మార్పును గమనించేవారు వర్తమానంలో ఉంటారు. మార్పును శాసించేవారే భవిష్యత్తును ఏలుతారు! అనేది నిత్య సత్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో సంభవిస్తున్న మార్పులు కేవలం ఒక తాత్కాలిక ట్రెండ్ కాదు. అదొక బృహత్తర సామాజిక-సాంకేతిక విప్లవం. మానవ విజ్ఞానం, సాంకేతిక ఆవిష్కరణలు, అంతర్జాతీయ ఆర్థిక సమీకరణలు కలసి పనిచేసే విధానాన్నే పునర్నిర్వచిస్తున్నాయి. ఒకప్పుడు ఒక ఉద్యోగంలో చేరి రిటైర్మెంట్ వరకు అదే పని చేయడం సురక్షితమైన మార్గంగా భావించేవారు. కానీ నేడు డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రిమోట్ వర్క్ విధానాలు రావడంతో ఉద్యోగాల స్వభావం, అవసరమైన నైపుణ్యాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం...
సాంకేతికత వల్ల కొన్ని సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతున్నప్పటికీ, సరికొత్త అవకాశాలు, రంగాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ మారుతున్న ఉద్యోగ ముఖచిత్రంలో నిలదొక్కుకోవడానికి, రాణించడానికి నిరంతర అభ్యాసం, అనుకూలత అత్యంత కీలకమైన అంశాలుగా మారాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమంది యువకుల్లో ఏడుగురు సాఫ్ట్ వేర్ లేదా ఐటీ వైపు వెళ్తున్నారు. దీనివల్ల సాఫ్ట్ వేర్ రంగంలో పోటీ పెరిగి, సగటు జీతాలు స్థిరంగా ఉన్నాయి. కానీ, సంక్లిష్టమైన యంత్రాలను బాగు చేసే టెక్నీషియన్ల సంఖ్య తగ్గిపోయింది. నేటి ఉద్యోగ ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది.
టెక్నీషియన్లకు ప్రాధాన్యం
దశాబ్దాలుగా అత్యధిక వేతనాలకు ‘కేరాఫ్ అడ్రస్’గా నిలిచిన సాఫ్ట్వేర్ రంగానికి ధీటుగా, ఇప్పుడు ప్రొఫెషనల్ టెక్నీషియన్లు, హెవీ వెహికల్ డ్రైవర్ల నైపుణ్యాలకు ఊహించని రీతిలో డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ యువత ఏసీ గదుల్లో కూర్చుని చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపే మొగ్గు చూపడంతో, పరిశ్రమలకు అత్యంత కీలకమైన భారీ యంత్రాలను నడిపే డ్రైవర్లు, వాటిని మరమ్మతు చేసే టెక్నీషియన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్లో వీరి సరఫరా తక్కువగా ఉండి, డిమాండ్ విపరీతంగా ఉండటంతో కంపెనీలు వీరికి భారీ జీత్యాలు చెల్లించక తప్పడం లేదు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ట్రక్ డ్రైవర్లు, ఆటోమొబైల్ టెక్నీషియన్లకు విపరీతమైన కొరత ఉంది. ఉదాహరణకు, అమెరికాలో అనుభవజ్ఞులైన ట్రక్ డ్రైవర్లు ఏటా $120,000 వరకు సంపాదిస్తున్నారు. ఇది అక్కడ పనిచేసే ఎంతోమంది ప్రారంభస్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వేతనాల కంటే చాలా ఎక్కువ.
