Magazines

పాఠశాలల దుస్థితిపై రోడ్డెక్కిన విద్యార్థులు

57 నిమిషాల క్రితం

Students take to the streets over the poor condition of schools.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

ఫ్రాన్స్‌లో నిరసనలు...వేలాది మంది అరెస్ట్‌
మూతపడిన 400 స్కూల్స్‌
ఆందోళనల ఉధృతికి విద్యార్థి సంఘాల నిర్ణయం
పారిస్‌ : పాఠశాలల దుస్థితిపై ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఉపాధ్యాయులు, పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనల కారణంగా వేలాది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతలను నివారించేందుకు ఓ వైపు అధికారులు ప్రయత్నిస్తుండగా మరోవైపు దేశవ్యాప్తంగా శుక్రవారం 400కు పైగా పాఠశాలలను మూసివేశారు. తూర్పు ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యువకులు బారికేడ్లు నిర్మిస్తుండగా పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లియోన్‌ సహా పలు నగరాల్లో శాంతియుతంగా ప్రదర్శనలు జరుగుతు న్నాయి. దేశంలో విద్యారంగం వనరుల కొరతతో కూనారిల్లిపో తోందని, ఆ రంగంపై అధిక భారం పడుతోందని ఆందోళన కారులు ఆరోపించారు. తరగతి గదులలో రద్దీ అధికంగా ఉన్నదని, గైర్హాజరు అయిన ఉపాధ్యాయుల స్థానంలో కొత్తవారిని నియమించడం లేదని, పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నా యని వారు విమర్శించారు.
ఎలుకలు, బద్దింకల స్వైరవిహారం
పారిస్‌ శివారులోని పాంటిన్‌లో నిరసన తెలుపుతున్న పదిహేనేండ్ల కేసియా రాయిటర్స్‌ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ 'ఒక్కో తరగతిలో 35 మంది ఉన్నాము. తరగతి గదిలో సరిపడా కుర్చీల్లేవు. అందరూ భోజనం చేసేందుకు గంట విరామం ఇస్తున్నారు. ఇది ఏ మాత్రం సరిపోవడంలేదు' అని వాపోయింది. తరగతి గదులలో రద్దీ, ఉపాధ్యాయుల కొరత, పాఠశాల భవనాల శిథిలావస్థ వంటి సమస్యలతో పాటు తరగతి గదులలో ఎలుకలు, బద్దింకలు స్వైరవిహారం చేస్తున్నాయి. పారిస్‌లో ప్రారంభమైన నిరసనలు దేశంలోని సుమారు 500 పాఠశాలలకు విస్తరించాయి. బోర్డో, నాంటెస్‌, మార్సెయిల్‌ వంటి నగరాలలో విద్యార్థులు పాఠశాలల గేట్లను దిగ్బంధించారు. కొన్నిచోట్ల అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి. మార్సెయిల్‌లో ఓ ఫైరింజన్‌కు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఇప్పటివరకూ సుమారు ఐదు వేల మందికి పైగా ఆందోళనకా రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిరసనలు ప్రజల భద్రతకు ముప్పుగా మారాయని న్యాయ శాఖ మంత్రి గెరాల్డ్‌ డార్మానిన్‌ చెప్పారు. ఇదిలావుండగా హైస్కూలు విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా మంగళవారం పలు విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టబోతున్నాయి. యూనివర్సిటీలు, హైస్కూల్స్‌లో బంద్‌ పాటించాలని ఆ సంఘాలు పిలుపునిచ్చాయి. అదే రోజు ఉపాధ్యాయులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నారు. నిరసనలు తగ్గుముఖం పట్టే అవకాశాలు లేకపోవడం, హింస కొనసాగడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు, సిబ్బందితో విద్యా శాఖ మంత్రి ఎడ్వర్డ్‌ జెఫ్రే జరిపిన చర్చలు ఫలించలేదు. శాంతియుత నిరసనలు కొనసాగించాలని విద్యార్థి ప్రతినిధులు నిర్ణయించారు. హింసతో తమకు సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. బలప్రయోగాన్ని తప్పుపట్టిన అమ్నెస్టీ మైనర్లపై లాఠీఛార్జీ చేయడం, భాష్పవాయు గోళాలను ప్రయోగించడం వంటి చర్యలకు పాల్పడడాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తప్పుపట్టింది. బలప్రయోగానికి స్వస్తి చెప్పి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. కాగా పోలీసు హింసపై మూడు విచారణలు జరుపుతున్నామని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
ఆందోళనకు రాజకీయ రంగు
దేశంలోని పలు ప్రాంతాలలో మూసివేసిన పాఠశాలల ఎదుట ప్రజలు గుమిగూడడాన్ని అధికారులు నిషేధించారు. అయితే ఈ చర్య పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇదిలావుండగా విద్యార్థుల ఆందోళన రాజకీయ రంగు పులుముకుంటోంది. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష 'లా ఫ్రాన్స్‌ ఇన్సౌమిస్‌' (ఎల్‌ఎఫ్‌ఐ) విద్యార్థులను రెచ్చగొడుతోందని ప్రధాని సెబాస్టియన్‌ లెకోర్ను ప్రభుత్వం ఆరోపించింది. విద్యార్థుల కారణంగా జరిగిన నష్టానికి తల్లిదండ్రులను బాధ్యులను చేసి, వారి నుంచి డబ్బు రాబట్టాలని ఓ మంత్రి ప్రతిపాదించగా ప్రతిపక్ష ఫ్రాన్స్‌ అన్‌బౌడ్‌ పార్టీ మండిపడింది. ఇది అసంబద్ధ ప్రతిపాదన అని ధ్వజమెత్తింది. హింసను సమర్ధిస్తున్నట్లు కన్పిస్తున్న ఎన్నికల అధికారులపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాస్‌ విమర్శలు కురిపించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్