బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న
కమలంతో ప్రాంతీయ పార్టీలు రాజీ .. బీజేపీతో కాంగ్రెస్‌ది నిరంతర పోరాటం
ఢిల్లీలో కమలంతో గులాబీ ములాఖాత్ అవుతోందంటూ ఎద్దేవా
టీజీఎంఆర్ఈఐఎస్ సంయుక్తాధ్వర్యంలో జాతీయ విద్యా, మైనారిటీల సంక్షేమ దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ చెబుతున్న బీజేపీ నేతలకు గుజరాత్‌లోని ఆ రిజర్వేషన్లను రద్దు చేసే దమ్ముందా? అని ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ ఆయన వారిని నిలదీశారు. మతోన్మాద బీజేపీతో ప్రాంతీయ పార్టీలు రాజీ పడుతున్నాయని విమర్శించారు. ఆ పార్టీతో నిరంతరం పోరాడతామన్నారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకం అంటున్న బీఆర్ఎస్ కారు ఢిల్లీలోని మోడీ గల్లీలోకి వెళ్లగానే గులాబీ కాస్తా కమలం మాదిరిగా మారిపోతున్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (టీజీఎంఆర్ఈఐ ఎస్) సంయుక్తాధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీల సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
దేశంలో మెజారిటీ, మైనారిటీల సంక్షేమం, భద్రత కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. రాష్ట్రానికి టూరిస్ట్ (ముసాఫిర్) మాదిరిగా వచ్చే బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్రంలో అధికారం లోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తామనీ భయపెట్టాలని చూశారని గుర్తుచేశారు. ఆ పార్టీకి అధికారంలో ఉన్న గుజరాత్ లో అమల్లో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను తొలగించే దమ్ముందా? అని ప్రశ్నించారు. పేదలకు ఓటు హక్కు కల్పించడాన్ని రాజ్యాంగ రచన సమయంలోనే వారు వ్యతిరేకించారనీ, అయితే కాంగ్రెస్ అందరికీ ఓటు హక్కు కల్పించిందని అన్నారు. 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. పాతబస్తీకి మెట్రో విస్తరణ చేయలేదని తెలిపారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ మైనారిటీ పిల్లలకు ఉపకార వేతనాలను ఇవ్వడాన్ని నిలిపివేసిందని చెప్పారు. పాతబస్తీ, మైనారిటీ పిల్లలు ఏం పాపం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఏ మతంలో పుట్టాలనేది ఎవరి చేతిలో ఉండదనీ, ఆ మతం ఆధారంగా వివక్ష చూపించడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. దేశ జనాభాలో మైనారిటీలు 15 శాతం మంది ఉన్నారనీ, వారి అభివృద్ధిని విస్మరిస్తే దేశం అభివృద్ధి చెందదని తెలిపారు. మక్కాకు వెళ్లే వారిపై కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.10 వేలు చెల్లించేలా ఆదేశాలు తెస్తే, పేద ముస్లింలపై భారం పడకుండా దానిని రాష్ట్ర ప్రభుత్వమే భరిం చిందని గుర్తుచేశారు. తాము మనుషులమే తప్ప జంతువులం కాదనీ, కాంగ్రెస్ కు అన్ని మతాల ప్రజలు సమానమేనని స్పష్టం చేశారు.
స్వాతంత్ర్యం వచ్చాక తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యతనిచ్చారనీ, అందుకే తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు బాధ్యతలు అప్పగించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. దేశంలో ఐఐఐటీల నుంచి ఐటీఐ ల వరకు విద్యా విస్తరణ కు మౌలానా వేసిన పునాదే కారణమని చెప్పారు.
గచ్చిబౌలి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో దేశ యువత దూసుకెళ్లడానికి నాడు తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరంపరను కొనసాగిస్తున్నదని అన్నారు. పాతనగరంలో మెట్రో పనులను వేగవంతం చేశామనీ, మూసీ పునరుజ్జీవంతో నైట్ ఎకానమీ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మైనారిటీలందరూ ఒకే పక్షంగా అండగా నిలబడ్డారని ఆయన గుర్తు చేశారు. వారి కోసం ఏదైనా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. భూములు, ఆస్తులు ప్రభుత్వం వద్ద లేవనీ, ఇంకా ఏది అడిగినా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. పిల్లలు చదువులు, క్రీడలు, ఇతర ఏ అంశంలో ఆసక్తి కలిగి ఉంటే ఆ అంశంలో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాంటి వారికి అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)