Magazines

ఆకాశం దాటి.. అంతరిక్షం వైపు

1 గంట క్రితం

Beyond the sky... towards space.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 7 నిమిషాల చదవడం

రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తూ మనిషి వేల ఏండ్లుగా ఒకే ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు.. “అక్కడ ఏముంది?” ఆ ప్రశ్నే ఖగోళ శాస్త్రానికి పునాది వేసింది. టెలిస్కోపులు పుట్టాయి. రాకెట్లు వచ్చాయి. ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్లాయి. చంద్రుడిపై మనిషి అడుగుపెట్టాడు. అంగారకుడిని రోవర్లు పరిశీలించాయి. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు అంతరిక్ష నౌకలు ప్రయాణించాయి. ఇప్పుడు మనిషి ఆలోచన మరో అడుగు ముందుకు వేసింది. చంద్రుడిపై మరింత కాలం పనిచేయగలమా? అంతరిక్ష కేంద్రాలను నిర్మించగలమా? అంగారకుడి వైపు మానవ ప్రయాణంసాధ్యమా? అంతరిక్షాన్ని సురక్షితంగా, సుస్థిరంగా ఉపయోగించగలమా? ఈ ప్రశ్నల మధ్యే 2026 ప్రపంచ అంతరిక్ష వారోత్సవం జరుగుతోంది. (అక్టోబర్ 4–10 ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు)


ప్రతి ఏడాది అక్టోబర్ 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాన్ని నిర్వహిస్తారు. 2026కు గాను “Rocket Revolution” (రాకెట్ విప్లవం) అనే థీమ్‌ను ఎంపిక చేశారు. రాకెట్ సాంకేతికతలో వస్తున్న మార్పులు, అంతరిక్షానికి చేరుకునే మార్గాల విస్తరణ, కొత్త ప్రయోగ అవకాశాలు, వాణిజ్య అంతరిక్ష రంగం పెరుగుదల వంటి అంశాలకు ఈ థీమ్ ప్రాధాన్యం ఇస్తుంది.


రాకెట్ మారితే...
అంతరిక్ష ప్రయాణానికి రాకెట్ ప్రధాన ఆధారం. భూమి గురుత్వాకర్షణను అధిగమించి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడానికి అపారమైన శక్తి అవసరం. ఒకప్పుడు రాకెట్‌ను ప్రయోగించిన తర్వాత దాని భాగాలను తిరిగి ఉపయోగించడం దాదాపు అసాధ్యంగా భావించేవారు. ఇప్పుడు రాకెట్ సాంకేతికతలో పునర్వినియోగం, తక్కువ ఖర్చు, వేగవంతమైన ప్రయోగాలు, చిన్నఉపగ్రహాల కోసం ప్రత్యేక ప్రయోగ వాహనాలు వంటి మార్పులు వస్తున్నాయి.


ఇదే రాకెట్‌ ‌రెవల్యూషన్‌...
అంతరిక్షానికి ప్రయాణం తక్కువ ఖర్చుతో, ఎక్కువసార్లు, మరింత విస్తృతంగా జరిగే కొద్దీ శాస్త్రీయ పరిశోధన మాత్రమే కాదు... Space Economy కూడా విస్తరిస్తోంది. భారతదేశంలో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 2026 ఆగస్టు నాటికి దేశంలో సుమారు 440 Space Technology Startups నమోదయ్యాయి. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు 9 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ప్రభుత్వం పేర్కొంది.


