15న లక్ష మందితో బహిరంగ సభ : అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్
నల్లగొండలో 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ పోరాటా లకు కార్యాచరణ రూపొందించేందుకు నల్లగొండలో నిర్వహించనున్న 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభ కీలక వేదికగా నిలువనుందని జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ అన్నారు. మహాసభ సందర్భంగా నవంబర్ 15న నల్లగొండ పట్టణంలో లక్ష మందితో జరగనున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని గురువారం ఆయన పరిశీలించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర కోశాధికారి మూడో శోభనాయక్, జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డితో కలిసి సభా ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం విజ్జూ కృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ..
నవంబర్ 16 నుంచి 18వరకు నిర్వహిం చనున్న మహాసభకు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,200 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంపైనా, రైతులపైనా దాడులు కొనసాగిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కోటి 58 లక్షల మంది సభ్యులతో అఖిల భారత కిసాన్ సభ దేశంలోనే అతిపెద్ద రైతు సంఘంగా కొనసాగుతోందని వెల్లడించారు. మూడున్న రేండ్లుగా దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్య మాలు, సాధించిన విజయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ విధానాలపై మహా సభలో సమగ్రంగా చర్చించి, రాబోయే మూడేండ్లకు భవిష్యత్ కార్యాచరణ రూపొంది స్తామని వివరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత వ్యవసాయ రంగాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా విదేశీ సంస్థలకు వ్యవసాయ రంగాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి దిగుమతులపై సుంకాలను తొలగించడం, వంట నూనెల దిగుమతులపై సుంకాలను తగ్గించడం వంటి చర్యలు దేశీయ రైతులకు నష్టం కలిగిస్తాయన్నారు. అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల ప్రభావంపై మహాసభలో చర్చించనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర నాయకులు ఉడుత రవీందర్, ఎండి.హాషం, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎండీ సలీం, దండెంపల్లి సత్తయ్య, నలపరాజు సైదులు, పరిపూర్ణాచారి, భీమగాని గణేష్ ఉన్నారు.
భారీ ప్రదర్శన
వీర తెలంగాణ సాయుధ పోరాట గడ్డ నల్లగొండలో జరగనున్న అఖిల భారత కిసాన్ సభ మహాసభ తొలిరోజైన నవంబర్ 15న లక్ష మంది రైతులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నాం. వేలాది మంది యువ కార్యకర్తలతో రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతు ఉంటుంది. తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిబింబించే ఎగ్జిబిషన్‌ను నవంబర్ 14 నుంచి 17 వరకు నిర్వహించనున్నాం. రాష్ట్రంలోని సాంస్కృతిక అంశాలు, కళారూపాలను ప్రదర్శించేందుకు మూడు రోజులపాటు కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తాం. నవంబర్ 15న జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభకు మాజీ పార్లమెంటు సభ్యురాలు, జాతీయ నాయకులు బృందాకరత్ హాజరుకానున్నారు. అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌ల ప్రసంగాలుంటాయి.
- తీగల సాగర్
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి





కామెంట్లు (0)