దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా పోలీసుల నిర్లక్ష్యం
తుప్రాన్ డీఎస్ పీ ని విచారణ అధికారిగా మార్చాలి : కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్
మెదక్ కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయం ముందు 48 గంటల నిరాహార దీక్షలు
వతెలంగాణ-మెదక్ టౌన్
కొనాయపల్లి దళితులపై దాడి చేసిన సర్పంచ్, వారీ అనుచరులను అరెస్ట్ చేయాలని, తుప్రాన్ డీఎస్పీ ని విచారణ అధికారిగా మర్చాలని కోరుతూ దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ముందు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షలను కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెదక్ జిల్లా దళితులపై దాడులకు నిలయంగా మారిందని అన్నారు. జిల్లాలో దళితులకు రక్షణ లేకుండా పోతున్నదని అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దళితుడుగా ఉన్నప్పటికీ జిల్లాలో దళితులపై దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అక్టోబర్ 18న జిల్లాలో కొనాయపల్లి, నవాబ్ పేట్ కుచారం, కిష్టాపూర్, ఎదులపల్లి గ్రామాల్లో దళితులపై దాడులు జరిగినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు.
కేసులు నమోదు చేయడంలో పోలీస్ లు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. దాడికి గురైన దళితులు 21 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా జిల్లా కలెక్టర్, ఎస్పీ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. దళితులపై దాడి చేసిన గ్రామ సర్పంచ్‌ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులపై దాడి చేసిన పట్టించుకోని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 20 లోపు అరెస్ట్ చేయకుంటే కొనాయపల్లి నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంసీఎఫ్ నాయకులు జెల్ల సుధాకర్ మాలమహానాడు జిల్లా అధ్యక్షులు కల్లూరి సంజీవ, టీ ఎం ఆర్ టీ ఎస్ సీనియర్ నాయకులు మన్నే బిక్షపతి, జిల్లా అధ్యక్షులు జె కుమార్, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవులు, కేవీపీ ఎస్ జిల్లా కార్యదర్శి కె నిరంజన్ దాసు, జిల్లా కమిటీ సభ్యులు కె నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె మల్లేష్, ఎన్ పీ ఆర్ డీ జిల్లా కార్యదర్శి కె యశోద, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)