అంతరిక్ష మౌలిక వసతుల వైపు
భారత అంతరిక్ష ప్రయాణం ప్రారంభమైనప్పుడు ప్రధాన లక్ష్యం ఉపగ్రహాలను నిర్మించడం, ప్రయోగించడం, వాటి ద్వారా దేశానికి ఉపయోగపడే సేవలను అందించడం. ఇప్పుడు లక్ష్యాలు విస్తరించాయి. చంద్రయాన్, ఆదిత్య-L1, NISAR, SpaDeX, గగన్‌యాన్, Chandrayaan-4, Venus Orbiter Mission, Bharatiya Antariksh Station వంటి కార్యక్రమాలు భారత అంతరిక్ష కార్యక్రమం విస్తరిస్తున్నదిశలను చూపిస్తున్నాయి. 2026 సెప్టెంబర్ 4న GSLV-F17 ద్వారా EOS-05ను విజయవంతంగా ప్రయోగించారు. ISRO ప్రకారం EOS-05 ఒక Earth Observation ఉపగ్రహం; భూసమకాలిక కక్ష్య నుంచి చిత్రీకరణ చేసే భారతతొలి imaging satelliteగా దీనిని పేర్కొంది. అంటే భారత అంతరిక్ష ప్రయాణం కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా, వివిధ రకాల అంతరిక్ష మౌలిక వసతుల నిర్మాణం వైపు కూడా సాగుతోంది.


భూమిని గమనించే మరో కన్ను
భారత్–అమెరికా అంతరిక్ష సహకారానికి ప్రతీకగా నిలిచిన NISAR (NASA-ISRO Synthetic Aperture Radar) మిషన్ 2025 జూలై 30న GSLV-F16 ద్వారా ప్రయోగించబడింది. రాడార్ ఆధారిత పరిశీలన ద్వారా భూమి ఉపరితలంలోని సూక్ష్మ మార్పులను గమనించడం ఈ మిషన్‌ ‌ప్రత్యేకత. భూకంపాలు, భూకంపాల తర్వాత భూభాగ మార్పులు, భూస్థలనాలు, మంచుప్రాంతాలు, అడవులు, వ్యవసాయం వంటి అనేక అంశాలపై పరిశోధనలకు NISAR డేటా ఉపయోగపడుతుంది. 2026 జూలై 8 నుంచి NISAR S-band SAR డేటా ఉత్పత్తులను operational production environment నుంచి క్రమబద్ధంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ISRO తెలిపింది. అంటే అంతరిక్షంలో తిరుగుతున్న ఒక ఉపగ్రహం.. భూమిపై జరిగే మార్పులను అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తోంది.


భారతీయుడు అంతరిక్షంలోకి
భారత అంతరిక్ష కార్యక్రమంలో అత్యంత ఆసక్తికరమైన అధ్యాయం గగన్‌యాన్. భారతీయ వ్యోమగాములను Low Earth Orbit– LEO (భూమికి సుమారు 160–2,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్ష్య) లోకి తీసుకెళ్లి సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. తాజా అధికారిక సమాచారం ప్రకారం Human Rated Launch Vehicle Mark-3 (HLVM3) కు సంబంధించిన Propulsion Stages, Structures Development, Ground Testing పూర్తయ్యాయి. Crew Module (CM), Service Module (SM), Environmental Control and Life Support System (ECLSS), Crew Escape System (CES) వంటి కీలక వ్యవస్థల అభివృద్ధి, పరీక్షలు కొనసాగుతున్నాయి. 2026 నాలుగో త్రైమాసికంలో Vyommitraతో తొలి మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. మానవ సహిత మిషన్ 2027 లక్ష్యంగా ఉంది. మానవుడు అంతరిక్షంలోకి వెళ్లేముందు అంతరిక్ష వాతావరణంలో జీవవ్యవస్థలు, కమ్యూనికేషన్, నియంత్రణ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో పరీక్షించడం అవసరం. అందుకే Vyommitra వంటి హ్యూమనాయిడ్ వ్యవస్థను ఉపయోగించడం గగన్‌యాన్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన పరీక్షా దశ.


మరో పెద్ద కల
భారత్ ఇప్పుడు కేవలం అంతరిక్షంలోకి వెళ్లాలని మాత్రమే కాదు.. అక్కడ ఎక్కువ కాలం పనిచేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ప్రతిపాదిస్తున్నది Bharatiya Antariksh Station – BAS. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం BAS ఐదు మాడ్యూళ్లతో కూడిన భారతీయ అంతరిక్ష కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. BAS-01ను 2028లో ప్రయోగించి, 2035 నాటికి స్టేషన్‌ను operationalize చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ సూక్ష్మ గురుత్వాకర్షణలో పరిశోధనలు, దీర్ఘకాలిక మానవ అంతరిక్షప్రయాణానికి అవసరమైన సాంకేతిక ప్రయోగాలు, జీవశాస్త్రం, పదార్థ శాస్త్రం వంటి రంగాల్లోపరిశోధనలు చేయవచ్చు.


