బ్రేకులు ఫెయిలై బస్సు బోల్తా..నలుగురు మృతి..32 మందికి గాయాలు
అంత్యక్రియలకు వెళ్తుండగా ఘటన
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు క్షతగాత్రులకు రూ. లక్ష పరిహారం :
ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దిగ్ర్భాంతి
ప్రమాద పరిస్థితులను
పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
నవతెలంగాణ-వికారాబాద్, ధరూర్
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిలై బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా వారి బంధువుల అంత్యక్రియల కోసం వికారాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో అనంతగిరి ఘాట్ రోడ్డులో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి ఇష్నపురంలో ఉరి వేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కేసారం గ్రామానికి చెందిన మంజుల ఆడబిడ్డ కావడంతో నారాయణరెడ్డి అంత్యక్రియలకు కేసారం గ్రామం నుంచి ప్రయివేట్ బస్సు మాట్లాడుకుని కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరారు. ఉదయం 8.30 గంటలకు అనంతగిరి గుట్ట మీద ఉన్న టిఫిన్ సెంటర్లో డ్రైవర్ తో పాటు అందరూ టిఫిన్ చేశారు.
అనంతరం బస్సు బయలుదేరగా అనంతగిరి ఘాట్ రోడ్ మూలమలుపులో నంది విగ్రహం దగ్గర బస్సు బ్రేకులు ఫెయిలైన విషయాన్ని గమనించిన డ్రైవర్ వాసు బస్సులో ఉన్న అందరికీ తెలిపాడు. దీంతో బస్సులో ఉన్న వారందరూ భయంతో కేకలు వేయగా అంతలోనే మూలమలుపు దాటిన వెంటనే బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు బస్సు అద్దాలను పగలగొట్టి బస్సులో ఉన్న వారిని బయటికి తీశారు. బస్సు ఒక్క వైపునకు ఒరిగి పడటంతో ఒకరి మీద ఒకరు పడి వయస్సు పైబడిన వృద్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ స్థానిక ఆస్పత్రులకు తరలించగా అక్కడ పరిస్థితి విషమించి మరో మహిళ మృతి చెందింది. మృతి చెందిన వారిలో కేసారం గ్రామానికి చెందిన ఎ. యాదమ్మ, అత్తేల్లి పద్మమ్మ, మాల పద్మమ్మ, శంకర్ పల్లి మండలం సింగపురం గ్రామానికి చెందిన ఆర్. ప్రమీళ ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణిస్తున్నారు.
ప్రమాద సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.
మంత్రి శ్రీధర్‌బాబు దిగ్ర్బాంతి
ప్రమాదంపై వికారాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వికారాబాద్ లోని ఆస్పత్రికి చేరుకుని, మృతుల కుటుంబాలను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకుంటామన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో ఉన్నారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై విదేశాల్లో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కూడా తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.
బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
అందించాలని సీఎస్‌కు ఆదేశం
అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం 10 గంటలకు జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించారు.
అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం
55 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్లు (0)