కార్మిక వ్యతిరేక విధానాలపై పోరుబాట :
డబ్ల్యూఎఫ్‌టీయూ
81వ ఆవిర్భావ దినోత్సవంలో కార్మిక సంఘాల పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు అవసరమనీ, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరుబాట తప్పదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (డబ్ల్యూఎఫ్‌టీయూ) 81వ ఆవిర్భావ దినోత్సవం, అంతర్జాతీయ పోరాట దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని నారాయణగూడ చౌరస్తాలో ఏఐటీయూసీ,సీఐటీయూ, ఏఐయూటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ప్రదర్శన నిర్వహించారు.‘శ్రమ దోపిడీని నివారించాలి, నిత్యావసర ధరల పెరుగుదలను (ద్రవ్యోల్బణం) అరికట్టాలి,నిరుద్యోగ భృతి ప్రకటించి, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలి. యుద్ధం వద్దు - శాంతి కావాలి’ అంటూ ఈ సందర్భంగా కార్యకర్తలు నినదిం చారు. కార్మిక హక్కులతో కూడిన స్థిరమైన ఉపాధిని అందించాలని డిమాండ్ చేశారు. ప్రజల అభివృద్ధికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచాలన్నారు, యుద్ధాలు ఆపి శాంతిని నెలకొల్పాలని, కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ సాంకేతిక పురోగతి కేవలం సంపన్న వర్గాలకే కాకుండా సామాన్య ప్రజలందరికీ ఉపయోగపడాలని అన్నారు. ఏఐని ఉపయో గించటం వల్ల ఉత్పాదకత పెరిగి పెట్టుబడి దారులకు విపరీతమైన లాభాలు వస్తున్నాయని చెప్పారు. మరో పక్క అధిక పనిభారం వల్ల కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. అందువల్ల వారానికి 35 గంటలు (రోజుకు 7 గంటలు) మాత్రమే పనివేళలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను గణనీయంగా పెంచాలన్నారు. వేతనాలు పెంచకపోగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల ద్వారా పని గంటలను 12 గంటలకు పెంచడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్రంలో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాల సవరణ వల్ల కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుం దన్నారు. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దేశాల మధ్య యుద్ధాలు, సైనిక వ్యయాలు తగ్గిస్తేనే ఆర్థిక వ్యవస్థ స్థిరపడి, ప్రజల కొనుగోలు శక్తి ఉపాధి అవకాశాలు పెరుగు తాయని తెలిపారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, స్కీమ్ వర్కర్లకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించి, గౌరవప్రదమైన వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారీ విధానంతో కార్మికులకు పూర్తి విముక్తి లభించదని, సోషలిజం స్థాపన ద్వారానే కార్మిక లోకానికి నిజమైన న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహా మాట్లాడుతూ
ప్రజలందరికీ సార్వత్రిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పని ప్రదేశాల్లో మెరుగైన వసతులు, నాణ్యమైన జీవన ప్రమాణాలు ,బలమైన సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు, యాజ మాన్యాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఏఐయుటియుసి రాష్ట్ర ఇన్‌చార్జి భరత్ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చే సరైన ఆర్థిక వ్యవస్థ కోసం, సంపదను సృష్టించే కార్మికులకే దాని ఫలితాలు దక్కేలా భవిష్యత్తులో ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి సీఐటీయూ నగర కార్యదర్శి జె కుమారస్వామి, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు యాదగిరి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్య క్షులు భూపాల్, పి. జయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, కూరపాటి రమేష్, ఎం. పద్మశ్రీ, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, ఎ. సునీత, ఆర్. రాజు, సెంట్రల్ సిటీ అధ్యక్షులు దశరథ్, జి నరేష్, ఏఐటీయూసీ నాయకులు బి కిషన్, హసీనా బేగం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు
36 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)