చంద్రుడిపై నమూనాలు...
చంద్రయాన్-3 విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్‌ ‌లాండింగ్‌ సాధించిన భారత్ ఇప్పుడు మరో క్లిష్టమైన లక్ష్యం వైపు వెళ్తోంది. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం. చంద్రయాన్‌-4 ప్రధాన లక్ష్యం ఇదే. చంద్రుడిపై దిగడం మాత్రమే కాదు.. నమూనాలను సేకరించడం, వాటిని చంద్రకక్ష్యకు తిరిగి తీసుకురావడం, అంతరిక్షంలో docking నిర్వహించడం, నమూనాలను బదిలీ చేయడం, చివరకు వాటిని భూమికి తిరిగి తీసుకురావడం వంటి అనేక సాంకేతిక దశలు ఇందులో ఉన్నాయి. ఇక్కడే SpaDeX docking technology ప్రాధాన్యం కనిపిస్తుంది. 2025లో SpaDeX ద్వారా autonomous docking, undocking, satellite-to-satellite power transfer విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. భవిష్యత్‌ చంద్రయాన్ - 4, గగన్‌యాన్, BAS వంటి మిషన్లకుఈ సామర్థ్యాలు ఉపయోగపడనున్నాయి.


శుక్రుడి వైపు భారత్
చంద్రుడు మాత్రమే కాదు.. భారత్ దృష్టి ఇప్పుడు శుక్రగ్రహం వైపు కూడా ఉంది. Venus Orbiter Mission – VOM ద్వారా శుక్రుడి వాతావరణం, ఉపరితలం, భూగర్భ నిర్మాణం, అయనోస్ఫియర్ వంటి అంశాలను అధ్యయనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఈ మిషన్‌ను 2028 మార్చిలో ప్రయోగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. Aerobraking, thermal-management వంటి సాంకేతికతలను కూడా ఈ మిషన్‌లో ప్రదర్శించనున్నారు.


భద్రతకూ కీలకమే!
అంతరిక్షం అంటే కేవలం రాకెట్లు, చంద్రుడు, వ్యోమగాములు మాత్రమేకాదు. నేటి ప్రపంచంలో కమ్యూనికేషన్, నావిగేషన్, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, విపత్తునిర్వహణ, భూమి పరిశీలన, అత్యవసర సమాచార వ్యవస్థలు ఉపగ్రహాలపై ఆధారపడుతున్నాయి. అందువల్ల ఉపగ్రహాలను సురక్షితంగా నిర్వహించడం కూడా అంతరిక్ష పరిశోధనలో కీలక అంశంగా మారింది. ఇక్కడే Space Situational Awareness – SSA ప్రాధాన్యం పెరుగుతోంది. అంతరిక్షంలో ఉన్న, పనిచేస్తున్న ఉపగ్రహాలు, పాత ఉపగ్రహాలు, రాకెట్భాగాలు, space debris వంటి వస్తువుల కదలికలను గమనించి, అవి ఒకదాని కొకటి ఢీకొనే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం SSAలో ముఖ్యమైన పని.


అంతరిక్షంలోనూ ట్రాఫిక్
ISRO విడుదల చేసిన Indian Space Situational Awareness Report 2025 ప్రకారం 2025లో ప్రపంచవ్యాప్తంగా 328 launch attempts జరిగాయి. వాటిలో 315 విజయవంతమైన ప్రయోగాల ద్వారా 4,198 operational satellitesను కక్ష్యలోకి చేర్చారు. ఆ ఏడాదిలో space-object populationకు మరో 4,651 వస్తువులు చేరాయి. అంతరిక్షంలో కూడా ట్రాఫిక్ పెరుగుతోందన్నది దీని ద్వారా స్పష్టమవుతోంది. ఉపగ్రహాలు పెరిగే కొద్దీ ఢీకొనే ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరం కూడా పెరుగుతుంది. 2025లో భారత ఉపగ్రహాలకు సంబంధించి ISRO 18 Collision Avoidance Manoeuvres (CAMs) నిర్వహించింది.. Low Earth Orbit (LEO)లో 14, Geostationary Earth Orbit (GEO)లో 4. NISAR కోసం కూడా ఒక Collision-Avoidance Manoeuvreనిర్వహించబడింది. అంటే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఒక దశ మాత్రమే. దాన్ని సురక్షితంగా అక్కడ పని చేయించడం మరో పెద్ద శాస్త్రీయ బాధ్యత.


