ఏర్పాట్లపై సీఎస్
సంజయ్‌జాజు సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణా సంస్కృతి, సంప్రదాయ ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాల పూల పండగను ఈనెల 10 నుంచి 18 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల పై శనివారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శు లు, పోలీస్ అధికారులు హాజయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ 18 వ తేదీన ట్యాంక్ బండ్ పై వేలాది మంది మహిళలతో సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని చెప్పారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచిమహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చి ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారనీ, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద జరిగే ఈ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని పండగ శోభ వచ్చేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్ట ఏర్పాట్లు, బందోబస్తు చేయాలని చెప్పారు. ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్ లోని బతుకమ్మ ఘాట్ తోపాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ ఎంసీ అధికారులను ఆదేశించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంకు బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందున ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాలు జరిగే పది రోజులు రవీంద్ర భారతిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. బతుకమ్మ ఉత్సవాలను ప్రతిబింబించేలా ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నామనీ, డిసెంబర్ లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను కూడా ఈ లోగోలో తెలియచేసే విధంగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి వాణి ప్రసాద్, సీపీ హైదరాబాద్ వీసీ సజ్జనార్, పంచాయితీ రాజ్ కమిషనర్ దివ్య, జిహెచ్ ఎం సి కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ఆర్టీసీ ఎం.డి. నాగిరెడ్డి, సీపీ మల్కాజిగిరి బి.సుమతి, జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్), హైదరాబాద్ జోయెల్ డేవిస్, స్పెషల్ కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ ముకుంద రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ షేక్ యాస్మీన్ బాషా, జలమందిలి అశోక్ రెడ్డి, టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్, శిల్పారామం, సంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎ. నర్సింహారెడ్డి, ప్రత్యేక అధికారి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలు
42 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)