‘ఎంట్రప్రెన్యూర్’ అనిపించుకోదగ్గ వ్యక్తికి కొన్ని స్వాభావిక లక్షణాలు ఉంటాయని పలు పరిశీలనలో వెల్లడయింది. స్వయం ఉపాధి రంగంలో ఉంటున్న వ్యక్తులందరికీ ఈ అంశాలు మార్గదర్శక సూత్రాలుగా ఉపయోగపడతాయనడంలో అతిశయోక్తి లేదు. తమలో వున్న ప్రతిభా, సామర్ధ్యాలను తమ ఆర్ధిక ప్రయోజనాలకై సొంతంగా వినియోగించుకోగల స్వభావాన్ని ఎంట్రప్రెన్యూర్ స్వభావమని డా॥ మిచెల్, ఎల్. క్యాస్ట్రో అంటాడు.
ఈ విధమైన ఎంట్రప్రెన్యూర్ స్వభావంగల వ్యక్తి కచ్ఛితంగా తన లక్ష్యాన్ని దర్శించగలిగే వాడయివుంటాడు. తాను దేన్నైతే లక్ష్యంగా దర్శించగల్గుతాడో దానికి వాస్తవ రూపం ఇవ్వడానికి ఎప్పుడూ కృషి చేస్తు వుంటాడు. మిఛెల్ ఇంకా ఈ దిగువ పేర్కొన్న అనేక లక్షణాలను ఒక ఎంట్రప్రెన్యూర్‌కు వుంటాయని భావిస్తాడు. మీలో ఒక ఎంట్రప్రెన్యూర్ వున్నదీ లేనిదీ మీరు ఈ కింది జాబితా ద్వారా చాలా సులభంగా తెలుసుకొనవచ్చు.
-బాధ్యతను స్వీకరించే గుణం వుంటుంది. తన జయాపజయాలకు పూర్తిగా తానే బాధ్యత వహిస్తాడు. మంచి జరిగితే అంతా తన గొప్పదనమేనని, చెడు జరిగితే అదంతా తన కింది ఉద్యోగుల పని సామర్థ్యం సరిగ్గా లేకపోవడమేనని, ‘తప్పు’ ఎదుటి వ్యక్తులపై తోసివేసే టైపు ఆలోచించరు.
-కష్టజీవి అయివుంటాడు. రోజుకు ఎక్కువ పనిగంటలు శ్రమిస్తాడు. అలా శ్రమిస్తూ వుండటమే విశ్రాంతిగా ఫీలవుతారు.
-రిస్క్ తీసుకుంటాడు. తన ప్రతిభా సామర్ధ్యాల పట్ల స్పష్టమైన అంచనా గల్గిన వ్యక్తిగా, రిస్క్ తీసుకోవటానికి ఎప్పుడూ సిద్దంగా వుంటాడు. అయితే తన సామర్థ్యాల పరిధిలో లేని అంశాన్ని జయించడం కోసం తన ప్రతిభను పందెం కాయడు.
-ఎప్పుడూ సృజనాత్మకంగా వుంటూ కొత్త విషయాలను కనిపెడుతుంటాడు.
-ఏ మార్పుకైనా సిద్ధంగా వుంటాడు. పరిస్థితులకనుగుణంగా తనను తాను మలుచు కోవటానికి వెనుకాడడు.
-తన ఆలోచనలపట్ల పూర్తి నమ్మకాన్ని ప్రకటిస్తాడు. అవి కచ్ఛితంగా ప్రయోజనాలను అందివ్వగలవని నిశ్చయంగా చెప్పగల్గుతాడు. అందుచేత తన ఆలోచనల మేరకు కార్యాచరణ ప్రణాళికను వేసుకుంటాడు.
-వ్యక్తిత్వానికి కట్టుబడి వుంటాడు.
-ఆశావాదిగా ప్రవర్తిస్తాడు. దిక్కు తోచని కారుచీకటిలో సైతం ఏదో ఒక సన్నని కాంతి పడుతుందని అది కచ్చితంగా తన ఉజ్వల భవితవ్యం వేపునకు నడిపిస్తుందని గట్టిగా విశ్వసిస్తాడు. తను కష్టజీవి కాబట్టి, కచ్చితంగా ఫలానా సాధికారికత తప్పనిసరిగా లభిస్తుందని నమ్ముతాడు. ఆశావాదం అంటే, పనిచేయడం మానేసి, లాటరీలో కోటి రూపాయలు తగుల్తాయని గుడ్డి కలలు కనడం కాదన్న సంగతి ఎంట్రప్రెన్యూర్‌కు బాగా తెలుసు. ఆ కోటి రూపాయలు సంపాదించటానికి తగిన కష్టం, శ్రమ పెట్టుబడిగా పెడితే, ఆ కోటి రూపాయలు సంపాదించడం సాధ్యం కాగలదన్న ఆశాభావంతో వుంటారు.
-సూక్ష్మగ్రాహిగా వుంటారు. తన చుట్టూతా వున్న పరిసరాలను నిశితంగా గమనిస్తూ, ఎప్పటికపుడు మనకు కావల్సిన ఉపయోగపడే సంశయాలను, వాటి వెనుక గల సాంకేతిక సర్వ సత్యాలను సులభంగా గ్రహిస్తాడు.
-ఆత్మవిశ్వాసాన్ని కలిగివుంటాడు.
-కృతనిశ్చయం ప్రకటిస్తారు. ఎంట్రప్రెన్యూర్ ఎప్పుడూ రెండు రకాల మాటలు వాడడు. ఫలానా విషయంలో ఆ విషయంపై రెండోసారి ఆలోచించడు. మంచైనా, చెడైనా భరించడానికి సిద్ధమవుతూ, బాధ్యత తీసుకోవటానికి ముందడుగు వేస్తూ కృత నిశ్చయంతో వ్యవహరిస్తాడు.
-స్వతంత్రతను కనపరుస్తాడు. ఎవరినీ తప్పు పట్టడు. ఎవరి మీదా ఆధార పడడు. తనకు గల స్వేచ్ఛను పూర్తి స్థాయిలో ప్రయోజనకరంగా మలుచు కోవటానికి ఎప్పుడూ స్వతంత్ర భావాలతో ప్రయత్నిస్తాడు.
-అవసరాలను గుర్తిస్తాడు.
-చక్కగా మాట్లాడుతాడు. తనకు కావల్సినదాన్ని విడమరచి చెబుతాడు. విషయాన్ని పొల్లుపోకుండా చేరవేయడంలో దిట్ట.
-విమర్శను ప్రొయాక్టివ్‌గా తీసుకుంటాడు. ఎవరైనా ఏదైనా అంటే గాయపడడు. మంచి చెడ్డలు ఆలోచిస్తాడు.
డా.హిప్నో పద్మా కమలాకర్ 9390044031 కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్







కామెంట్‌లు (0)