‘జీరో-ఎర్రర్ టాలరెన్స్’
ప్రపంచంలో తప్పులు (Errors), లోపాలు (Bugs) అనేవి సహజం. అయితే సాఫ్ట్వేర్ అభివృద్ధి రంగంలో ఉత్పన్నమయ్యే బగ్స్కు, క్షేత్రస్థాయిలో న్యూ-ఏజ్ టెక్నీషియన్లు ఎదుర్కొనే ఎర్రర్లకు మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. సాఫ్ట్వేర్ కోడింగ్‌లో ఏదైనా పొరపాటు లేదా బగ్ దొర్లితే సిస్టమ్ క్రాష్ కావచ్చు లేదా స్క్రీన్ పై ఎర్రర్ మెసేజ్ రావచ్చు. దీనిని డెవలపర్లు ఏసీ గదుల్లో కూర్చుని టెస్టింగ్ ద్వారా, సాఫ్ట్వేర్ ‘ప్యాచ్’లేదా ‘అప్డేట్’ పంపడం ద్వారా సులభంగా సరిదిద్దవచ్చు (Rollback /Undo). కానీ, ఏవియేషన్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, అండర్ వాటర్ వెల్డింగ్ లేదా స్మార్ట్ అగ్రికల్చర్ వంటి రంగాల్లో పనిచేసే న్యూ-ఏజ్ టెక్నీషియన్ల పనితీరులో ఎలాంటి Undo బటన్ ఉండదు. గాల్లో వెళ్తున్న విమానంలో లేదా డ్రోన్‌లో సెన్సార్ బిగింపులో చిన్న ఎర్రర్ దొర్లినా, సముద్రపు అడుగున ఆయిల్ పైప్‌లైన్ వెల్డింగ్‌లో చిన్న రంధ్రం వదిలేసినా అది కోట్లాది రూపాయల ఆస్తి నష్టానికే కాక, ఊహించని ప్రాణనష్టానికి దారితీస్తుంది. అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే న్యూ-ఏజ్ టెక్నీషియన్లు వహించే బాధ్యత, వారి నైపుణ్యానికి ఉన్న విలువ అత్యంత ప్రాధాన్యమైనవి. వీరు చేసే ప్రతి అసెంబ్లీ, ప్రతి కనెక్షన్ ‘జీరో-ఎర్రర్ టాలరెన్స్’ సూత్రంపై ఆధారపడి ఉంటుంది.
అసలైన ప్రగతికి సిసలైన పునాది
రాబోయే దశాబ్దంలో వందలాది కొత్త విమానాలు సేవల్లోకి రానుండటంతో, వేలాది మంది ‘ఏవియేషన్ టెక్నీషియన్ల’ అవసరం ఏర్పడనుంది. భారతదేశంలో కూడా లాజిస్టిక్స్, తయారీ రంగాలలో నిపుణులైన టెక్నీషియన్లకు డిమాండ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అయితే, పాశ్చాత్య దేశాల తరహాలో ఇక్కడి టెక్నీషియన్ల వేతనాలు సాఫ్ట్వేర్ రంగ జీతాలను దాటిపోవడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. అయినప్పటికీ, కేవలం డెస్క్ ఉద్యోగాలే కాకుండా నైపుణ్యంతో కూడిన సాంకేతిక వృత్తులకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తోంది. క్షేత్రస్థాయిలో గాల్లో ఎగిరే విమానాన్ని పరీక్షించడం, నూతన సాంకేతికతతో కూడిన డ్రోన్లను వ్యవసాయ రంగంలో నడిపించడం, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను అమర్చడం వంటి పనులకు అసాధారణమైన ప్రజ్ఞ, మానసిక అప్రమత్తత, తక్షణ నిర్ణయం తీసుకోగల సామర్థ్యం అవసరం. నేడు సాంప్రదాయ ఉద్యోగాల నిర్వచనాలు మారుతున్నాయి. ఏసీ గదుల హంగుల కంటే, ఆకాశంలో విమానాన్ని నడిపించే, దేశ రక్షణకు బాసటగా నిలిచే, అన్నదాతకు సాంకేతిక సాయం అందించే టెక్నీషియన్ల చెమట చుక్కే నేటి అసలైన ప్రగతికి సిసలైన పునాది.
న్యూ-ఏజ్ టెక్నీషియన్లు
‘న్యూ-ఏజ్ టెక్నీషియన్లు’ ఒకప్పుడు ‘టెక్నీషియన్’ అంటే కేవలం వర్క్‌షాప్‌లలో యంత్రాలను బాగుచేసే లేదా శారీరక శ్రమ మాత్రమే చేసే వ్యక్తి అనే భావన ఉండేది. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ నిర్వచనం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీల కలయికతో నూతనతరం నిపుణులు ఆవిర్భవించారు. వారే ‘న్యూ-ఏజ్ టెక్నీషియన్లు’. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాసే కోడింగ్‌ను నిజ ప్రపంచంలో యంత్రాల ద్వారా నడిపిస్తూ, ఉత్పత్తులను తయారుచేస్తూ, రక్షణ, సేవా రంగాలకు బాసటగా నిలుస్తున్న ఈ సాంకేతిక నిపుణులే నేటి ఆధునిక పారిశ్రామిక విప్లవానికి వెన్నెముక. సాంప్రదాయ టెక్నీషియన్లకు, న్యూ-ఏజ్ టెక్నీషియన్లకు మధ్య చాలా తేడా ఉంది. వీరు కేవలం హ్యాండ్ టూల్స్ వినియోగించేవారు కారు. వీరు క్లౌడ్ డేటా, IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సెన్సార్లు, AI డయాగ్నస్టిక్స్, రోబోటిక్ కంట్రోలర్లను ఉపయోగిస్తారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ల కలయికను (Mechatronics) నిశితంగా అర్థం చేసుకొని, క్షేత్రస్థాయిలో ఉత్పత్తులు సరిగ్గా పనిచేసేలా చూసే హై-టెక్ నిపుణులు వీరు. న్యూ-ఏజ్ టెక్నీషియన్లు కేవలం యంత్రాలను నడిపేవారు కాదు, దేశ ప్రగతి చక్రానికి ఇంధనం వంటివారు.
