Magazines

లొద్ద కులస్థుల జీవన స్థితిగతులపై అధ్యయనం

1 గంట క్రితం

A study on the living conditions of the Lodda community
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

సెస్ డైరెక్టర్ తో బీసీ కమిషన్ చర్చలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉన్న లొద్ద కులస్థుల సామాజిక, ఆర్థిక, విద్య, జీవన స్థితిగతుల అధ్యయనానికి సంబంధించి విధివిధానాలపై సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఇ.రేవతితో బీసీ కమిషన్ చర్చించింది. బుధవారం హైదరాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మెన్ జి.నిరంజన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సాంప్రదాయ కులవృత్తుల ఆధునీకీకరణ విషయంలో ఆయా కులస్థులు, మేధావుల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానించాలని కమిషన్ నిర్ణయించింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న 22 కార్పొరేషన్లు/ ఫెడరేషన్లకు 2026-27 సంవత్సరానికి గాను బడ్జెట్ లో దాదాపు రూ. 2,592.93 కోట్లు కేటాయించినప్పటికీ ఆ నిధులను విడుదల చేయకపోవడం, ఖర్చు చేయక పోవడం పట్ల కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయా కార్పొరేషన్ల చైర్మెన్లు ఎటువంటి పనులు చేపట్టకుండానే రెండు సంవత్సరాల పదవీ కాలం ముగియడం శోచనీయమని కమిషన్ అభిప్రాయపడింది. ముదిరాజ్ కులస్థులు కోరుతున్న బీసీ-డీ గ్రూప్ నుండి బీసీ-ఏ గ్రూప్‌కు మార్చే విషయంలో కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. ముదిరాజ్ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ మారిస్తే ప్రభావితమయ్యే ‘ఎ’ గ్రూప్‌లోని 57 కులాలు మరియు ‘డీ’ గ్రూప్‌లోని 34 కులాల గురించి కూడా అధ్యయనం చేసిన తర్వాతే ముదిరాజ్ కులస్థుల గ్రూప్ మార్పు గురించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని కమిషన్ అభిప్రాయపడింది. సీపెక్ సర్వే వివరాలను కూడా కమిషన్ పరిశీలించనున్నది. అదేవిధంగా బీసీ-డీ గ్రూప్ నుంచి ‘ఎ’ గ్రూప్‌కు మార్చమని కోరుతున్న సగర, ఉప్పర కులస్థుల వినతిని కూడా సమగ్ర సమాచారం వచ్చిన తర్వాత పరిశీలించాలని కమిషన్ నిర్ణయించింది. కమిషన్ కార్యాల యంలోని గ్రంథాలయాన్ని “బి.పి.మండల్ గ్రంథాల యం”గా, సమావేశ మందిరాన్ని “కె.ఎన్.అనంత రామన్ సమావేశ మందిరం”గా నామకరణం చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఆధునీకీకరించిన బి.పి.మండల్ గ్రంథాలయాన్ని ఈ ఏడాది నవంబర్ 14న రాష్ట్ర వెనుకబడిన సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, డాక్టర్ బాలలక్క్ష్మి రంగు, కమిషన్ మెంబర్ సెక్రెటరీ బి. బాల మాయ దేవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్