Magazines

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో విద్యార్థి, యువజన ఉద్యమాలు

49 నిమిషాల క్రితం

డీవైఎఫ్ఐ
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

ఉపాధి, విద్య, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు సమరశంఖం : డీవైఎఫ్ కేంద్ర కార్యాలయం ‘భగత్‌సింగ్‌ భవన్‌’
ప్రారంభోత్సవంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
ఐక్య పోరాటాలే లక్ష్యం : డీవైఎఫ్ఐ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఏఏ ర‌హీం, హిమాగ్న‌రాజ్ భ‌ట్టాచార్య
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
భగత్‌సింగ్‌ స్ఫూర్తితో విద్యార్థి, యువజన ఉద్యమాలు కొనసాగాలని సీపీఐ(ఎం) ప్రభాన కార్యదర్శి, డీవైఎఫ్ఐ అఖిల భారత మాజీ అధ్యక్షులు ఎంఏ బేబీ అన్నారు. యువ‌జ‌న, ప్రజా పోరాటాలకు మరింత బలాన్నిచ్చే లక్ష్యంతో దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన డీవైఎఫ్ఐ నూతన కేంద్ర కార్యాలయం ‘భగత్‌సింగ్‌ భవన్‌’ను శ‌నివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఏ బేబీ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటం చారిత్రాత్మకమన్నారు. అక్టోబర్‌ 2న జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఆందోళ‌న‌పై ఢిల్లీ పోలీసులు దాడులకు పాల్పడినప్పటికీ ధైర్యంగా ప్రతిఘటించిన డీవైఎఫ్ఐ, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. నిరసనకారులపై పోలీసుల దాడి ప్రజాస్వామిక హక్కులపై దాడి వంటిద‌ని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు దారితీసిన ఉద్యమంలో డీవైఎఫ్ఐ కూడా కీలక పాత్ర పోషించిందని బేబీ గుర్తుచేశారు. నరేంద్ర మోడీ, అమిత్‌ షా, మోహన్‌ భగవత్‌లకు సన్నిహితుడిగా పేర్కొన్న ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సి వచ్చిన పోరాటం యువజన ఉద్యమాల శక్తిని చాటిందన్నారు. ఆ ఉద్యమానికి కొనసాగింపుగా ఇప్పుడు రెండో దశ పోరాటం ముందుకు సాగనుందని తెలిపారు.
ఓటు హక్కు పరిరక్షణకు ఉద్యమం
దేశంలో ఓటు హక్కును పరిరక్షించాలనే డిమాండ్‌తో చేపట్టిన పోరాటాన్ని డీవైఎఫ్ఐ తన భుజస్కంధాలపై వేసుకుందని ఎంఎ బేబీ అన్నారు. యువతకు ఉపాధి కల్పన, గౌరవప్రదమైన వేతనాల కోసం డీవైఎఫ్ఐ ఉద్యమానికి పిలుపునిచ్చిందని తెలిపారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణతోపాటు యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఆర్థిక సమస్యలపై పోరాటాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. యువ‌జ‌న పోరాటాకు వేదిక‌గా కార్యాల‌యం ఉండాల‌ని అన్నారు. సంస్థ కార్యకలాపాల నిర్వహణకు కార్యాలయం అవసరమేనని, అయితే సంఘం నిరంతరం ప్రజల మధ్య, పోరాట క్షేత్రాల్లో ఉండాలని స్పష్టం చేశారు. కార్యాలయాలు కేవలం సమావేశాలకు, పరిపాలనా కార్యకలాపాలకే పరిమితం కాకూడదని సూచించారు. ఉద్యమాలపై నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు మాత్రమే కార్యాలయానికి రావాలని, మిగిలిన సమయమంతా ప్రజా సమస్యలపై పోరాటాల్లోనే గడపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డీవైఎఫ్ఐ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఏఏ ర‌హీం, హిమాగ్న‌రాజ్ భ‌ట్టాచార్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య పోరాటాలను బలోపేతం చేయడం, నిరుద్యోగం, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలను విస్తరించడం లక్ష్యంగా ఈ కార్యాలయం ప్రారంభమైంద‌ని తెలిపారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల యువజన ఉద్యమాల మధ్య సమన్వయం, కార్యాచరణ రూపకల్పన, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు, భవిష్యత్‌ పోరాటాలకు ప్రణాళికలు రూపొందించేందుకు ఈ కార్యాలయం వేదికగా ఉండ‌నుంద‌ని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల తగ్గింపు, విద్యా రంగంలో పెరుగుతున్న ప్రయివేటీకరణ, యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాల కొరత వంటి సమస్యలు విస్తృత చర్చకు వస్తున్న నేపథ్యంలో యువజన సంఘాల పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంద‌ని తెలిపారు. భగత్‌సింగ్‌ పేరుతో ఏర్పాటైన ఈ నూతన కేంద్ర కార్యాలయం దేశవ్యాప్తంగా యువజన ఉద్యమాల సమన్వయానికి, భవిష్యత్‌ పోరాటాల ప్రణాళికలకు వేదికగా నిలవనుంద‌న్నారు. ప్రారంభోత్సవ సభలో డీవైఎఫ్ఐ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హనన్‌ మొల్లా, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు బృందా కరత్‌, డీవైఎఫ్ఐ అఖిల భారత కోశాధికారి సంజీవ్‌ కుమార్‌, కేంద్ర కార్యవర్గ సభ్యులు జైక్‌ సి. థామస్‌, , డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి జి.రామ‌న్న‌, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఆదర్శ్‌ ఎం. సాజి, శ్రీజన్‌ భట్టాచార్య, ఐద్వా ప్రధాన కార్యదర్శి కనినికా ఘోష్‌, ఏఐఏడ‌బ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్