105 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
27లక్షల విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ - వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఇప్పటికే 105 మంజూరు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కాజీపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.11కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. దేశ మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం జన్మదినాన శంకుస్థాపన చేయడం సంతోషాన్నిచ్చిం దన్నారు. మరోవైపు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను సెమీ రెసిడెన్షియల్ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 105 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి చాలా వరకు పూర్తవుతాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన తొలి పది దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలని సంకల్పించిందని చెప్పారు. ఈ పాఠశాలలు సెమీ రెసిడెన్షియల్ విధానంలో పనిచేస్తాయని వివరించారు. విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, టై, పుస్తకాలు, నోట్‌బుక్స్, బ్యాగులు అందించడంతో పాటు ఇంటి నుంచి పాఠశాలకు, తిరిగి ఇంటికి చేరుకునేలా ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పిస్తుందని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఉదయం అల్పాహార పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా అల్పాహారాన్ని తయారుచేసి, ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య అన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. వారంలో ఆరు రోజులు అల్పాహారంతో పాటు ప్రత్యామ్నాయ రోజుల్లో పాలు, రాగిజావ కూడా ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న ఆధునిక సదుపాయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మీడియా ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పేయి, టీ జీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, అజీజ్ ఖాన్, ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)