చలం నవలలు బ్రాహ్మణ్యంలో ఉన్న హింసని, స్వేచ్ఛా రాహిత్యాన్ని, ఆధిపత్య ప్రవర్తనల్ని తీవ్రంగా వ్యతిరేకించి, ద్వేషించి, ఆ వ్యవస్థపై తిరుగుబాటు చేసి స్త్రీ పురుషులు ఇరువురు సమాన స్థాయిలో స్వేచ్ఛ పరిమళాలను అనుభవించాలని, జీవిత పరమార్ధమైన శాంతిని పొందాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆరాటంతో రాసినవి.
చలం నవలా నాయికలు రక్త మాంసాలు ఉన్న సజీవ పాత్రలు. జీవితానుభవాల్ని బట్టి పాపపుణ్యాలు ఉండవని, మనిషిని మనిషిగా నిలబెట్టేది ప్రేమ అని, అదే వ్యక్తిత్వమని, అది వివాహ బంధం కంటే అనంతమైనదని చలం పాత్రలు అంటాయి. అంతేకాదు పురుషుల్ని తాకని లౌకిక నీతి నియమాలు ఎందుకు పాటించాలని ‘శశిరేఖ’ నిలదీస్తుంది. ‘నామీద ఎవరికి అధికారం ఇవ్వను. ఎవరి సొమ్మును ఐపోను. ఎవరి వస్తువుని కాను. ఎప్పుడూ పొద్దున్నా సాయంత్రమూ ఒకరికి కనబడుతూ, రాత్రంతా వాళ్లతో ఉండి వాళ్ళకి పాతదాన్నై అసహ్యం అయి పోను. ఆఖరికి నీకు కూడా..’ అని స్పష్టంగా జీవిత పరమార్ధాన్ని ‘దైవమిచ్చిన భార్య’లో పద్మావతి తెలియజేస్తుంది. ‘అమీనా’ నవలలో, ఒకరకంగా చెప్పాలంటే స్త్రీ పురుష సంబంధంలోని మోహానికి ఆకర్షణకి కథకుడు, స్త్రీ స్నేహితులు ప్రతీకైతే- అమీనా స్త్రీపురుష సంబంధంలో చలం కాంక్షించే ఒక స్వచ్ఛమైన అనిర్వచనీయమైన స్వేచ్ఛకి ప్రతీక. ‘మైదానం’ లోని రాజేశ్వరి చలం మానస పుత్రిక. పురుషుల హోదాల్ని పెంచే కృత్రిమ హంగులతో, అన్ని రకాల ఆస్తులతో పాటు, స్త్రీ కూడా ఒక ఆస్తి అనే తరహాలో సాగే యాంత్రిక జీవితాలకి, ప్రత్యామ్నాయంగా ఎంతటి సంతోషపూరిత భావోద్వేగ జీవితం గడపొచ్చో రాజేశ్వరి ద్వారా చలం ప్రతిపాదించాడు. ఈరోజున స్త్రీలకి ఎంతో చైతన్యం వచ్చిందనుకున్నా, తమ శక్తిసామర్థ్యాలు, సృజనాత్మకత, తెలివితేటలని భర్తల ఇష్టా ఇష్టాలకి బలి పెడుతున్న లక్షలాది మంది రవణలు అనేకమంది ఇంకా ఉన్నారని ‘వివాహం’ నవల తెలియజేస్తుంది. ‘అరుణ’ తన సోల్ మెట్ కోసం చేసే ఒక విఫల నిష్పల ప్రయాణంగా చెప్పవచ్చు. ఆమె అనిశ్ఛితి నుండి, అశాంతి నుండి, అసంతృప్తి నుండ డెస్పరేట్గా బయటకు వచ్చి శాంతి కోసం, ప్రేమ కోసం చేసే అన్వేషణనే ‘అరుణ’ నవలగా రూపు దాల్చింది.
చలం మిగతా నవలల బ్రాహ్మణ కథానాయికలందరూ ప్రేమికులు, సాహసికులు. కుటుంబ పరిధిని దాటడానికి ప్రయత్నించిన వారే. మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. తమ చుట్టూ ఉన్న కుటుంబ, సంఘ వాతావరణాన్ని ధిక్కరించిన వారు. కానీ ‘బ్రాహ్మణికం’ నవల కథానాయకి సుందరమ్మది అందుకు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం. సనాతన సంప్రదాయంలో పుట్టి పెరగడమే కాదు. ఆ సనాతనత్వాన్ని తన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, అవగాహనల్లో పూర్తిగా నింపుకున్న మనిషి సుందరమ్మ. విపరీతమైన దైవభక్తితో, సనాతనత్వంతో ఉండే ఆమెకి ప్రేమ, స్వేచ్ఛ అంటే తెలియదు. వ్యవస్థతో పోరాడి గాయపడి నేలకొరిగిన స్త్రీ పాత్రను ఎంత బలంగా సృష్టించాడో, అంతే బలంగా ఎలాంటి పోరాటము చేయకపోగా, దానికి అనుగుణంగా బతికిన సుందరమ్మ జీవితం అదే వ్యవస్థకు ఎలా బలిపశువుగా మిగిలిపోయిందో మనకి కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు చలం. చలం మిగతా సాధారణ నాయికల్లా ‘జీవితాదర్శం’లో లాలస కూడా సాహసవంతురాలు, దిక్కర స్వభావి, ముక్కుసూటి మనిషే. జీవితమంటే హృదయానికి నచ్చిన అనుభవాల కోసం చేసే అన్వేషణ అనుకునే మనిషే. జీవితం అన్నాక ప్రేమించే మనుషులు, ప్రేమించబడేవారు, వారితో అనుబంధం మధుర జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి. అయితే అంతకు మించిన స్వీయ అస్తిత్వానికి విలువ ఇవ్వడం అనేది కూడా ఉంటుందని లాలస నిరూపిస్తుంది. చలం సృష్టించిన పాత్రల వ్యవహార శైలి పట్ల ఆయన విమర్శకులకు అనేక ఆరోపణలు ఉండొచ్చు. అయితే ఆ పాత్రలు, సమాజం మీద సంధిస్తున్న ప్రశ్నల ఔచిత్యాన్ని ఎవరూ కాదనలేరు. అందుకే చలం నవలలు ఇప్పటికీ ప్రాసంగికతను కలిగి ఉన్నాయి.
కె పి అశోక్ కుమార్ , 97000 00948





కామెంట్లు (0)