ఇరాన్ అణు కర్మాగారాలపై ట్రంప్
డొనాల్డ్ వాదనపై నిపుణుల విస్మయం
వాషింగ్టన్ : ఇరాన్ అణు కర్మాగారాలపై రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య అమెరికన్లనే కాకుండా నిపుణులను కూడా ఆశ్యర్యానికి గురి చేస్తున్నాయి. గత సంవత్సరం అమెరికా దాడికి గురైన మూడు ఇరాన్ అణు కర్మాగారాలను గురించి ట్రంప్ అనేక విషయాలు చెప్పారు. వాటిని డ్రగ్ కర్మాగారాలుగా అభివర్ణించారు. ట్రంప్ వ్యాఖ్యపై కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన న్యూక్లియర్ పాలసీ ప్రోగ్రామ్ సహ-డైరెక్టర్ జేమ్స్ ఆక్టన్ స్పందిస్తూ 'నాకు తెలిసినంత వరకూ ట్రంప్ చెబుతున్న ఫోర్డో కర్మాగారాన్ని మాదకద్రవ్యాల ఉత్పత్తి కోసం ఉపయోగించడం లేదు. అసలు నేను ఇప్పటి వరకూ అలాంటి ఆరోపణ ఏదీ వినలేదు' అని చెప్పారు. కాగా ట్రంప్ వ్యాఖ్యపై వివరణ ఇచ్చేందుకు అధ్యక్షభవనం నిరాకరించింది.
సమర్ధనకు తంటాలు
వాస్తవానికి అంతకుముందే కరేబియన్‌లో అక్రమ మాదకద్రవ్యాల రవాణాను అరికట్టడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను, వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను పట్టుకున్న ఉదంతాన్ని ఆ ర్యాలీలో ట్రంప్ వివరించారు. ఆ వెంటనే ఇరాన్‌లోని డ్రగ్ ఫ్యాక్టరీలపై బాంబులు పడ్డాయని చెప్పారు. వెనిజులా ప్రస్తావన తెచ్చిన వెంటనే ఇరాన్ పేరు తీయడంతో పొరబాటుగా అలా మాట్లాడారా అన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే తమ మాటలో తడబాటు దొర్లినప్పటికీ దానిని అంగీకరించేందుకు ట్రంప్ ఇష్టపడరు. కాబట్టే డ్రగ్ ఫ్యాక్టరీలు అనే తప్పుడు వాదనను సరిదిద్దడానికి బదులుగా ఆయన దానినే పునరుద్ఘాటించారు. అంతేకాక అదనంగా మూడు వాక్యాలను కూడా అల్లుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలను ఎప్పుడూ వెనకేసుకొచ్చే శ్వేతసౌధం ఈసారి దానిని సమర్ధించకపోవడం విశేషం.
ఏం జరిగిందంటే...
తను చెబుతున్నది వాస్తవమా లేక అవాస్తవమా అనే విషయాన్ని పట్టించుకోకుండా తన వాదననే గట్టిగా సమర్ధించుకోవడం ట్రంప్‌కు అలవాటే. చేసిన తప్పిదాన్ని అంగీకరించడం ఆయనకు సుతరామూ ఇష్టం ఉండదు. అసలు జరిగిందేమిటంటే...ట్రంప్ గురువారం వైట్‌హౌస్ నుంచి టెక్సాస్‌లోని ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానంలో కాకుండా కారులో ప్రయాణించారు. దీంతో ఒక్లహోమాలో ర్యాలీకి రెండు గంటల ఆలస్యంగా చేరుకున్నారు. ఇరాన్‌ను ఎదుర్కోవడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ఆ ర్యాలీలో ఏకరువు పెట్టారు. గత సంవత్సరం 'ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్' అనే సంకేతనామంతో ఇరాన్ అణు కర్మాగారాలపై దాడి చేసిన స్టెల్త్ బాంబర్లను గురించి వివరించారు. 'తెల్లవారుజామున ఒంటిగంటకు చిమ్మచీకటిలో బాంబు దాడులు జరిగాయి. ప్రతి ఒక్క బాంబు నేరుగా డ్రగ్ ఫ్యాక్టరీలలోకి దూసుకుపోయింది. వాళ్లు చేస్తున్నది అదే....అణు, డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. డ్రగ్ ఫ్యాక్టరీలు కమ్ న్యూక్లియర్ ఫ్యాక్టరీలపై తీవ్రమైన దాడులు జరిగాయి' అని చెప్పుకొచ్చారు.






కామెంట్‌లు (0)