మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన సభకు హాజరు కాని పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయొద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంత్రి శ్రీధర్‌బాబుకు లేఖ రాశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలతో ఎంపీకి విభేదాలుండడంతో ఈ రకంగా వ్యంగ్యంగా లేఖ రాశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. శ్రీధర్‌బాబుకు వంశీకృష్ణ లేఖ రాస్తూ ‘మీరు, విజయ రమణారావు, మక్కాన్‌సింగ్‌లు మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిసింది. వ్యక్తిగత విశ్వాసాలను, మతపరమైన కార్యక్రమాలను నేను పూర్తిగా గౌరవిస్తాను. అయితే ఇటీవల విశాఖ ట్రస్టు కార్యక్రమానికి హాజరైనందుకే ఒక గిరిజన మహిళా ప్రజాప్రతినిధితో సహా కాంగ్రెస్ కార్యకర్తలకు షోకాజ్ నోటీసు సైతం ఇవ్వకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర విచారకరం. సొంత పార్టీ ఎంపీతో కలిసి పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడమే క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తే.. ఢిల్లీలో నిర్వహించిన సభకు హాజరు కాకపోవడాన్ని అంతకంటే తీవ్రమైన ఉల్లంఘనగా భావించాల్సి ఉంటుంది. కానీ ఈ ఒక్కసారి సహజ న్యాయసూత్రాలకు కట్టుబడి మక్కాన్‌సింగ్, విజయ రమణారావులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదని, వారిని సస్పెన్షన్ నుంచి మినహాయించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.






కామెంట్లు (0)