ప్రేమని అనంత ఆకాశంతో పోలుస్తారు. అక్కడ హద్దులు సరిహద్దులు ఉండవుగా! మరి మనుషులుండేది భూమ్మీద. నిర్దాక్షిణ్యంగా మనసుల మధ్య గీతలు గీసి విడగొట్టేయగలరు. అనుబంధాల స్థానంలో శత్రుత్వాన్ని నింపగలరు. ప్రేమకి విశాలమైన అర్థం ఉంది. అది కేవలం ఆడ మగ మధ్య ఉండే ఆకర్షణ మాత్రమే కాదు. మానవత్వానికి ఇంకో రూపం. మనసులో ప్రేమ తత్వం ఉండాలి. కుల మతాలకు సంబంధం లేకుండా ఈర్ష్యా ద్వేషాలు, అహంకార దర్పాలకు తావు లేకుండా మానవ మనుగడ ప్రశాంతంగా జరగాలంటే దయ, ప్రేమ మాత్రమే పరిష్కారాలు. అలా కాకుంటే సంహారాలు, మారణ హోమాలు, హాహాకారాలు, మృత్యుఘోష తప్పవు. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర కావచ్చు కాక, రగిలిన ఆ చితి మంటలు ఎప్పటికీ ఆరేవి కావు. మతోన్మాద రాజకీయ ఉగ్రవాదులు వాటిని ఆరనివ్వరు. అంతే.
కాలేజీలో చిన్న ప్రోగ్రామ్ జరుగుతోంది. నీలం రంగు చుడీదార్ వేసుకున్న అమ్మాయి స్టేజీ ఎక్కి మైక్ ముందు నుంచుంటుంది. ఏదో మాట్లాడాలనుకుంటుంది. కానీ నోట్లోంచి మాట రాదే. భయం, కంగారు, తడబాటు. సన్నగా మంద్రంగా గొణుక్కుంటున్నట్టు మాట్లాడుతూ మధ్య మధ్యలో అయోమయంగా అటూ ఇటూ చూస్తున్న అమ్మాయి కళ్లలో అప్పుడే లోపలికి వచ్చిన ఒక అబ్బాయిని చూడగానే ఒక చమక్. అప్పటిదాకా కనిపించిన గాభరా మచ్చుకి కూడా లేదు. అతన్ని చూడగానే నిల్చున్న భంగిమలో తెచ్చిపెట్టుకున్న వయ్యారం, చిన్న తల ఎగరివేత. ఇప్పుడు స్థిరమైన గొంతుతో తన ప్రసంగం వినిపిస్తోంది. ఆ అమ్మాయిని ఎంతో అపురూపంగా గొప్పగా చూసుకుంటూ నించున్నాడు అతను.
అది 1947. బ్రిటీష్ ఇండియా, పంజాబ్‌లోని సర్గోదా సిటీ. అక్కడి కాలేజీలో చదువుకునే సర్దారీ యువకుడు కీనూ. ముస్లిం అమ్మాయి జియా. ‘నా చెవులకు పెట్టుకున్న చాంద్ బాలి ఒకటి పడిపోయింది వెతికి పెట్టబ్బాయ్’ అని అందంగా హుకుం జారీ చేస్తే అది ఆమె తనకు మాత్రమే ఇచ్చిన పెద్ద బాధ్యతలాగా ఉబ్బితబ్బిబ్బయ్యే కీనూకి ప్రపంచం అంతా జియా తప్ప ఇంకేం కనబడట్లేదు.
చూపులు, వెక్కిరింతలు, కవ్వింతలు, జియాపై తనకున్న ప్రేమను చెప్పడానికి పిచ్చి కవిత్వాలు. రాయికి ప్రేమలేఖలు చుట్టి ఆమె ఇంటి ముందు నుంచి లోపలికి విసరడాలు. ఆకర్షణ నుంచి గాఢమైన ప్రేమగా, విడదీయలేని అనుబంధంగా రూపు దిద్దుకుంటుంది. ఇద్దరి మతాలు వేరు కదా మరి పెండ్లి ఎట్లా చేసుకుంటాం? ఇది పెద్ద సమస్య. ఓ పరిష్కారం ఉంది. చర్చిలో పెండ్లి చేసుకుందాం.
సరే అంటే సరే అని బాసలు చేసుకుంటారు.
సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటాడు కీను. కొందరు గుంపుగా అతని దారిని అడ్డుకుంటారు. హిందువులు, సిక్కులు ఈ హద్దు దాటి ముందుకు వెళ్లడానికి వీల్లేదంటారు. ఏం ఎందుకు వెళ్లకూడదు? ఈ ఊరు నాది, ఎక్కడికైనా వెళ్తాను. ఈ దేశం రెండు ముక్కలుగా విడిపోతోంది. ముస్లింల ప్రత్యేక దేశం ఏర్పడుతోంది. పాకిస్తాన్. సిక్కులు, హిందువులకు ఈ దేశంలో చోటు లేదు. అదేం లేదు. నెహ్రూ కానీ జిన్నా కాని తప్పనిసరిగా విడిపోవాలని చెప్పలేదు. ఎవరికి నచ్చిన చోట వారు ఉండవచ్చన్నారు. చెప్తే అర్థం కాదా.. వెళ్లిపో ఇక్కడి నుంచి. కీను హతాశుడయ్యాడు. ఏం జరుగుతోంది నా దేశంలో. ఇది నా ఊరు. నా ప్రాంతం. నేనెలా పరాయివాడినవుతాను. ఎక్కడ చూసినా అల్లరి మూకలు గుంపులు గుంపులుగా... ఎప్పుడు ఎటునుంచి గొడవలు ముంచుకు వస్తాయో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో చీకటి పడ్డాక జియాను కలవడానికి వెళ్తాడు కీను. బయట అల్లర్లు పెరిగిపోతున్నాయి. పరిస్థితులు చేజారి పోతున్నాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. నన్ను వదిలి వెళ్లిపోవుగా అంటుంది జియా. ఎప్పటికీ వెళ్లనని మాట ఇస్తాడు కీను. మరి ఇప్పటికి ఇంటికెళ్లనా వెళ్లు అని చెయ్యి ఊపుతుంది జియా.
ఈ అపురూపమైన ప్రేమకథలో ఎవరు విలన్? విడిపోతామనే భయం ఎందుకు? వారి మధ్య అడ్డంకి వారి కుటుంబాలు కాదు, ఏకంగా ఒక దేశమే వచ్చి అడ్డుగా నిలబడి పోయింది. కొన్ని ప్రేమకథలు ఇద్దరు మనుషుల గురించి మాత్రమే చెప్పవు. అవి ఒక కాలం గురించి చెప్తాయి. అప్పటి సమాజం గురించి చెప్తాయి. దేశ విభజన కేవలం రెండు మతాలను విడదీయలేదు. కుటుంబాలను విడదీసింది. అప్పటిదాకా స్నేహితులుగా ఉన్న పొరుగువారు అకస్మాత్తుగా మన శత్రు దేశస్థులయ్యారు. ఒక్కసారిగా జీవితాలు తల్లకిందులయ్యాయి.
ఇంతియాజ్ అలీ అనే దర్శకుడు ‘మై వాపస్ ఆవుంగా’ (నేను మళ్లీ తిరిగి వస్తాను) అనే సినిమా తీశారు. ప్రేమలు, బంధాలు, విడిపోవడం, ఎదురుచూపులు, జ్ఞాపకం, ఇవన్నీ కలిసి దేశ విభజనతో రక్తపు మరకలంటిన ప్రేమకథను చెప్పారు. పరిస్థితులు ఇద్దరినీ దూరం చేయవచ్చు. కాని నిజమైన ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదు. మనసులో ఎప్పటికీ సజీవమే. ఒకరిపై ఒకరికి ఎవరికీ అర్థం కాని అంతుపట్టనంత గాఢమైన ప్రేమ. ఈ గొప్ప ప్రేమ కథని పాకిస్తాన్ విభజన సమయాన్ని చూపుతూ చెప్పిన కథనం చాలా బావుంది.
మళ్లీ తిరిగి వస్తాను...
అర్థరాత్రి పెద్ద ఎత్తున నినాదాలు, అరుపులు, పెద్ద గుంపులు తోసుకు వస్తున్నట్లుగా శబ్దాలు. వారు కీను ఇంట్లోకి దూసుకురానున్నారు. ఇంట్లో మొత్తం పదిహేను మంది కుటుంబ సభ్యులు. గుండె గుప్పిట్లో పెట్టుకుని పారిపోవడానికి సిద్ధమయ్యారు. లేకుంటే మూకల చేతుల్లో హతం అవడం ఖాయం. ‘నేను రాను మీరు వెళ్లండి’ అంటాడు కీను. వెళ్లిపోనని జియాకి మాట ఇచ్చాడుగా! కానీ పారిపోవడం కంటే ఇంకో దారి లేదు. కీను కూడా కుటుంబంతో కలిసి పరుగులు తీశాడు. శరణార్థుల రైళ్లు కిక్కిరిసిపోయి ఉండేవి. అందులో చోటు దక్కడమే అదృష్టం. కుటుంబంతో కలిసి బతుకు జీవుడా అంటూ రైలెక్కిన కీనూ ‘నేను మళ్లీ తిరిగి వస్తాను’ తన ఊరి వైపు చూస్తూ పిచ్చివాడిలా అరుస్తాడు. కుటుంబాన్ని ఇండియాలో దించిన తర్వాత మళ్లీ సర్గోదా వెళ్తాడు రైల్లో. ఊర్లో జియానే కాదు తన ఇంటి మహిళలందరూ ఉన్నారు. వారిని కూడా తనతో తెచ్చుకోవాలి. కానీ పోలీసులు మళ్లీ ఇతన్ని రైల్లోకి తోసి ఇండియా పంపించేస్తారు. అల్లరి మూకల చేతుల్లో తన ఇంటి ఆడబిడ్డలు పడితే జరిగే దారుణాలు తెలుసు. కాబట్టి కీను నాయనమ్మ ఇంట్లోని ఆడపిల్లలందరి గొంతులు కోసి తానూ చంపేస్తుంది. తన ఇంటి ఆడవాళ్లని కాపాడుకోలేకపోయామని కీనుకి, కుటుంబానికి తీరని బాధ అది.