భారీ ప్యాకేజీలు
కోడింగ్ ఆలోచన అయితే... దానిని క్షేత్రస్థాయిలో రూపకల్పన చేసే చేతులే ఈ టెక్నీషియన్లు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటూ, సాహసాన్ని మేధస్సుతో జోడించే ఈ నూతన తరం నిపుణులే భవిష్యత్తు భారత పారిశ్రామిక రంగాన్ని శాసించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యం కలిగిన డ్రైవర్లు, టెక్నీషియన్ల కొరత తీవ్రంగా ఉంది. సరఫరా దెబ్బ తినకుండా ఉండటానికి కంపెనీలు భారీ జీతాలు ఇస్తున్నాయి. ఏఐ (AI) రావడంతో సాఫ్ట్వేర్ రంగంలో అనిశ్చితి నెలకొంది. కానీ, భౌతికంగా పని చేసే టెక్నీషియన్లు, డ్రైవర్ల అవసరం ఎప్పటికీ ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణాలు, శారీరక శ్రమ, ఇంటికి దూరంగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ వృత్తుల్లో రిస్క్ అలవెన్సులు ఎక్కువగా ఉంటాయి. ట్రక్ డ్రైవర్లు రోజుల తరబడి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్నది. టెక్నీషియన్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో, భారీ ఉష్ణోగ్రతల వద్ద పని చేయాల్సి ఉంటుంది. వారాల తరబడి కుటుంబానికి దూరంగా ఉండటం, నిద్రలేని రాత్రులు, రోడ్డు ప్రమాదాల రిస్క్ ఉంటుంది. ప్రమాదకరమైన యంత్రాలతో, అధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేయాల్సి ఉంటుంది. ఈ కష్టానికి ప్రతిఫలంగా కంపెనీలు భారీ జీతాలు ఇస్తున్నాయి. ప్రతి అదనపు గంటకు రెట్టింపు వేతనం లభిస్తుంది. అమెరికా, యూరప్ దేశాల్లో అనుభవజ్ఞుడైన టెక్నీషియన్ వారానికి 60 గంటలు పనిచేస్తే, అతని జీతం సాఫ్ట్ వేర్ మేనేజర్ జీతం కంటే దాదాపు 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కొన్ని రంగాల్లో టెక్నీషియన్లు లేకపోతే పరిశ్రమలు ఆగిపోతాయి. ఒక విమానం గ్రౌండ్ అయితే ఎయిర్‌లైన్స్‌కు కోట్ల నష్టం. దాన్ని వెంటనే బాగు చేసే టెక్నీషియన్‌కు భారీ ప్యాకేజీలు ఉంటాయి. సముద్రం మధ్యలో రిగ్‌లపై పనిచేసే టెక్నీషియన్లు నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తారు.
