జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్ సమావేశంలో పోలీసు అధికారులు
నవతెలంగాణ -ప్రత్యేక ప్రతినిధి
కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4సీ) సమన్వయంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) మంగళవారం హైదరాబాద్‌లోని టీజీఐసీసీసీలో జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్ (జేసీసీటీ-4), హైదరాబాద్ రీజియన్ సమావేశాన్ని నిర్వహిం చింది. ఈ సమావేశంలో తెలంగాణతో పాటు 13 రాష్ట్రాల న్యాయ అమలు సంస్థల నుంచి 45 మంది అధికారులు, I4సీ, సీఈఆర్టీ-ఇన్, ఎన్సీఆర్బీ, బీపీఆర్ అండ్‌డీ, ఆర్బీఐ, ఈడీ, డీఓటీ, సీబీఐ,ఐబీ, ఎన్ఎప్ఎస్యూ, తెలంగాణ ప్రభుత్వ ఐటీఈ అండ్సీ శాఖ - 11 భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ విభాగాలకు చెందిన దాదాపు 30 మంది పోలీసు అధికారులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్యూ) ప్రొఫెసర్ ఒకరు, క్వాడ్ కమిషనరేట్లు సహా తెలంగాణలోని ఇతర విభాగాలకు చెందిన సుమారు 50 మంది పోలీసు అధికారులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి, దర్యాప్తుల్లో పరస్పర సహకారం, హాట్స్పాట్ల గుర్తింపు, నేర ముఠాల పై సంయుక్త చర్యల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జేసీసీటీలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా మేవాత్, జామ్తారా, అహ్మదాబాద్, హైదరాబాద్, చండీగఢ్, విశాఖపట్నం, గువాహటిలలో ఏడు జేసీసీటీలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, జేసీసీటీ-4ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, అంతర్-సంస్థాగత సైబర్ సమన్వయంపై ఆ రోజు ఎజెండాను నిర్దేశించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ I4సీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) రాజేష్ కుమార్, దేశంలో సైబర్ నేరాల స్థితిగతులను వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, "ప్రధాన మంత్రి కార్యాలయం నిర్వహించిన గత రెండు సమీక్షల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024-25లో దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ఫిర్యాదులు 24శాతం పెరగగా, రాష్ట్రంలో 3శాతం తగ్గాయి. దేశవ్యాప్తంగా నష్టాలు 4శాతం మాత్రమే తగ్గితే, రాష్ట్రంలో 20శాతం తగ్గాయి. సైబర్ నేరం ఇప్పుడు ఒక వ్యవస్థీకృత పరిశ్రమగా మారింది. నేరం జరిగాక గొలుసు చివర డబ్బును రికవరీ చేయడం నుంచి, నేరాన్నే నిరోధించే దిశగా మనం మారాలి - నేరగాళ్లకు లక్ష్యం, బాధితుడిని చేరే మార్గం, ఫోన్ నంబర్, ఉపయో గించుకునే ఖాతా అందకుండా చేయాలి. ఈరోజు సిఫార్సులను ఢిల్లీకి తీసుకెళ్లి, దేశవ్యాప్తంగా ఏకీకృత చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం" అని అన్నారు. ఆ రోజు ఎజెండాను నిర్దేశిస్తూ శిఖా గోయల్ మాట్లాడుతూ, "సైబర్ నేరాలు అత్యంత వ్యవస్థీకృతమైన, దేశాంతర వ్యవస్థగా మారాయి. మనం ఖాతాలను బ్లాక్ చేస్తూ, స్కామ్ కేంద్రాలను ధ్వంసం చేస్తున్నప్పటికీ, సూత్రధారులు, ఆర్థిక సహాయకులు మనకు అందకుండానే ఉన్నారు. నేరగాళ్లు ఒకే నెట్‌వర్క్‌గా పనిచేస్తుంటే, మనం అధికార పరిధుల పరిమితుల్లో ఉన్నాం. కేసుల వారీ దర్యాప్తు నుంచి, రియల్ టైమ్ సమాచార మార్పిడి, బహుళ రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్లతో కూడిన సమన్వయ, ఇంటెలిజెన్స్ ఆధారిత విధానం వైపు మారడమే ఈరోజు మా లక్ష్యం" అని పేర్కొన్నారు.
I4సీ సీఈఓ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, స్కామ్ కాంపౌండ్లు ఆగ్నేయాసియా నుంచి ఆఫ్రికా, శ్రీలంక, ఇతర దేశాలకు తరలిపో తున్నాయని, ఒక్క రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాలు తమ ఎస్4సీలను నోటిఫై చేశాయని తెలిపారు. డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు విచారణ రాష్ట్రాలు తమ సమస్యలను కోర్టు ముందు ఉంచేందుకు ఒక అవకాశమని ఆయన పేర్కొ న్నారు. దర్యాప్తు అధికారుల పనిని సులభతరం చేసే రెండో తరం సంస్కరణలను ఆయన వివరిం చారు - ఏకీకృత దర్యాప్తు వేదిక, అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేసే అధికారం బ్యాంకులకు ఇచ్చే ఆర్బీఐ ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్ఓపీ), త్వరలో సైబర్ నేరాల మౌలిక వసతులపై దేశవ్యాప్త ప్రత్యేక ఆపరేషన్లు.ప్రతి సెషన్ తర్వాత బహిరంగ చర్చతో సాగిన అంశాల వారీ సెషన్లలో సైబర్ నేరాల నివారణ, ఛేదన; అంతర్-రాష్ట్ర సవాళ్లు, హోం మంత్రిత్వ శాఖ సమన్వయం (కర్ణాటక సైబర్ కమాండ్ డీజీపీ ప్రోనబ్ మొహంతి I4సీ డీసీపీ రష్మి శర్మ యాదవ్, నేతృత్వంలో); దర్యాప్తు సాధనాల జాతీయ వేదిక (I4సీ, ఎన్సీటీసీ డైరెక్టర్ పంకజ్ దేశ్ముఖ్ఐప); మహిళలు, పిల్లలపై ఆన్లైన్ నేరాలు; ఏఐ - చట్టపరమైన చట్రం, జవాబు దారీతనం (సైబర్ చట్ట నిపుణులు పవన్ దుగ్గల్); తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, తెలంగాణల ఉత్తమ పద్ధతులు; ఏఐ ఆధారిత గుర్తింపు; బహిరంగ వేదిక అంశాలపై చర్చించారు.నోడల్ అధికారులు, ఎస్కలేషన్ ప్రోటోకాల్‌లు, I4సీ వేదికల వినియోగాన్ని పెంచడం, బ్యాంకులు, టెలికాం, డిజిటల్ వేదికలకు నివారణ చర్యలు, మ్యూల్ ఖాతాలు, వ్యవస్థీకృత ముఠాలపై సమన్వయ వ్యూహం, సంయుక్త అంతర్-రాష్ట్ర ఆపరేషన్లు, కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికపై చర్చలు దృష్టి సారించాయి. ఈ సిఫార్సులను టీజీసీఎస్బీ డైరెక్టర్ క్రోడీకరించారు. తదుపరి చర్యల కోసం వీటిని పాల్గొన్న అన్ని రాష్ట్రాలు, సంస్థలకు పంపుతారు. ఆర్థిక సైబర్ మోసానికి గురైన పౌరులు వెంటనే 1930కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని, ఈ విషయంలో ప్రతి నిమిషం ముఖ్యమేనని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.







కామెంట్లు (0)