Magazines

హైద్రాబాద్ పరిసరాల్లో పాతరాతియుగం పనిముట్లు

59 నిమిషాల క్రితం

Paleolithic tool
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

నగరం మూడు లక్షల సంవత్సరాల ప్రాచీనతకు తాజా సాక్ష్యం. మరోసారి హైద్రాబాద్ ప్రాచీనతకు సాక్ష్యంగా పాతరాతియుగం పనిముట్లు కనుగొనబడ్డాయి. ఇవి ఈ ప్రాంతంలోని ప్రాచీన మానవావాసానికి బలమైన సాక్ష్యాలు అందిస్తున్నాయి. క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణా వైస్ ప్రసిడెంట్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, మారేడు ఎన్విరాన్‌మెంటల్ సర్వీసెస్ సహ-వ్యవస్థాపకుడు మీర్ ఒమర్ అలీ ఖాన్, అలాగే వన్యప్రాణి సంరక్షకుడు, హైటికోస్ సభ్యుడు శ్రీపతి వైష్ణవ్‌తో కలిసి జరిపిన సంయుక్త క్షేత్ర అన్వేషణలో పాతరాతియుగం క్వార్ట్జ్ రాతి చేతిగొడ్డలిని గుర్తించారు. వారితో కలిసి సాయి వరుణ్ (బీట్ అధికారి), పవన్ (సెక్షన్ అధికారి) కూడా క్షేత్రంలో ఉన్నారు. ఈ అన్వేషణకు రంగారెడ్డి జిల్లా డీఎఫ్‌ఓ శివ్ ఆశీష్ సింగ్ ఐఎఫ్‌ఎస్ మరియు రేంజ్ అధికారి జె. ప్రభాకర్ మద్దతు ఇచ్చి బృందానికి సహాయం చేశారు. ఈ పనిముట్టు దక్షిణ హైద్రాబాద్ ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, కొంగరకలాన్‌కు ఆనుకుని ఉన్న కొంగర ఖుర్దు ‘బి’ అటవీ ప్రాంతంలో 17°11'01.1" ఉత్తర అక్షాంశం మరియు 78°30'44.4" తూర్పు రేఖాంశం వద్ద లభించింది. ఇది ఈ బృందం చేసిన మొదటి ఆవిష్కరణ కాదు.

గతంలో మీర్ ఒమర్ అలీ ఖాన్ స్వయంగా మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కులోని మంచిరేవుల బీరప్పగుట్ట వద్ద క్వార్ట్జ్ రాతితో తయారు చేసిన పాతరాతియుగం చేతిగొడ్డళ్లు, పాయింట్లను కనుగొన్నారు. ప్రస్తుత అన్వేషణలో చేతిగొడ్డలితో పాటు అదే క్వార్ట్జ్‌తో చేసిన గుండ్రని వడిసెల రాయిని కూడా సేకరించారు. ఈ ఆవిష్కరణ పాతరాతియుగంలో కూడా వడిసెల రాళ్లు ఉండేవని సూచిస్తోంది. ఈ ఆవిష్కరణపై వ్యాఖ్యానిస్తూ కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ ‘ఈ పనిముట్లు మంచిరేవుల - కొంగర ఖుర్దు ప్రాంతం ఒకప్పుడు ప్రాచీన మానవుల ఆవాసంగా ఉండేదని, కనీసం 3 లక్షల (3,00,000) సంవత్సరాల నుంచి గొప్ప మానవావాసంగా ఉన్నదని చెప్పడానికి బలమైన సాక్ష్యాలు’ అన్నారు. ఈ ప్రాంతాలను పురావస్తు శాస్త్రవేత్తలు మరింత విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు అన్నారు.


క్షేత్ర పరిశోధన వివరాలకు: మీర్ ఒమర్ అలీ ఖాన్, వైస్ ప్రసిడెంట్, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణా & సభ్యుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం – 6305889784 చారిత్రక వివరణకు: శ్రీరామోజు హరగోపాల్, అధ్యక్షుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం – 9949498698

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్