ఒక డ్రీమ్ కెరీర్
‘భయపడేవారికి సముద్రం ఒక ప్రమాదం.. సాధించాలనుకునేవారికి అదొక అవకాశాల నిధి’ అనే సూత్రానికి అండర్ వాటర్ వెల్డర్లు నిలువెత్తు నిదర్శనం. అపారమైన ధైర్యం, అసమాన సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికి ఈ రంగం లగ్జరీ జీవితంతో పాటు అంతులేని ఆత్మసంతృప్తిని అందిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, ఉత్సాహభరితమైన అత్యధిక వేతనం లభించే వృత్తుల్లో ఇది అగ్రస్థానంలో నిలుస్తుంది. భూమిపై వెల్డింగ్ చేయడమే నిశితమైన దృష్టి అవసరమయ్యే పని, అలాంటిది నీటి అడుగున, అగాధ సముద్ర గర్భంలో లోహాలను జోడించడం అంటే సాధారణ విషయం కాదు. ఇటు కమర్షియల్ డైవింగ్ అటు టెక్నికల్ వెల్డింగ్ రెండింటి కలయికతో కూడిన ఈ రంగం సవాళ్లను ఇష్టపడే వారికి ఒక డ్రీమ్ కెరీర్. సాధారణంగా సముద్ర గర్భంలో ఉండే పైప్లైన్లు, ఆయిల్ రిగ్గులు, ఓడల అడుగు
భాగాలను బాగు చేయడానికి ఈ వెల్డర్లు అవసరం. సముద్రం లోపల వందల అడుగుల లోతులో, నీటి ఒత్తిడి ఎక్కువగా ఉన్న చోట లోహాలను అతికించడం లేదా కట్ చేయడం వీరి ప్రధాన పని. అండర్ వాటర్ వెల్డింగ్ అనేది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు. అదొక సాహస యాత్ర. ప్రాణాపాయం పొంచి ఉన్నప్పటికీ, వారు చేసే పని ప్రపంచ ఇంధన రంగానికి, మౌలిక వసతుల రక్షణకు వెన్నెముక లాంటిది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి కోడింగ్ ద్వారా డిజిటల్ ప్రపంచాన్ని నిర్మిస్తే, ఈ అండర్ వాటర్ వెల్డర్లు ప్రాణాలకు తెగించి సముద్ర గర్భంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఇంధన పైప్లైన్లను కాపాడుతుంటారు. అందుకే వీరికి అంతటి గౌరవం- వేతనం లభిస్తాయి.
టెక్నీషియన్లకు కొరత వల్లనే
మనదేశంలో కూడా సీనియర్ టెక్నీషియన్లు, హెవీ వెహికల్ ఆపరేటర్లకు మంచి ప్యాకేజీలు లభిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ రంగంలో అత్యున్నత నైపుణ్యాలు ఉన్నవారికి కోట్లలో జీతాలు ఉంటాయి. అయితే, సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగితో పోలిస్తే, నైపుణ్యం కలిగిన ఒక ‘స్పెషలైజ్డ్ టెక్నీషియన్’ జీతం నేడు ఎంతో ఆశాజనకంగా ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువగా ఉన్నప్పుడు కంపెనీలు భారీ జీతాలు ఇవ్వక తప్పడం లేదు. సాంప్రదాయ మెకానిక్ పనులకు తోడు, ఇప్పుడు సాఫ్ట్ వేర్, సెన్సార్లతో పని చేసే టెక్నీషియన్లకు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగడంతో, బ్యాటరీ మేనేజ్మెంట్ హై-వోల్టేజ్ సిస్టమ్స్ తెలిసిన వారికి భారీ డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇంజన్ ఉండదు. కంప్యూటర్ స్కాన్ల ద్వారా బ్యాటరీ హెల్త్ ను తనిఖీ చేయడం, కూలింగ్ సిస్టమ్స్‌ను బాగు చేయడం, సాఫ్ట్ వేర్ ‘గ్లిచెస్’ సరిచేయడం. వీరికి ‘హై-వోల్టేజ్ సర్టిఫికేషన్’ ఉండటం ముఖ్యం. ‘ఎక్కడైతే నైపుణ్య కొరత ఉంటుందో, అక్కడ జీతం ఎక్కువగా ఉంటుంది’ అనేది మార్కెట్ సూత్రం. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ , మెయింటెనెన్స్ చేసే టెక్నీషియన్లకు కొరత ఏర్పడింది. ఇళ్లలో, పరిశ్రమల్లో స్మార్ట్ పరికరాలను అమర్చే వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలు, వేర్‌హౌస్‌లలో రోబోల వాడకం పెరిగింది. అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసేది టెక్నీషియన్లే. రోబోటిక్ ఆర్మ్స్ మెయింటెనెన్స్, సెన్సార్ల కాలిబ్రేషన్ - సాఫ్ట్ వేర్ అప్డేట్స్. ఆటోమొబైల్, ఇ-కామర్స్ రంగాల్లో డిమాండ్. ఇటీవల ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్ సీఈవో జిమ్ ఫార్లే ఒక పాడ్ కాస్ట్లో.. తమ సంస్థలో దాదాపు 5000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో చాలావాటికి ఏటా కోటి రూపాయల జీతం ఆఫర్ చేస్తున్నా, పనిచేసేందుకు సరైన స్కిల్డ్ వర్కర్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఫోర్డ్ మాత్రమే కాదు వాల్ మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా తమ ట్రక్ డ్రైవర్లకు, టెక్నీషియన్లకు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలను ప్రకటిస్తున్నాయి.