కనిపించని ప్రమాదం
పనిచేయని ఉపగ్రహాలు, రాకెట్ భాగాలు, ఢీకొనడం వల్ల ఏర్పడిన చిన్నచిన్న ముక్కలు అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయి. వాటినే సాధారణంగా Space Debris లేదా అంతరిక్ష శిథిలాలు అంటారు. ఇవి చిన్నవిగా కనిపించినా వాటి కక్ష్య వేగం చాలా ఎక్కువగా ఉండటంతో పనిచేస్తున్న ఉపగ్రహాలకు ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలో ఒక ముఖ్యమైన ప్రశ్న.. అంతరిక్షాన్ని జయించగలమా? కంటే.. అంతరిక్షాన్ని సురక్షితంగా ఉంచగలమా? అనేది కూడా అంతే ముఖ్యమైనది.


కేవలం యుద్ధం కాదు
Space Security అనే పదం వినగానే చాలామందికి అంతరిక్ష యుద్ధం గుర్తుకు రావచ్చు. కానీ అంతరిక్ష భద్రత పరిధి అంతకంటే విస్తృతమైనది. Space Debris, Satellite Collision, Cybersecurity, Signal Jamming, Signal Spoofing, Space Weather, Space Asset Protection వంటి అంశాలు అంతరిక్ష భద్రతలో కీలకమైనవి. కాబట్టి భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధన అనేది కేవలం అంతరిక్షాన్ని చేరడానికే పరిమితం కాదు. అక్కడికి చేరడం నుంచి అక్కడ పనిచేయడం, వనరులను ఉపయోగించుకోవడం, కార్యకలాపాలను సురక్షితంగా నిర్వహించడం వరకు విస్తరించవచ్చు.


ఆరు దశాబ్దాల్లో మారిన అంతరిక్ష ప్రపంచం
అంతరిక్ష కార్యకలాపాలు క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. 1960లో కక్ష్యలో కనీసం ఒక ఉపగ్రహాన్ని కలిగి ఉన్న దేశాలు కేవలం 2 ఉండగా, 2026 నాటికి ఆ సంఖ్య 109కి చేరింది. అదే సమయంలో ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం ఉన్న దేశాల సంఖ్య కూడా 2 నుంచి 12కి పెరిగింది. ఈ గణాంకాలు ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తున్నాయి. అంతరిక్షం ఇప్పుడు కొన్ని దేశాలకే పరిమితమైన రంగం కాదు. ప్రపంచంలోని అనేక దేశాలు ఉపగ్రహ సాంకేతికత, అంతరిక్ష డేటా, కమ్యూనికేషన్, భూమి పరిశీలన వంటి రంగాల్లో భాగస్వాములవుతున్నాయి. అందువల్ల రాబోయే కాలంలో అంతరిక్ష రంగం మరింత విస్తరించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలతో పాటు Physics, Engineering, Mathematics, Computer Science, Electronics వంటి విభాగాల్లో చదువుతున్న యువతకు కూడా ఇందులో అనేక అవకాశాలు ఏర్పడుతున్నాయి.


మన జీవితానికి ఎంత దగ్గరగా ఉందో తెలుసా?
ఉదయం మనం వాతావరణ సమాచారం చూస్తాం. వాహనంలో ప్రయాణిస్తూ నావిగేషన్‌ ఉపయోగిస్తాం. టెలివిజన్ చూస్తాం. మొబైల్ కమ్యూనికేషన్ ఉపయోగిస్తాం. తుఫాను వచ్చే ముందు ముందస్తు హెచ్చరికలు అందుకుంటాం. రైతు పంట పరిస్థితిని ఉపగ్రహ చిత్రాల ద్వారా అంచనా వేయవచ్చు. వరదలు వచ్చినప్పుడు ప్రభావిత ప్రాంతాలను ఉపగ్రహాలు గుర్తించగలవు. ఇవన్నీ చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అంతరిక్షం మనకు దూరంగా లేదు. మన చేతిలోని మొబైల్ నుంచి మన పొలంలోని పంట వరకు.. మన జీవితంలో అంతరిక్ష సాంకేతికతకు స్థానం ఉంది.


