Magazines

సర్ ప్రక్రియ సమస్తం స్వప్రయోజనాల కోసమేనా?

56 నిమిషాల క్రితం

Sir, is the entire process solely for personal gain?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 2 నిమిషాల చదవడం

ఓటర్ల జాబితా సవరణ SSR (స్పెషల్ సమ్మరీ రివిజన్) నుండి క్రమంగా SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)గా మారటంలోని మతలబును గమనించినపుడు పౌరసత్వ చట్టపు ‘అనుబంధ సవరణ’ ప్రక్రియగా కొనసాగుతున్నట్లు అనిపించక మానదు. 13 కోట్ల ఓట్ల గల్లంతు అధికారిక ప్రకటనగా వెలువడటం ECI (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) విశ్వసనీయతను ప్రశ్నిస్తది. ఈ నేపథ్యంలోంచి కవి, కథకులు, పరిశోధకులు, విమర్శకులు ‘పసునూరి రవీందర్’ రాసిన ‘మట్టే నా శాశ్వత చిరునామా’ కవిత గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత వుంది.


మట్టే నా శాశ్వత చిరునామా


ఈ మట్టితోనే నా పేగుబంధం

నీ తాత్కాలిక కుట్రల గుర్తింపుల్లో

నేను దారితప్పి పోలేను

బతుకొచ్చిన ఆర్యుడా!

ఇక్కడ ఏడ తవ్వినా

తగిలేవి నా మాయిముంతలే

వేల ఊడలమర్రిని నేను


నా తల్లివేరును తాకడం

నీ వల్ల ఏమవుతుంది?


నటించడం దినచర్యను చేసుకున్నోడా...

చెవులు రిక్కించి విను కండ్లప్పగించి చూడు

ఈడ మనుషులున్న జాడ ఇది మమతలున్న నీడ

పారే నదుల ఒడ్డున వికసించిన

నాగరికతల లోయల అడుగుజాడ

నా గుర్తింపును లెక్కించడానికి

నీ వయసు సరిపోదు!


వేలయేండ్ల యుద్ధం నా చరిత్ర

ఓట్ల కోసం నీ అవకాశవాదపు

అత్రుత బతుకొచ్చినోడెవడో

ఇక్కడే బరిగీసి నిలిచినోడు ఎవడో లెక్కలు తీద్దాం

ఎవరి డీఎన్ఏ ఏమిటో తేలుద్దాం!


పశువుల మేత నెపం పెత్తనమే

నీ నిరంతర జపం ఆధిపత్యాన్ని

అణువణువున నింపుకుని

అణిచివేతను సహజగుణం చేసుకుని

ఎన్ని తహెజీబ్లను నేలకూల్చావో

ఎన్ని నిద్ర లేని రాత్రుల్ని నాకు బహుమానంగా ఇచ్చావో...


విభజించి పాలించే నీ జాతంతా ఒక్కటే

ధిక్కారమే శ్వాసగా బతికే నేల ఇది

నీ నక్క జిత్తుల ఎత్తులను చిత్తు చేసే కాలం

నీ కపట ప్రేమల దేశభక్తి బండారం బయటపెట్టే రోజులు

ఇంకెంతో దూరం లేవు


నా ఉనికి, నా అస్తిత్వం అంతా ఈ మట్టే!

సవరించాల్సింది జాబితా కాదు

తుప్పు పట్టిన మీ మెదళ్లను తొలగించాల్సింది ఓట్లను కాదు.

ఈ దేశానికి పట్టిన మీ పీడను!


కవి ఎవరి పక్షమో ఎత్తుగడలోనే స్పష్టమైతది. 13 కోట్ల ఓటర్ల గొంతుకై నినదిస్తడు. గల్లంతైన వాళ్లందరూ ఇక్కడి మూలవాసులేనని అందుకు కారణమైన వ్యవస్థ తాలూకు మూలాలు ఆర్యులవేనని బలంగా వినిపిస్తడు. తుప్పుపట్టిన వారి మెదళ్లను సవరించాలని, ఈ దేశానికి పట్టిన వారి పీడను తొలగించాలని న్యాయమైన ముగింపును ప్రకటిస్తడు.

‘సర్’ ప్రక్రియకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని మూలవాసుల అస్తిత్వ పోరాటంగా, అవకాశవాద రాజకీయాలపై ధిక్కార ప్రకటనగా కవి వర్ణిస్తడు. కవిత్వ నిర్మాణ పరంగా ఆలోచించినపుడు - ఎత్తుగడల్లో ‘బతుకొచ్చిన ఆర్యుడా’ అనడంలో ఫూలే ప్రతిపాదించిన ‘ఆర్యులు - మూలవాసులు’ సంఘర్షణను, ‘గులాంగిరి’ నేపథ్యాన్ని గుర్తుకు తెస్తడు. ‘మాయిముంతలు’, ‘ఎవరి డిఎన్ఎ ఏమిటో తేలుద్దాం’ ప్రస్తావనల ద్వారా పురాతత్వ శాస్త్రీయ ఆధారాల్ని, హరప్పా మొహెంజోదారో నాగరికతను, మార్టిమర్ వీలర్ (The Indus Civilization)కు బలం చేకూరుస్తడు. రాహుల్ సాంకృత్యాయన్ (వోల్గా నుండి గంగకు) కథనాత్మక మానవ నాగరికతా పరిణామానికి జీవం పోస్తడు. ఆధిపత్యం, అణచివేత గురించి మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ (The Annche lation of caste) ను ఆవాహన చేసుకుంటడు.

ప్రస్తుత వర్తమాన సంక్షోభ సందర్భాల్ని సమాంతరంగా మాలవాసీ సిద్ధాంతంతో ముడిపెట్టి కవితను నిర్మించటం ద్వారా రగులుతున్న సమస్యలకు మూలాల్ని ఎక్కడి నుండి పరిశోధించాలో, ఎవరు ఏయే భావజాలాలకు వారసులో చెప్పటం ద్వారా అవగాహనను కల్పిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరి ఓట్లు తొలగించ బడుతున్నాయో, ఏయే రాష్ట్రాల్లో ఉద్ధేశ్యపూర్వకంగా, ‘సర్’ ప్రక్రియ కొనసాగుతుందో విశ్లేషించుకోవడం ద్వారా ఎవరి స్వప్రయోజనాలు నెరవేరే అవకాశం వుందో తెలుసుకోవచ్చు.


బండారి రాజ్‌‌కుమార్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్