పాకిస్తాన్ నుంచి రైళ్లలో ఇండియాలోకి వచ్చి పడిన జనానికి శరణార్థుల శిబిరాల్లో జంతువుల కంటే హీనమైన పరిస్థితులు.
తిండికి కూడా కనాకష్టం. బతికుండీ జీవచ్ఛవాలు. రైళ్లలోనూ మారణహోమాలే. ఘోస్ట్ ట్రెయిన్స్ అనేవారు. రక్తం ఏరులై పారుతూ రైలు నిండా శవాలతో ఇండియా చేరిన రైలుబండ్లు భారత చరిత్రలోనే ఎప్పటికీ తుడవలేని పెద్ద రక్తపు మరకలు. అయితే ఇక్కడ ముస్లింలు హిందువులను చంపలేదు. అది ఉగ్ర మూకల విధ్వంసం. ఆ సమయంలో ఎన్నో ముస్లిం కుటుంబాలు హిందువులకు దొంగతనంగా రక్షణ కల్పించాయి. వారి పిల్లలను సురక్షిత ప్రాంతాలకు పంపించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి హిందూ కుటుంబాలను కాపాడిన ముస్లిం కుటుంబాలున్నాయి. ఇక్కడ చిచ్చు రెండు మతాలు, లేదా మతాలకు సంబంధించిన మనుషుల మధ్య కాదు. ఏ మతం వారైనా సామాన్య ప్రజలెప్పుడూ అమాయకులే. మత రాజకీయాలదే ఇక్కడ నేరం. ‘అవతల మా అమ్మమ్మ ఇల్లుంది’, ‘అక్కడ మా అమ్మ పుట్టింది’, ‘మా తాత సమాధి అక్కడే ఉంది’.. ఇవి పాకిస్తాన్ సరిహద్దుకు అవతల, ఇవతల ఉన్న మనుషుల మాటలు.
కీను, జియాల మనసులు దగ్గరైనప్పుడు వాళ్ల మధ్య గీత లేదు. తర్వాత ఒక గీత వచ్చింది. దేశాలు మారాయి. పాస్ పోర్టులు వచ్చాయి. వీసాలు వచ్చాయి.
నాలుగైదేళ్ల తర్వాత మళ్లీ సర్గోదా వెళ్లాడు కీను. జియాకు పెళ్లి అయిపోయింది. ఆమెను కలవకుండానే తిరిగి వచ్చేస్తాడు. తన ప్రపంచం ఇక ఇంతటితో ముగిసిపోయిందని అనుకుంటాడు. జీవితంలో డబ్బు సంపాదించాడు. పెళ్లి చేసుకున్నాడు. మనవళ్లు కూడా పెద్దవాళ్లయ్యారు. కానీ జియా స్థానం అతని మనసులో సుస్థిరం. ఎప్పటికీ వాడిపోని ప్రేమ. ఇప్పుడు కీను వయసు 95 ఏళ్లు. మరణశయ్య మీద ప్రాణం కొట్టుకుంటోంది కానీ పోవట్లేదు. ఒక్కసారి జియాను చూడాలి. ఈ లోకం విడిచిపోవడానికి అనుమతి అడగాలి. కీను మనవడు తాత మనసు తెలుసుకుని పాకిస్తాన్‌లోని సర్గోదాకి వెళ్తాడు. జియా చనిపోయి 10 ఏళ్లైందని, ఎప్పటికైనా కీను వస్తాడు నాకు మాట ఇచ్చాడని ఎదురు చూసిందని ఆమె కుటుంబం చెప్తుంది. పెయింటింగ్ చేసిన ఆమె పెద్ద ఫొటో ఫ్రేమ్‌ను చూపిస్తాడు మనవడు తన ఫోన్‌లో కీనుకి. తేరిపార చూస్తాడు కీను ఆ చిత్రపటాన్ని. చాంద్ బాలి ఒక చెవికే ఉంది. రెండో చెవికి లేదు. కీను ముఖంలో చిరునవ్వు. ఇంక సెలవిస్తావా.. వెళ్లనా అంటాడు. ఇంక వెళ్లు అని జియా నవ్వుతూ తమాషాగా చెయ్యి ఊపినట్లే కనిపిస్తుందతనికి. కళ్లారా చూసి ఆఖరి శ్వాస విడుస్తాడు.
శ్రీదేవి కవికొండల, 6281380827







కామెంట్‌లు (0)