యువతకు ఒక కొత్త ఆకాశం
ప్రపంచ అంతరిక్ష వారోత్సవం అసలు సందేశం ఇదే. అంతరిక్షం శాస్త్రవేత్తలకు మాత్రమే చెందిన రంగం కాదు. ఒక విద్యార్థి రాత్రి ఆకాశాన్ని చూసి అడిగే చిన్న ప్రశ్న.. “ఆ నక్షత్రం ఎంత దూరంలో ఉంది?”.. అదే ప్రశ్న రేపు అతన్ని Astronomy వైపు తీసుకెళ్లవచ్చు. “రాకెట్ ఎలా ఎగురుతుంది?” అనే ప్రశ్న Physics, Engineering వైపు తీసుకెళ్లవచ్చు. “ఉపగ్రహం తన స్థానాన్ని ఎలా తెలుసుకుంటుంది?” అనే ప్రశ్న Mathematics, Computer Science వైపు తీసుకెళ్లవచ్చు. “ఉపగ్రహాన్ని అంతరిక్ష చెత్త నుంచి ఎలా రక్షించాలి?” అనే ప్రశ్న Space Sustainability, Space Security వైపు తీసుకెళ్లవచ్చు.అందుకే విద్యార్థులు ఆకాశాన్ని కేవలం చూడకూడదు. ఆకాశం గురించి ప్రశ్నించాలి. ఆ ప్రశ్న నుంచి విజ్ఞానం నేర్చుకోవాలి. విజ్ఞానం నుంచి ఆవిష్కరణ చేయాలి.


. ముగింపు
ఒకప్పుడు మనిషి ఆకాశాన్ని చూసి కలలు కన్నాడు. తర్వాత రాకెట్‌ను నిర్మించాడు. చంద్రుడిని చేరాడు. ఉపగ్రహాలను ప్రయోగించాడు. అంగారకుడిని పరిశీలించాడు. ఇప్పుడు అంతరిక్ష కేంద్రాల గురించి ఆలోచిస్తున్నాడు. చంద్రుడి నుంచి నమూనాలను భూమికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. భవిష్యత్తులో మానవుడిని మరింత దూరంలోని గ్రహాల వైపు తీసుకెళ్లే సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నాడు. కానీ ఈ ప్రయాణంలో మరో బాధ్యత కూడా ఉంది. అంతరిక్షాన్ని చేరడమే కాదు.. దాన్ని సురక్షితంగా ఉంచాలి. అంతరిక్షాన్ని ఉపయోగించడమే కాదు.. భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలి. అందుకే 2026 ప్రపంచ అంతరిక్ష వారోత్సవంలోని “Rocket Revolution” కేవలం రాకెట్ల గురించి కాదు. అంతరిక్షాన్ని చేరే విధానంలో, దాన్ని ఉపయోగించే పరిధిలో, అంతరిక్ష రంగంలో ఏర్పడుతున్న కొత్త అవకాశాల్లో వస్తున్న మార్పులకు అది ప్రతీక. నిన్న చంద్రుడు ఒక కల... నేడు చంద్రుడు ఒక పరిశోధనా ప్రపంచం... రేపు అంతరిక్షమే మనిషి కొత్త ప్రయోగశాల! ఆకాశం దాటి... అంతరిక్షం వైపు!

సంవత్సరం

ఉపగ్రహం కలిగిన దేశాలు

ఉపగ్రహాలను ప్రయోగించే దేశాలు

1960

2

2

1970

10

5

1980

17

8

1990

25

9

2000

42

10

2010

52

11

2020

88

12

2026

109

12

డా. పల్లె. సూర్యనాగి రెడ్డి 9491155894

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్