ఛాయా సోమేశ్వరాలయంలో హెరిటేజ్ వాక్ ప్రారంభించిన కలెక్టర్ బి.చంద్రశేఖర్
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పురాతన, చారిత్రక కట్టడాలు, దేవాలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. ఇంటాక్ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ సమీపంలోని పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్వహించిన హెరిటేజ్ వాక్‌ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఛాయా సోమేశ్వరస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినదని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారని తెలిపారు. హెరిటేజ్ వాక్ ద్వారా ఆలయ చరిత్ర, విశిష్టతను మరింతగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. చారిత్రక కట్టడాల పరిరక్షణలో భాగంగా రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి బడ్జెట్ కేటాయించిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. ఇంటాక్ ఆధ్వర్యంలో ఆలయం వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇంటాక్ న్యూఢిల్లీ చైర్మెన్ అశోక్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పురాతన కట్టడాలను పునరుద్ధరించడం, వారసత్వ సంపదను సంరక్షించడమే ఇంటాక్ సంస్థ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. నల్లగొండ ఇంటాక్ చాప్టర్‌ను ప్రారంభించే నేపథ్యంలో ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. అంతకుముందు కలెక్టర్ ఇంటాక్ ప్రతినిధులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలోని శివలింగంపై ఛాయ (నీడ) ఏర్పడే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెరిటేజ్ డైరెక్టర్ అర్జున్ రావు, వెద్ కుమార్, సజ్జాద్ సాహిది, ధనుంజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)