నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అండాల అక్రమ విక్రయాల వ్యవహారంలో డాక్టర్ పి.పద్మజ కీలక పాత్ర పోషించారని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. రెండేళ్లుగా ఈ అక్రమ వ్యాపా రం కొనసాగుతోందనీ, ప్రధాన నిందితుడితో రూ.4.91 లక్షల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఆధారాలున్నాయని తెలిపారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.
మూసీ ప్రాజెక్టుపై స్టేకు ఎన్జీటీ నిరాకరణ
మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు జారీ చేసిన పర్యావరణ అనుమతుల అమలును నిలిపివేయాలంటూ దాఖలైన అప్పీల్‌పై మధ్యంతర స్టే ఇచ్చేందుకు ఎన్జీటీ నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 3కు వాయిదా వేసింది.
లిఫ్టుల భద్రతకు ప్రత్యేక చట్టం
రాష్ట్రంలోని అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో లిఫ్టుల భద్రతకు ప్రత్యేక బిల్లును ఎనిమిది వారాల్లో రూపొందించి క్యాబినెట్ ఆమోదానికి సమర్పిం చాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. బిల్లు రూపకల్పనలో పిటిషనర్ సూచనలను పరిశీలించాలనీ, తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబరు 28కి వాయిదా పడింది.
అభ్యర్థులకు పూర్తి ఫీజు తిరిగివ్వాలి
జర్మనీలో ఉద్యోగాల పేరుతో శిక్షణ కార్యక్రమంలో చేరిన అభ్యర్థులకు వసూలు చేసిన పూర్తి ఫీజును తిరిగి చెల్లించాలని టామ్కాంను మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) డిమాండ్ చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ.4.10 లక్షల వరకు వసూలు చేసినందున పూర్తి మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని కోరింది. శిక్షణ, నియామక బాధ్యతలను ప్రయివేట్ సంస్థకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒప్పందాల వివరాలను బహిర్గతం చేయాలని సూచన చేసింది.
ఆన్లైన్లో హాజరైన కలెక్టర్
కోర్టు ఉత్తర్వుల అమలులో జాప్యంపై దాఖలైన ధిక్కరణ పిటిషన్లో కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా హైకోర్టుకు ఆన్లైన్లో హాజరయ్యారు. కొత్తపల్లి మండలంలో పట్టా భూమిని ప్రజావసరాలకు వినియోగించిన వ్యవహారంలో ప్రత్యామ్నాయ స్థలం లేదా పరిహారం కల్పించాలని గతంలో కోర్టు ఆదేశించింది. భూమిని పూర్వస్థితికి తీసుకొచ్చి పట్టాదారులకు అప్పగిస్తామని కలెక్టర్ తెలిపారు. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.







కామెంట్లు (0)