నిపుణులకు డిమాండ్
మాన్యుఫ్యాక్చరింగ్ తెలిసిన టెక్నీషియన్లకు రాబోయే పదేండ్లలో విపరీతమైన డిమాండ్ ఉండబోతోంది. వ్యవసాయం, డెలివరీ రంగాల్లో టెక్నీషియన్ల అవసరం ఇప్పుడు మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ రెండు రంగాల్లోనూ డ్రోన్ టెక్నాలజీ ఆటోమేషన్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. సాంప్రదాయ వ్యవసాయం కాస్తా ఇప్పుడు ‘స్మార్ట్ ఫార్మింగ్’గా మారుతోంది. దీనివల్ల కింది విభాగాల్లో నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు అగ్రికల్చర్ లేదా డెలివరీ అంటే తక్కువ స్థాయి పనులుగా భావించేవారు. కానీ ఇప్పుడు ఇవి హై-టెక్ రంగాలుగా మారిపోయాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కోడింగ్ రాస్తే, ఈ టెక్నీషియన్లు ఆ కోడింగ్ ద్వారా నడిచే యంత్రాలను క్షేత్రస్థాయిలో నడిపిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. టాప్ లెవల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇప్పటికీ అత్యధిక జీతాలు అందుకుంటున్నారు. కానీ, ఒక సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతంతో పోలిస్తే, అనుభవం ఉన్న ఒక నిపుణుడైన టెక్నీషియన్ లేదా ఇంటర్నేషనల్ ట్రక్ డ్రైవర్ సంపాదన ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. దీనివల్ల ఇప్పుడు చాలా మంది యువత కేవలం డిగ్రీల వెంట పడకుండా, ‘బ్లూ కాలర్’ వృత్తులలో నైపుణ్యం సంపాదించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దశాబ్దాల తరబడి మన మనస్సుల్లో ఉన్న ‘ఉద్యోగం’ అనే భావన పూర్తిగా మారిపోతోంది. సాంకేతిక విప్లవం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని విధానాలను తిరగరాస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని, అసాధారణమైన శారీరక-మానసిక కలగలిపి పనిచేసే ఈ ‘న్యూ-ఏజ్ టెక్నీషియన్లు’ రేపటి భారత పారిశ్రామిక, సాంకేతిక ప్రగతికి అసలైన సూత్రధారులు. ‘ఆలోచన ఎంత గొప్పదైనా.. దానిని ఆచరణలోకి తెచ్చే చేతులే నిజమైన శక్తి’. ఆచరణాత్మక నైపుణ్యాలు, సాహసగుణంతో ముందడుగు వేసే ఈ నూతన తరం నిపుణులే భవిష్యత్తు ప్రపంచాన్ని ఏలబోతున్నారు!
సూపర్ టెక్నీషియన్లు
నూతన తరం ఉద్యోగ విప్లవంలో ప్రాచీనమైన శ్రమ భావనలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. ‘వైట్ కాలర్’, ‘బ్లూ కాలర్’ అనే పాత విభజనలను చెరిపివేస్తూ ‘న్యూ కాలర్’ నిపుణుల యుగం ఆవిర్భవించింది. వీరు కేవలం నాలుగు గోడల మధ్య కోడింగ్ రాసేవారు కారు, లేదా యంత్రాలను మాత్రమే నడిపే సాధారణ కార్మికులు కారు. సాఫ్ట్వేర్ మేధస్సును క్షేత్రస్థాయి యంత్రాలకు అనుసంధానిస్తూ, సముద్రపు అడుగు భాగం నుండి ఆకాశంలో ఎగిరే డ్రోన్ల వరకు, దేశ రక్షణ వ్యవస్థల నుండి స్మార్ట్ వ్యవసాయం వరకు ప్రతి రంగాన్ని శాసిస్తున్న సూపర్ టెక్నీషియన్లు!
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 80085 77834







కామెంట్లు (0)