Magazines

రాష్ట్రవ్యాప్తంగా రాత్రి సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్‌లు

1 గంట క్రితం

టీజీసీఎస్బీ డీజీ శిఖా గోయల్ వెల్లడి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

ముగిసిన నెల రోజుల అవగాహన కార్యక్రమాలు : టీజీసీఎస్బీ డీజీ శిఖా గోయల్ వెల్లడి

నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి

అన్ని పోలీస్ యూనిట్ల పరిధిలో అక్టోబర్ 30, 31 తేదీల్లో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ అక్టోబర్‌ ‌అవగాహన మాసోత్సవ కార్యక్రమాలు ఆదివారం రాత్రి సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్‌లతో విజయవంతంగా ముగిశాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌బీ) డీజీ శిఖా గోయెల్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హాజరయ్యారు. ప్రజలు ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాల నివారణలో నిరంతర ప్రజా అవగాహన, సమిష్టి అప్రమత్తత,సత్వర ఫిర్యాదుల ప్రాముఖ్యతను ఈ కార్యక్రమాలు చాటి చెప్పాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా వెలుగులోకి వస్తున్న సైబర్ ముప్పులు, మోసాల నివారణ, సురక్షిత డిజిటల్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు,వివిధ కమ్యూనిటీ సమావేశాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. బతుకమ్మ వేడుకలు, నవరాత్రి ఉత్సవాలు, దాండియా కార్యక్రమాల ద్వారా అవగాహనకల్పించారు. సమాజంలోని వివిధ వర్గాలకు ఆచరణాత్మకమైన సైబర్ భద్రతా సందేశాలను చేరవేశారు.

మారుతున్న సైబర్ మోసాల తీరును దృష్టిలో ఉంచుకుని నేరాల విధానాల ఆధారంగా మరియు బాధిత వర్గాల ఆధారంగా ప్రత్యేక అవగాహన వ్యూహాలను అమలు చేస్తోంది. తద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సైబర్ మోసాల పద్ధతులు, వాటి హెచ్చరిక సంకేతాలు మరియు నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తోంది.

‘ఆన్‌లైన్ బట్ అన్‌అఫ్రైడ్’, ‘సురక్షా కా తిరంగా’, ‘పాజ్. థింక్. వెరిఫై.’ వంటి కార్యక్రమాలను నిర్వహించింది. ‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్’ ప్రచారంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24,886 సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 15,48,905 మంది పౌరులకు అవగాహన కల్పించారు. ఒక్క నెలలోనే 4,248 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 2,78,428 మందిని భాగస్వాములను చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్