ ప్రజలను అభ్యర్థించారు. పంట నష్టపోయే, పంట వాయిదా వేసుకునే రైతులను ఆదుకునేందుకు వీలుగా ప్రాయోజిత పథకాల్లో భాగంగా ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నవంబర్ మొదటి వారంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి... ప్రధాని మోడీతోపాటు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్టు సీఎం వెల్లడించారు. కోవిడ్-19 సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలబడి సహకరించిందనీ, రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం అదే విధంగా సూపర్ ఎల్ నినోను ఎదుర్కొనేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రతీ ఒక్కరూ విజ్ఞతతో వ్యవహరించాలనీ, ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
నోడల్ ఆఫీసర్ నియామకం
సూపర్ ఎల్‌నినో సమాచారం సేకరించేందుకు, ఆ సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వ సలహాదారు, మాజీ సీఎస్ రామకృష్ణారావును నోడల్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. 24 గంటల పాటు పని చేసే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సాగునీరు పొదుపు, విద్యుత్ ఆదా, కూలీలకు ఉపాధి, భూయజమానులకు పంట నష్టం, మూగజీవాలకు పశుగ్రాసం, తాగునీరు, విద్యార్థులు, కార్మికులను ఆదుకోవడం, ఎండవేడిమి ప్రభావానికి గురయ్యే వారికి తక్షణ చికిత్సనందించటమనేవి ప్రస్తుతం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా దసరా తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో అఖిల పక్షం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు. నవంబర్ మొదటి వారంలో తన నేతృత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణులు, మేధావులతో వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కళాకారుల ద్వారా ఆటపాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. సెలబ్రిటీల ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిపై ప్రచారం చేయిస్తామన్నారు. మీడియా, ఇన్ ఫ్లూయెన్సర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టించే వారి మాటలు పట్టించుకోవద్దని ఆయన సూచించారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. వంద దేశాల్లో తీవ్ర కరువుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ వల్లే కరువొచ్చిందనే వారికి ఇంగిత జ్ఞానం లేదని కొట్టిపారేశారు. ఆయా దేశాల్లో తీవ్రమైన కరువు రాబోతున్నదని చెప్పిన ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులా? అని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే ఆ వెసులుబాటు ఎందుకు?
‘‘కొండపోచమ్మ నుంచి పంచపాండవుల చెరువుకు కాలువ తవ్వారు. అక్కడి నుంచి మోటార్ల ద్వారా నేరుగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీరు వెళ్తోంది. రాష్ట్రంలో ఎవరికీ లేని ప్రత్యేక వెసులుబాటు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే ఎందుకు? ఈ నీటి ఎత్తిపోతలపై నిజనిర్ధారణకు మేం సిద్ధం’’ అని రేవంత్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లను గోదావరిలో వృథాగా పోశారని ఆయన విమర్శించారు. మేడిగడ్డను మొత్తం కూల్చేసి మళ్లీ నిర్మించాలని కేంద్ర నిపుణుల కమిటీ చెప్పిందన్నారు. ‘‘కృష్ణా జలాల్లో మన వాటాను తగ్గించి.. తెలంగాణకు మరణశాసనం రాసిందెవరు? ఆ జలాల్లో 299 టీఎంసీలు చాలని 2015లో సంతకం చేసిందెవరు? పదేండ్లలో కృష్ణా బేసిన్లో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినా.. నీటిని నిల్వ చేసుకుని ఉండేవాళ్లం. దాదాపు వంద దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉంది. మరి వంద దేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరవు వచ్చిందా?’’... అని ఆయన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. పదేండ్ల బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పత్తి, ప్రాజెక్టుల కోసం ఇష్టారాజ్యంగా చేసుకున్న ఒప్పందాలతో.. వాటి అంచనాల వ్యయం పెరిగిందే తప్ప అవి వినియోగం లోకి రాలేదని సీఎం ఎద్దేవా చేశారు. నీటి వాటాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టం కంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణ ఎక్కువ నష్టం జరిగిందని విమర్శించారు. ఇందుకు సంబంధించి ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీలో చర్చిద్దామంటూ సవాల్ విసిరారు.






కామెంట్లు (0)