Magazines

అంతరిస్తున్న చెంచులు

56 నిమిషాల క్రితం

Vanishing Chenchus
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 3 నిమిషాల చదవడం

పౌష్టికాహారలేమితో ఇబ్బందులు.. కోట్లల్లో నిధులు ఖర్చు చేస్తున్నట్టు లెక్కలు

ఆగమవుతున్న బతుకులు

అర్హులకు పథకాలు 
అందేది అంతంతే

మహిళలు, చిన్నారుల్లో 
తీవ్ర రక్తహీనతా లోపం

ఎదుగుదల లేక 
శిశు మరణాలు

ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న వైనం

సఫారీల కోసం అడవిలోకి చిరుతలను వదులుతున్న ప్రభుత్వాలు


గిరిజనుల అభివృద్ధికి ఎన్నో నిధులు కేటాయిస్తున్నామని ఓ పక్క కేంద్ర ప్రభుత్వం, ఎంతో అభివృద్ధి చేశామంటూ మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతున్నాయి. కానీ నల్లమల కారడవుల్లో, అమ్రాబాద్‌ టైగర్‌ ‌రిజర్వ్‌ పరిధిలోని ‌చెంచుపెంటల్లో(గిరిజన గ్రామాలు) నివసిస్తున్న చెంచు ఆదివాసీల జీవన స్థితిగతులు మాత్రం ఆందోళనకర స్థితిలో ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, మౌలిక సౌకర్యాలు లేక చెంచులు అల్లాడుతున్నారు. పౌష్టికాహారం అందక మహిళలు, చిన్నారులు తీవ్ర రక్తహీనత లోపంతో బలహీనపడుతున్నారు. దానితో పాటు ఎదుగుదల లేక శిశు మరణాలూ సంభవిస్తున్నాయి. ఉపాధి లేక చెంచులు ఆకలికి అలమటిస్తున్నారు. ఎవరికీ చెప్పాలో తెలియక, చేసేది లేక దుర్భర స్థితిలో జీవనాన్ని గడుపుతున్నారు.


నవతెలంగాణ - మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి ​
తెలంగాణలో అధికారిక గణాంకాల ప్రకారం సుమారు 35,600 మందికి పైగా చెంచులు నివసిస్తున్నారు. నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా(అమ్రాబాద్‌ ‌నల్లమల్ల అడవులు, మహబూబ్‌‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని సుమారు 350 పెంటలు, గూడెలలో చెంచులు విస్తరించి ఉన్నారు. వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఇందిరమ్మ గృహాల కేటాయింపు, టైగర్‌ ‌రిజర్వ్‌ ‌పరిధి నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చే కుటుంబాల కోసం రూ. 15 లక్షల నగదు లేకపోతే ఇల్లు కేటాయింపునకు నిధులు అందిస్తున్నట్టు లెక్కలు చూపుతోంది. చెంచుల ప్రత్యేక ప్రాజెక్టు కింద తాగునీరు, విద్యుత్‌ ‌సరఫరా, రోడ్ల అనుసంధానం కోసం నిధులు కేటాయించి పనులు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. పైకి ఎన్ని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అర్హులైన చెంచులకు ఇవేవీ అందడం లేదని, అటవీ హక్కుల ఉల్లంఘన జరుగు తోందన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అర్హులైన చెంచులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నది చాలా తక్కువన్న వాదనా ఉంది. జనాభా కూడా తగ్గిపోతున్నది. మరోవైపు అడవిలో ఉత్పత్తులు దొరకడం లేదు. ఇంతటి అధ్వానకర స్థితిలో అడవిలో జీవనం సాగిస్తున్న చెంచులను ‘సఫారీ’లు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.

తగ్గిన అటవీ ఉత్పత్తులు

ఎల్‌‌నినో, నీటి వనరులు లేక అటవీ ఉత్పత్తులు కరువయ్యాయి. తేనె గొందు, భూచక్రం గడ్డలు, ఇప్పపూత తదితర పదార్థాలను తెచ్చి అమ్మి ఆహార వస్తువులను కొనుగోలు చేసుకునే వారికి ఇప్పుడవేవీ లేకుండా పోయాయి. దీనికి తోడు నిధులు లేక కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పనులూ నిలిచిపోవడంతో చెంచు ప్రజల జీవనం స్తంభించిపోయింది. చెలిమిల వాగుల పై భాగాన చెక్‌డ్యామ్ నిర్మించి చెంచులకు తాగు, సాగునీటి ఏర్పాట్లు చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

​కనుమరుగవుతున్న పెంటలు

అప్పాపూర్ గ్రామం మల్లంపల్లి పెంటలో 9 చెంచు కుటుంబాలు ఉన్నాయి. అందులో ఐదు కుటుంబాల్లో అందరూ చనిపోయారు. లింగబాయి పెంట, పంది బుర్రపెంట, దూర్యాల పెంటలు కనుమరుగయ్యాయి. పుల్లయ్యపల్లి, ఆగర్లపెంట, రాంపూర్ పెంట, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమల్కల, సంగడి గుండాల తదితర పెంటల చెంచులు ఆకలి బాధలు, అనారోగ్యాలతో అలమటిస్తున్నారు.

మొబైల్ అంబులెన్స్ వైద్యం కొందరికే

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన చెంచులు నివసిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేయకపోయినా అడవి ఆధారంగా బతుకుతున్న చెంచుల జాతి నేడు అంతరించిపోయే స్థితి నెలకొన్నది. అప్పాపూర్‌‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఆగర్ల పెంట ఉంది. ఈ పెంటకు వెళ్లాలంటే మున్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లే రహదారి పులిబొమ్మల దగ్గర ఫరహాబాద్ నుంచి అప్పాపూర్ వరకు 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇక్కడ ఎవరికైనా జ్వరం వచ్చినా, ఇతర ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఆస్పత్రికి వెళ్లడం గగనమే. ప్రస్తుతం ఆగర్లపెంట నుంచి మల్లెపల్లికి వచ్చి అక్కడ మొబైల్ అంబులెన్స్ లో వచ్చిన వైద్యుల చేత చికిత్స చేయించుకుంటారు.


రక్తహీనత వల్లే..

చెంచుల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. కొన్ని పెంటలకు వైద్యం సైతం అందడం లేదు. దట్టమైన అటవీ ప్రాంతంలో రహదారులు లేక వారికి వైద్యమందడం లేదు. ఆహారం, సరైన సమయంలో వైద్యం అందితేనే చెంచులకు ఎటువంటి ప్రాణహానీ ఉండదు.

- ఎంబీబీఎస్ డాక్టర్ ప్రవీణ్
మొబైల్ శాఖ- అప్పాపూర్


పర్యాటక ప్రాంతం కోసం సఫారీ

అందమైన అటవీ ప్రాంతాలను చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం సఫారీలను ఏర్పాటు చేసింది. ఈ సఫారీలను వీక్షించడానికి చిరుతలు, ఎలుగుబంట్లను తెచ్చి ఇక్కడ వదులుతున్నారు. కొత్తగా వచ్చిన చిరుతలు అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లిన చెంచులపై దాడులు చేస్తున్నాయి. దీంతో ఏడాది కాలంగా చెంచులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లడం లేదు.

- తోకల పెద్ద గురువయ్య, 
చెంచు యువకుడు- అప్పాపూర్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్